Mushroom Fried Rice Recipe: ఏదైనా స్పెషల్‌గా తినాలనిపించినప్పుడు.. ఇంట్లో ఉన్న పదార్థాలతోనే రుచికరమైన వంటకం చేసుకోవాలనుకుంటే మష్రూమ్ ఫ్రైడ్ రైస్ చేసుకోవచ్చు. మష్రూమ్స్‌కు కూరగాయలు, సాస్‌లు, మసాలాలు జత చేసి తయారు చేసే ఈ ఫ్రైడ్ రైస్ మంచి రుచితో పాటు చక్కని సువాసనను కూడా అందిస్తుంది. ముఖ్యంగా పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా చాలామంది ఇష్టపడే వంటకాల్లో ఇది ఒకటి. లంచ్ బాక్స్‌లో పెట్టడానికి, సాయంత్రం ఆకలిగా ఉన్నప్పుడు త్వరగా తయారు చేసుకోవడానికి కూడా ఇది చక్కగా సరిపోతుంది.
రెస్టారెంట్‌లో దొరికే రుచిని ఇంట్లోనే ఆస్వాదించాలంటే కొన్ని చిన్న చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. అన్నం పొడిపొడిగా ఉండేలా చూసుకోవడం, మష్రూమ్స్‌ను ఎక్కువసేపు ఉడికించకుండా వేయించడం ఈ రెసిపీలో ముఖ్యమైన విషయాలు. ఇప్పుడీ వంటకం తయారీ విధానంగా ఎలాగో తెలుసుకుందాం పదండి..
బియ్యం – ఒక కప్పు
మష్రూమ్స్ – 200 గ్రాములు
ఉల్లిపాయ – ఒకటి
క్యారెట్ – ఒకటి
క్యాప్సికమ్ – ఒకటి
పచ్చిమిర్చి – రెండు
వెల్లుల్లి రెబ్బలు – 5
స్ప్రింగ్ ఆనియన్స్ – రెండు టేబుల్ స్పూన్లు
సోయా సాస్ – ఒక టేబుల్ స్పూన్
చిల్లీ సాస్ – ఒక టీస్పూన్
మిరియాల పొడి – అర టీస్పూన్
ఉప్పు – తగినంత
నూనె – రెండు టేబుల్ స్పూన్లు
Also Read: బేకరీ కేక్‌లను మరిపించేలా.. ఇంట్లోనే సూపర్ సాఫ్ట్‌గా చాక్లెట్ మగ్ కేక్ తయారీ!
మీకు కావాల్సినంత బియ్యాన్ని శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు పోసి పొడిపొడిగా ఉండేలా ఉడికించాలి. అన్నం ఉడికిన తర్వాత చల్లారనివ్వాలి. ముందుగా వండిన అన్నాన్ని ఉపయోగిస్తే ఫ్రైడ్ రైస్ మరింత బాగా వస్తుంది.
ఇప్పుడు మష్రూమ్స్‌ను శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయ, క్యారెట్, క్యాప్సికమ్, పచ్చిమిర్చి, వెల్లుల్లిని కూడా చిన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి.
తర్వాత స్టవ్‌పై పాన్ పెట్టి నూనె వేడి చేయాలి. అందులో వెల్లుల్లి, పచ్చిమిర్చి వేసి వేయించాలి. ఆ తర్వాత ఉల్లిపాయలు వేసి కొద్దిగా వేగిన తర్వాత క్యారెట్, క్యాప్సికమ్ ముక్కలు వేయాలి. కూరగాయలు మరీ మెత్తగా కాకుండా కొద్దిగా క్రంచీగా ఉండేలా వేయించుకోవాలి.
ఇప్పుడు మష్రూమ్స్ వేసి మంట పెంచి రెండు మూడు నిమిషాలు వేయించాలి. తర్వాత సోయా సాస్, చిల్లీ సాస్, మిరియాల పొడి, ఉప్పు వేసి బాగా కలపాలి. చివరగా ఉడికించి చల్లార్చిన అన్నం వేసి ముక్కలు విరగకుండా మెల్లగా కలపాలి. రెండు నిమిషాలు వేడి చేసిన తర్వాత స్ప్రింగ్ ఆనియన్స్ చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే.. వేడివేడిగా, మంచి సువాసనతో ఉండే మష్రూమ్ ఫ్రైడ్ రైస్ సిద్ధం. దీనిని టమాటా సాస్ లేదా మంచూరియన్‌తో కలిపి తింటే మరింత రుచిగా ఉంటుంది.
Also Read: స్వీట్ షాప్ టేస్ట్ గ్యారెంటీ.. ఇంట్లోనే ఈజీగా చేసుకోదగ్గ నెల్లూరు మలైకాజా రెసిపీ!