Diabetes Without Medicines| డయాబెటిస్ (మధుమేహం) అనేది జీవితాంతం ఉండే ఆరోగ్య సమస్య. రక్తంలో చక్కెర నియమిత స్థాయి కంటే ఎక్కువ ఉన్నప్పుడు శరీరంలో దాన్ని నియంత్రించేందుకు ఇన్సులిన్ ఉత్పత్తి జరుగుతుంది. కానీ ఇన్సులిన్ తక్కువగా ఉత్పత్తి జరిగినా లేకపోతే అసలు జరగకపోయినా అప్పుడు మధుమేహం అంటే డయాబెటీస్ సమస్య వస్తుంది. డాక్టర్లు ఈ సమస్యకు మందులు లేదా ఇన్సులిన్ ఇంజెక్షన్ తీసుకోవాలని సూచిస్తుంటారు.
అయితే, షుగర్‌ని నియంత్రించడానికి మందులు తప్పకుండా అవసరమా? మందులు లేకుండా సహజంగా షుగర్ ని నియంత్రించలేమా? అని ప్రశ్న తలెత్తుతుంది. చాలా మంది రోగులకు మనసులో ఈ ప్రశ్న ఉంటుంది: మందులు లేకుండా రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించవచ్చా? దీనికి సమాధానం, “అవును, కొన్ని సందర్భాల్లో ఇది సాధ్యమే” అని ఢిల్లీలోని పీఎస్‌ఆర్‌ఐ ఆసుపత్రిలో సీనియర్ కన్సల్టెంట్ (ఎండోక్రినాలజీ మరియు డయాబెటిస్) డాక్టర్ హిమికా చావ్లా చెబుతున్నారు.
ప్రీడయాబెటిస్ ఉన్నవారు లేదా టైప్-2 డయాబెటిస్ ప్రారంభ దశలో ఉన్నవారు. రక్తంలో చక్కెర స్థాయి ఎక్కువగా పెరగనప్పుడు, జీవనశైలిలో మార్పులతో షుగర్‌ను నియంత్రించవచ్చు. ఇందుకు ముఖ్యంగా సమతుల ఆహారం అవసరం.
సమతుల ఆహారం తీసుకోండి: డయాబెటిస్ ఉన్నవారు తమ ఆహారంలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండే ఆహారాలను చేర్చుకోవాలి. ఉదాహరణకు, హోల్ గ్రెయిన్స్, ఆకుకూరలు, పప్పు ధాన్యాలు, తక్కువ చక్కెర ఉన్న పండ్లు. అలాగే తెల్ల బియ్యం, చక్కెర, తీపి పానీయాలు, ప్రాసెస్ చేసిన ఆహారాలకు (ఫాస్ట్ ఫుడ్) పూర్తిగా దూరంగా ఉండాలి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిని త్వరగా పెంచుతాయి.
రోజూ వ్యాయామం చేయండి: రోజూ కనీసం 30 నిమిషాల పాటు వేగంగా నడవడం లేదా యోగా చేయడం శరీరంలో ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది. ఇది రక్తంలో చక్కెరను నియంత్రణలో ఉంచడానికి సహాయపడుతుంది. శారీరక శ్రమ వల్ల చక్కెర శక్తిగా మారుతుంది.
బరువును నియంత్రించండి: ఊబకాయం డయాబెటిస్‌కు ఒక పెద్ద కారణం. బరువు తగ్గడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి మరియు మందుల అవసరం కూడా తగ్గుతుంది. ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడం చాలా ముఖ్యం.
ఒత్తిడిని తగ్గించండి: ఒత్తిడి రక్తంలో చక్కెర స్థాయిలపై నేరుగా ప్రభావం చూపిస్తుంది. ధ్యానం, ప్రాణాయామం, తగినంత నిద్ర తీసుకోవడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. ఇది శరీరం బాగా పనిచేయడానికి సహాయపడుతుంది.
రెగ్యులర్ చెకప్‌లు చేయించుకోండి: మీరు మందులు వాడకుండా జీవనశైలి ద్వారా షుగర్‌ను నియంత్రిస్తున్నట్లయితే, రక్తంలో చక్కెర స్థాయిలను క్రమం తప్పకుండా తనిఖీ చేయించుకోవడం చాలా అవసరం. ఇది మీ పరిస్థితిని సమయానికి అంచనా వేయడానికి సహాయపడుతుంది.
Also Read: గుండె ధమనుల్లో పూడికలు ప్రాణాంతకం.. ఆయుర్వేద టిప్స్‌తో ఇలా క్లీన్ చేసుకోండి
మందులు లేకుండా షుగర్‌ను నియంత్రించడం సాధ్యమే, కానీ ఇందుకు పూర్తి అంకితభావం, క్రమశిక్షణ అవసరం. అయితే, ప్రతి వ్యక్తి పరిస్థితి భిన్నంగా ఉంటుంది. కాబట్టి, డాక్టర్‌ను సంప్రదించకుండా మందులు ఆపడం ప్రమాదకరం. జీవనశైలిలో మార్పులు చేస్తూ, డాక్టర్ సలహాతో ముందుకు సాగితే, షుగర్‌ను సమర్థవంతంగా నియంత్రించవచ్చు.