వేసవికాలం ముగిసి వర్షాకాలంలో అడుగుపెట్టేశాం. వేడిగా ఉండే వాతావరణం నుంచి తేమతో కూడిన వాతావరణానికి చేరుకున్నాం. కాబట్టి ఆహారం విషయంలో, పరిశుభ్రత విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు ప్రతిరోజు తినే ఆహారం విషయంలోనూ జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలని ఆయుర్వేదం చెబుతోంది. ఆయుర్వేదం ప్రకారం ప్రతి ఆహారాన్ని తినేందుకు ఒక సీజన్ ఉంటుంది. అలా వర్షాకాలంలో కూడా కొన్ని రకాల ఆహారాలను అధికంగా తినాలి. అలాగే వానాకాలంలో తినకూడని ఆహారాలు కూడా కొన్ని ఉన్నాయి.
మినపప్పు
ఆయుర్వేదం చెబుతున్న ప్రకారం వర్షాకాలంలో కొన్ని రకాల పప్పులను ఎంత తక్కువగా తింటే అంత మంచిది. అవి జీర్ణక్రియకు కష్టంగా ఉంటాయి. అరగక పొట్ట ఇబ్బంది, అసౌకర్యం వంటివి కలుగుతాయి. వాటిలో మినప్పప్పు ఒకటి. రాత్రిపూట మినప్పప్పుతో చేసిన ఆహారాల తినడం వల్ల అజీర్ణం సమస్య రావచ్చు. అలాగే గుండెల్లో మంట, పుల్లని తేన్పులు కూడా వస్తాయి. ఎందుకంటే మినప్పప్పు బరువైనది. ఇది జీర్ణం చేయడానికి చాలా సమయం పడుతుంది. శరీరంలో పిత్తం అధికంగా ఉత్పత్తి అవుతుంది. కాబట్టి వర్షాకాలంలో మినప్పప్పుకు దూరంగా ఉంటే మంచిది. ముఖ్యంగా రాత్రిపూట తినకుండా ఉండాలి. అంతగా తినాలనిపిస్తే ఉదయం సమయంలోనే తిని వాకింగ్ వంటివి చేయడం ఉత్తమం.
పచ్చిశనగపప్పు
పచ్చిశనగపప్పుతో వడలు, గారెలు, కూరలు చేసుకుని తినే వారి సంఖ్య ఎక్కువే. అయితే వర్షాకాలంలో శెనగపప్పుని ఎంత తక్కువగా తింటే అంత మంచిది. దీనిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. కాబట్టి సులభంగా జీర్ణం కాదు. ఇది జీర్ణం అవ్వడానికి చాలా సమయం పడుతుంది. రాత్రిపూట శనగపప్పుతో ఉన్న ఆహారాలు తిన్నాక పడుకుంటే కడుపు ఉబ్బరం రావచ్చు. అలాగే శనగపప్పుతో చేసిన ఆహారాన్ని తిన్నాక వెంటనే పడుకోవడం, కూర్చోవడం వంటివి చేయకూడదు. వీలైనంతవరకు వాకింగ్ చేయాలి. లేకపోతే పొట్ట బరువుగా మారి ఇబ్బంది పడతారు.
ఉలవలు
ఉలవలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని ఒకప్పుడు గుర్రాలకే తినిపించేవారు. కానీ ఇందులోనే పోషక విలువలు తెలిశాక మనుషులు కూడా తినడం ప్రారంభించారు. దీన్ని కుల్తీ పప్పు అని కూడా పిలుస్తారు. అయితే వర్షాకాలంలో మాత్రం ఉలవలతో చేసిన ఆహారాలు తక్కువగా తింటే అంత మంచిది. ఈ ఉలవలు జీర్ణం కావడం చాలా కష్టం. జీర్ణ సంబంధిత సమస్యలు వీటివల్ల వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఉలవలతో చేసిన ఆహారాలను వర్షాకాలంలో తక్కువగా తినాలి. అలా కాకుండా ఆహారం తిన్నాక వాకింగ్ చేసే అలవాటు ఉంటే మాత్రం మీరు ఈ పప్పులను సంతోషంగా తినవచ్చు.
అలాగే శనగపప్పు, మినప్పప్పు, ఉలవలతో పాటు రాజ్మాను కూడా ఎంత తగ్గిస్తే అంత మంచిది. రాజ్మా తిన్నాక శరీరంలో వేడి ఉత్పత్తి అవుతుంది. ఇది అజీర్ణ సమస్యను పెంచేస్తుంది. పొట్ట ఉబ్బినట్టు అవుతుంది. కాబట్టి వానాకాలంలో తక్కువగా తింటే మంచిది. ముఖ్యంగా రాత్రిపూట తినకపోవడమే ఉత్తమం.