Jubilee Hill Bypoll: తెలంగాణలో ఉప ఎన్నిక రానుంది. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాధ్ ఇటీవల మరణించడంతో ఆ సీటు ఖాళీ అయ్యింది. కొద్దిరోజుల్లో ఆ సీటుకు సంబంధించి నోటిఫికేషన్ రానుంది. అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి ముగ్గురు అభ్యర్థులు రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఎన్నికకు దూరంగా ఉండాలని భావిస్తోందట బీఆర్ఎస్. బీజేపీ నుంచి గతంలో పోటీ చేసిన వ్యక్తికి టికెట్ కేటాయించే అవకాశం ఉంది.
తెలంగాణలో ఉప ఎన్నికలకు రంగం సిద్ధమైంది. గెలుపు గుర్రాల కోసం ప్రధాన పార్టీలు దృష్టి పెట్టాయి. 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున మాగంటి గోపీనాథ్ విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి అజారుద్దీన్‌పై 16 వేల మెజార్టీతో గట్టెక్కారు. అనారోగ్యం కారణంగా ఇటీవల ఆయన మరణించారు. దీంతో జూబ్లీహిల్స్ సీటుకి ఎన్నిక అనివార్యమైంది. అధికార పార్టీ నుంచి చాలామంది నేతలు రేసులో ఉన్నారు. గతంలో పోటీ చేసిన అజారుద్దీన్‌తోపాటు పీజేఆర్ కూతురు విజయారెడ్డి, నవీన్ యాదవ్, మేయర్ విజయలక్ష్మి సీటు కోసం ప్రయత్నాలు మొదలు పెట్టినట్టు గాంధీభవన్ వర్గాల మాట.
అధికార పార్టీ నాయకులు ఆ నియోజకవర్గంపై కన్నేశారు. ఉప ఎన్నిక బరిలో కాంగ్రెస్ అభ్యర్థిగా తాను పోటీ చేస్తానని క్లారిటీ ఇచ్చేశారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు మహ్మద్ అజారుద్దీన్. గురువారం తన నివాసంలో మీడియాతో మాట్లాడిన ఆయన, గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేశానని అన్నారు.
చివరి నిమషంలో టికెట్ కేటాయించడంతో ప్రచారానికి సమయం సరిపోలేదని, అయినప్పటికీ చివరివరకు పోరాటం చేశారని అంటున్నారు. తక్కువ మెజార్టీతో ఓడిపోయానని చెప్పుకొచ్చారు. లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో అత్యధిక ఓట్లు జూబ్లీహిల్స్ నుంచి కాంగ్రెస్ పార్టీకి వచ్చాయని గుర్తు చేశారు.
ALSO READ: మొత్తం 650 మంది ఫోన్లు ట్యాప్.. ప్రభాకర్ రావు విచారణలో సంచలన నిజాలు
ఈ నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి ఏడాదిన్నరగా పని చేస్తున్నామని చెప్పుకొచ్చారు. పలుమార్లు బూత్ స్థాయి, డివిజన్ స్థాయిలో సమావేశాలు నిర్వహించినట్టు తెలిపారు. బైపోల్‌లో కాంగ్రెస్ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తంచేశారాయన. పార్టీలో కొంతమంది కావాలని సోషల్ మీడియాలో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
తనకు టికెట్ ఇవ్వలేదని ప్రచారం చేస్తున్నారని ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లానన్నారు. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థిని తానేనని చెప్పకనే చెప్పారు. టికెట్ రేసులో నవీన్ యాదవ్‌తోపాటు విజయారెడ్డి, మేయర్ విజయలక్ష్మి ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి కాంగ్రెస్ హైకమాండ్ ఎవరివైపు మొగ్గు చూపుతుందో చూడాలి.
బీజేపీ నుంచి గతంలో పోటీ చేసిన దీపక్‌రెడ్డి అయితే బాగుంటుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్ బరిలోకి దిగుతుందా? ఎమ్మెల్సీ ఎన్నికల మాదిరిగా దూరంగా ఉంటుందా? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కొందరైతే దూరంగా ఉండడమే బెటరని అంటున్నారు.