పాదాలు పొడిగా మారి పగుళ్ళు ఏర్పడుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఎంతోమంది మహిళలు తమ చీరలతోనే పాదాలను దాచుకుంటారు. కానీ లెగ్గిన్స్, యాంకెల్ లెన్త్ ప్యాంట్లు వేసుకున్న మహిళలకు మాత్రం పాదాలు బయటికి కనిపిస్తాయి. పార్లర్‌కు వెళ్లి పెడిక్యూర్ చేయించుకోవాలంటే బోలెడంత ఖర్చు పెట్టాలి. అందుకే ఎంతోమంది పాదాలను అలా వదిలేస్తూ ఉంటారు.
మీరు పార్లర్ కి వెళ్లాల్సిన అవసరం లేకుండానే ఇంట్లో పెడిక్యూర్ చేయించుకోవచ్చు. ఎందుకోసం చాలా సులభమైన మార్గాలు ఉన్నాయి. ఇంట్లోనే పెడిక్యూర్ చేసుకోవడం కోసం పెద్దగా ఉత్పత్తుల కొనాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఉన్న వాటినే సులువుగా వాడుకోవచ్చు.
ఇంట్లోనే పెడిక్యూర్ కోసం మీకు ఏ వస్తువులు అవసరమో ఇక్కడ ఇచ్చాము. నెయిల్ కట్టర్, ఫ్యూమిస్ స్టోన్, బ్రష్, బఫర్, నెయిల్ పాలిష్, ఫుట్ క్రీమ్, బకెట్, గోరువెచ్చని నీళ్లు, శుభ్రమైన టవల్, కండిషనర్, నూనె
పెడిక్యూర్ స్టెప్ బై స్టెప్
ముందుగా కాలి గోళ్లకున్న నెయిల్ పాలిష్ ను రిమూవర్ తో శుభ్రం చేయండి. గోళ్లను కత్తిరించి మీరు కావలసిన ఆకృతికి మార్చుకోండి. అక్కడున్న పొడి చర్మాన్ని శుభ్రం చేయండి. ఒక బకెట్ తీసుకొని అందులో గోరువెచ్చని నీరు వేయండి. అలాగే గ్రీన్ టీ బ్యాగులు లేదా నిమ్మకాయ ముక్కలు, మూడు స్పూన్ల తేనె వేసి బాగా కలపండి. పాదాలను అందులో పెట్టి కాసేపు నానబెట్టండి. తర్వాత పాదాలను స్క్రబ్ చేయండి. ఇందుకోసం తేనె, చక్కెర, ఆలివ్ నూనె కలిపి మిశ్రమం తయారు చేయండి. దాన్ని పాదాలకు రాసి స్క్రబ్బర్ తో బాగా రుద్దండి.
కండిషనర్ ను అప్లై చేసి ఒక నిమిషం పాటు మళ్ళీ నీటిలో నానబెట్టండి. ఇప్పుడు వేళ్ళు, కీళ్ల మధ్య కూడా బాగా స్క్రబ్ చేయండి. ఆ తర్వాత మంచి నీటితో పాదాలను శుభ్రంగా కడగండి. పొడి టవల్ తో తుడవండి. ఫుట్ క్రీమ్ ను లేదా నూనెను పాదాలకు వేసి బాగా మసాజ్ చేయండి. అరికాళ్లపై తేలికపాటి ఒత్తిడి పడేలా మసాజ్ చేయండి. మీకు నచ్చిన నెయిల్ పాలిష్ ను రెండు కోట్ లు వేసుకోండి. 24 గంటల పాటు ఎలాంటి సాక్సులు ధరించకండి. అంతే పార్లర్ లాంటి పెడిక్యూర్ సిద్ధమైనట్టే. దీని తరచూ చేస్తూ ఉంటే మీకు అందమైన పాదాలు లభిస్తాయి.