Indian Railway Food: భారతీయ రైల్వేలో చక్కటి ఫుడ్ అందిస్తున్నామని రైల్వేశాఖ చెప్తున్నప్పటికీ, వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. 2024-25లో ఏకంగా ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC)కి ఫుడ్ క్వాలిటీకి సంబంధించి 6,645 ఫిర్యాదులు వచ్చాయని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. రాజ్యసభకు లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ ఫిర్యాదులలో ఎక్కువగా ఫుడ్ క్వాలిటీగా లేదని చెప్పినవే ఎక్కువగా ఉన్నాయన్నారు.
1.341 మంది కాంట్రాక్టర్లపై చర్యలు
ఈ ఫిర్యాదులను అన్నింటిని క్షుణ్ణంగా పరిశీలించినట్లు అశ్విని వైష్ణవ్ తెలిపారు. వీటిలో 1,341 కేసులకు సంబంధించి ఆహార సరఫరా చేసే కాంట్రాక్టర్లకు జరిమానాలు విధించినట్లు వెల్లడించారు. 2,995 కేసులలో హెచ్చరికలు చేసినట్లు తెలిపారు. 1,547 కేసులలో తగిన సలహాలు అందించినట్లు వివరించారు. మిగిలిన 762 కేసులలోనూ తగిన చర్యలు తీసుకున్నట్లు వైష్ణవ్ సమాధానంలో తెలిపారు.
ఎంపీ జాన్ బ్రిట్టాస్ ప్రశ్నకు సమాధానం ఇచ్చిన వైష్ణవ్
సీపీఐ(ఎం) రాజ్యసభ సభ్యుడు జాన్ బ్రిట్టాస్ రైళ్లలో ఆహార నాణ్యతపై ఆందోళన వ్యక్తం చేశారు. కాంట్రాక్టుల కేటాయింపులో పారదర్శకత ఉండాలన్నారు. “ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) వందే భారత్, ఇతర సుదూర సేవలతో సహా పలు రైల్వే మార్గాలలో కాంట్రాక్టులను ఒక కార్పొరేట్ కంపెనీకి ఇచ్చిందా?” అని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్ రాతపూర్వక సమాధానం చెప్పారు. రైల్వే క్యాటరర్ల నుంచి అపరిశుభ్రమైన ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకున్న సందర్భాలు, ఆహార భద్రత, నాణ్యతకు సంబంధించి ప్రయాణీకులు చేసిన ఫిర్యాదులకు సంబంధించిన వివరాలను అందించారు. కల్తీ, పరిశుభ్రమైన ఆహారం ప్రయాణీకులకు అందిస్తే జరిమానాలు విధించడంతో పాటు, క్రమశిక్షణా చర్యలు, కౌన్సెలింగ్, హెచ్చరికలు చేస్తున్నట్లు తెలిపారు. వీలైనంత త్వరగా చర్యలు చేపడుతున్నట్లు వైష్ణవ్ వెల్లడించారు.
Read Also: 2.5 కోట్ల IRCTC యూజర్ ఐడీలు ఔట్, మీ అకౌంట్ ఉందో లేదో చెక్ చేసుకోండి!
అటు వందే భారత్, ఇతర సుదూర రైళ్లతో సహా అన్ని రైళ్లలో ఆన్ బోర్డ్ క్యాటరింగ్ సేవల కోసం సర్వీస్ ప్రొవైడర్లను ఎంచుకోవడానికి IRCTC క్రమం తప్పకుండా టెండర్లను ఆహ్వానిస్తుందన్నారు అశ్విని వైష్ణవ్. “టెండర్ పత్రాలలో నిర్దేశించిన నిబంధనలు, షరతుల ప్రకారం, అత్యధిక బిడ్డర్లకు పారదర్శక ప్రక్రియ ద్వారా ఈ టెండర్లు ఇస్తున్నాం. ఈ వివరాలు అన్నీ రైల్వే వెబ్ సైట్ లో అందిరికీ కనిపిస్తాయి. ప్రస్తుతం, రైళ్ల క్లస్టర్ల కాంట్రాక్టులను IRCTC 20 సంస్థలకు అప్పగించింది” అని చెప్పారు. రైల్వే ప్రయాణీకులకు మెరుగైన సేవలతో పాటు నాణ్యమైన ఆహారాన్ని అందించేందుకు కీలక చర్యలు తీసుకుంటున్నట్లు రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ప్రయాణీకులకు ఏమాత్రం ఇబ్బంది కలిగినా వెంటనే ఫిర్యాదు చేయవచ్చన్నారు. సమస్య తీవ్రతను బట్టి చర్యలు తీసుకుంటామన్నారు.
Read Also: విశాఖకు వెళ్లే పలు రైళ్లు క్యాన్సిల్, మీరు వెళ్లే ట్రైన్స్ ఉన్నాయేమో చూడండి!