పారాసిటమాల్ అనేది నొప్పి, జ్వరాన్ని తగ్గించడానికి ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా ఉపయోగించే మందుల్లో ఒకటి. మహిళలు గర్భవతిగా ఉన్న సమయంలో అవసరమైన పరిస్థితుల్లో వైద్యులు కూడా ఈ మందును సూచిస్తుంటారు. అయితే గత కొన్నేళ్లుగా గర్భవతిగా ఉన్నప్పుడు పారాసిటమాల్ వాడితే పుట్టబోయే పిల్లల్లో ఆటిజం, బుద్ధిమాంద్యం లాంటి సమస్యలు వచ్చే అవకాశం పెరుగుతుందని కొన్ని అధ్యయనాలు సూచించాయి. దీంతో చాలా మంది గర్భిణీలు ఆందోళన చెందుతున్నారు.
అయితే తాజాగా జామా ఇంటర్నల్ మెడిసిన్ జర్నల్‌లో ప్రచురితమైన కొత్త అధ్యయనం ఈ భయాలకు కొంతవరకు చెక్ పెట్టింది. వైద్యుల సూచన మేరకు అవసరమైన సమయంలో పారాసిటమాల్ తీసుకోవడం వల్ల పిల్లల్లో ఆటిజం లేదా బుద్ధిమాంద్యం వచ్చే ప్రమాదం పెరుగుతుందని నిరూపించే ఆధారాలు లేవని పరిశోధకులు వెల్లడించారు.
ఈ పరిశోధనలో హాంకాంగ్‌కు చెందిన 7.08 లక్షలకు పైగా తల్లి, బిడ్డల ఆరోగ్య రికార్డులను సుమారు 20 సంవత్సరాల కాలానికి విశ్లేషించారు. అంతేకాకుండా ఒకే కుటుంబానికి చెందిన తోబుట్టువులను కూడా పరిశీలించారు. ఒక గర్భధారణలో తల్లి పారాసిటమాల్ వాడగా, మరో గర్భధారణలో వాడని పరిస్థితులను పోల్చిచూశారు.
ఈ విధానం వల్ల జన్యుపరమైన లక్షణాలు, కుటుంబ వాతావరణం వంటి అంశాల ప్రభావాన్ని తగ్గించి మరింత ఖచ్చితమైన ఫలితాలను పొందగలిగారు.
అధ్యయనంలో ఎలాంటి ఫలితాలు వచ్చాయి?
తోబుట్టువుల పోలిక ఆధారంగా చేసిన విశ్లేషణలో పారాసిటమాల్ వాడిన గర్భధారణల నుంచి పుట్టిన పిల్లల్లో ఆటిజం లేదా బుద్ధిమాంద్యం ప్రమాదం పెరిగినట్లు ఎలాంటి ఆధారాలు కనిపించలేదు. గర్భధారణలో ఏ దశలో మందు వాడినా, ఎంత మోతాదులో తీసుకున్నా ఫలితాల్లో పెద్ద మార్పు కనిపించలేదు.
దీంతో పారాసిటమాల్ మందులు తీసుకోవడం నేరుగా బుద్ధిమాంద్యం, ఆటిజం లాంటి న్యూరో డెవలప్‌మెంట్ సమస్యలకు కారణం కాదని పరిశోధకులు తెలిపారు.
గర్భిణీలు.. జ్వరం, ఇన్ఫెక్షన్లు, దీర్ఘకాలిక నొప్పులు వంటి ఆరోగ్య సమస్యల కారణంగా పారాసిటమాల్ తీసుకుంటారు. ఈ ఆరోగ్య సమస్యలే పిల్లల ఎదుగుదలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. అలాగే కుటుంబ నేపథ్యం, జన్యుపరమైన అంశాలు కూడా ఫలితాలను ప్రభావితం చేయవచ్చు. ఇలాంటి అంశాలను పూర్తిగా పరిగణలోకి తీసుకోకపోవడం వల్ల గత అధ్యయనాల్లో పారాసిటమాల్‌కు ఆటిజం, బుద్ధిమాంద్యం సమస్యతో సంబంధం ఉన్నట్లు కనిపించిందని పరిశోధకులు వివరించారు.
Also Read: కళ్ల కింద డార్క్ సర్కిల్స్‌తో ఇబ్బందిపడుతున్నారా? ఈ టిప్స్ పాటిస్తే మటుమాయం
ఈ తాజా పరిశోధన గర్భిణీలకు కొంత ధైర్యాన్ని ఇస్తోంది. అవసరమైనప్పుడు వైద్యుల సూచన మేరకు పారాసిటమాల్ తీసుకోవడం సురక్షితమేనని ఇది సూచిస్తోంది. మరోవైపు గర్భధారణలో అధిక జ్వరాన్ని చికిత్స చేయకుండా వదిలేయడం వల్ల కూడా తల్లి, బిడ్డ ఇద్దరికీ ప్రమాదకరమని వైద్యులు చెబుతున్నారు.
అయితే అవసరమైనప్పుడు మాత్రమే, తక్కువ మోతాదులో, తక్కువ రోజుల పాటు పారాసిటమాల్ వాడాలని నిపుణులు సూచిస్తున్నారు. గర్భధారణ సమయంలో ఎలాంటి మందులైనా తీసుకునే ముందు తప్పనిసరిగా వైద్యుల సలహా తీసుకోవడం ఎంతో ముఖ్యం.
గమనిక: ఈ సమాచారం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్యుల సలహాకు ప్రత్యామ్నాయం కాదు. గర్భధారణ సమయంలో మందులు వాడే ముందు తప్పనిసరిగా సంబంధిత వైద్యుడిని సంప్రదించండి.