మౌత్ టేపింగ్ అంటే నోటికి ప్లాస్టర్ వంటిది అతికించడం. దీనివల్ల నోటి నుంచి ఎలాంటి శబ్దము బయటికి రాదని అనుకుంటారు. గురకను అడ్డుకోవడానికి ఇలా మౌత్ టేపింగ్ పద్దతిని పాటిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్లు ఈ మౌత్ టేపింగ్ పద్ధతిపై రీల్స్ చేసి పెడుతున్నారు. ఇది ఇప్పుడు ట్రెండింగ్‌గా మారింది.
కొంతమంది నిజంగానే మౌత్ టేపింగ్ వల్ల ఉపయోగం ఉంటుందేమోనని పాటిస్తున్నారు కూడా. ఇలా చేయడం వల్ల గురకరాకపోవడమే కాదు, అలసటగా అనిపించదని, నోటి దుర్వాసన రాదని, అధికంగా దాహం వేయదని ఇన్ఫ్లుయెన్సర్లు చెబుతున్నారు. అయితే ఇవి ఏవీ కూడా సైన్స్ పరంగా నిరూపితం కాలేదు. మరికొందరు నోటికి ఇలా ప్లాస్టర్ వేసుకుని పడుకోవడం వల్ల ముఖం అందం మరింత పెరుగుతుందని, ముడతలు వంటివి రాకుండా ఉంటాయని చెబుతున్నారు.
అమెరికాకు చెందిన ఒక అధ్యయన సంస్థ ఇలా మూతికి ప్లాస్టర్ వేసుకుని పడుకోవడం వల్ల గురక చాలా వరకు తగ్గుతుందని చెప్పింది. ముఖ్యంగా స్లీప్ ఆప్నియా సమస్య మైల్డ్ గా ఉన్న వారిలో ఇది ఉపయోగపడుతుందని చెప్పింది. కానీ అది మంచి పద్ధతో కాదో తెలిపే అధ్యయనం మాత్రం ఇంతవరకు జరగలేదు.
ఇలా మూతికి టేప్ వేసుకొని పడుకోవడం వల్ల కొన్ని ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉంది. ఈ సైడ్ ఎఫెక్టులు గురించి ముందుగా తెలుసుకున్నాకే మీరు ఈ పద్ధతిని పాటించాలి. ముక్కు ద్వారా శ్వాస పీల్చుకుంటాము. కాబట్టి నిద్రపోయేటప్పుడు నోటితో పనిలేదని ఎంతోమంది అనుకుంటారు. అయితే కొందరికి ఊపిరి సరిగా ఆడని సమస్యలు ఉంటాయి. ఆస్తమా, విపరీతమైన జలుబు.
శ్వాస సంబంధిత సమస్యలు ఉన్నవారు ఈ విధమైన పద్ధతులు పాటిస్తే అవి ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంది. నోరు దానికదే తెరుచుకుని ఊపిరి పీల్చుకుంటుంది. కానీ ఎప్పుడైతే మనం నోటికి ప్లాస్టర్ వేశామో… నోరు తెరుచుకోలేదు. అలాంటి సమయంలో సమస్యలు ఎక్కువైపోతాయి. కాబట్టి శ్వాస సంబంధ సమస్యలతో బాధపడుతున్న వారు ఇలాంటి మౌత్ టేపింగ్ వంటి పనులు చేయకపోవడమే మంచిది.
Also Read: మీ జీర్ణ వ్యవస్థ సరిగ్గా లేదని తెలిపే.. 5 సంకేతాలు ఇవే !
మానసిక సమస్యలతో బాధపడే వారు కూడా ఈ మౌత్ టేపింగ్ పద్ధతిని పాటించకూడదు. ఇది ఆందోళనను మరింతగా పెంచేస్తుంది. గుండె వేగంగా కొట్టుకోవడం మొదలవుతుంది. శ్వాస తీసుకోవడం అసౌకర్యంగా మారుతుంది. కాబట్టి వారు ఇలాంటి పద్ధతులు పాటించకపోవడమే ఉత్తమం. మౌత్ టేపును వేసుకోవాలని మీరు అనుకుంటే ముందు మీ వైద్యునితో మాట్లాడండి. అది మీకు మంచిదో కాదో తెలుసుకోండి. ఆ తర్వాతే ఆ పద్ధతిని పాటించండి. మీకు మీరుగా స్వయం నిర్ణయాలు తీసుకుంటే ప్రమాదకరమైన పరిస్థితుల్లో పడిపోవచ్చు.