వైవాహిక జీవిత అనేది అందమైన ప్రయాణం. అందులో సరదాలు, ప్రేమలు, తగాదాలు, అలకలు ఇలా ఎన్నో ఉంటాయి. అలా ఉంటేనే దాన్ని సంపూర్ణ జీవితంగా చెప్పుకుంటారు. ఒక్కొక్కసారి భార్యాభర్తల మధ్య గొడవలు తారా స్థాయికి చేరుతూ ఉంటాయి. భార్య మానసిక స్థితి బాగోలేనప్పుడు, విపరీతమైన కోపంలో ఉన్నప్పుడు భర్త కొన్ని మాటలు కొన్ని డైలాగ్స్ అనకూడదు. అలా అంటే ఆమె కోపం ఆకాశాన్ని అంటుతుంది. గొడవ తీవ్రంగా మారి ఇల్లు అల్లకల్లోలంగా మారుతుంది.
భార్య కోపంగా ఉన్నప్పుడు ఆమె కోపాన్ని పెంచే డైలాగులు కొన్ని ఉన్నాయి. కోపంగా ఉన్న భార్య ముందు మాట్లాడ కూడని నాలుగు డైలాగుల గురించి తెలుసుకోండి.
మళ్లీ నీకు ఏమైంది?
మీ భార్య కోపంగా ఉన్నప్పుడు మీరు వెళ్లి ‘నీకు మళ్లీ ఏమైంది’ అని చిరాగ్గా ముఖం పెట్టి అడగడం మొదలు పెట్టకండి. ‘సాయంత్రం అయితే చాలు ఇలాగే ఉంటావు’ అంటూ మాటలు అనకండి. అవన్నీ కూడా భార్యకి కోపం తెప్పిస్తాయి. ‘ప్రశాంతంగా ఉండనివ్వవు’ అని డైలాగులు వేయకండి. ఆమె మూడ్ బాగోలేనప్పుడు, కోపంగా ఉన్నప్పుడు పక్కన కూర్చుని ‘ఏమైంది చెప్పు నేను వింటాను’ అన్నమాట అనండి. ఆమె కోపం చాలా వరకు తగ్గిపోతుంది. అలా కాకుండా ‘మళ్లీ ఏమైంది, ఎందుకు అలా ఉంటావు’ ఇటువంటి డైలాగులు వస్తే ఆమెకు మీరు ప్రాధాన్యత ఇవ్వలేదని ఆమె భావించే అవకాశం ఉంది.
సరేలే సారీ వదిలేయ్
భార్యాభర్తల మధ్య ఏదైనా గొడవ అయినప్పుడు భార్య విపరీతంగా కోపంగా ఉండే అవకాశం ఉంది. అలాంటి సమయంలో ఆమె ముందు ‘సరేలే… సారీ ఇంక వదిలెయ్’ అని పరుషంగా చెప్పేందుకు ప్రయత్నించకండి. ఆమె భావోద్వేగాలను మీరు పట్టించుకోవడంలేదని భావించే అవకాశం ఉంది. మీరు క్షమాపణ చెప్పాలనుకుంటే అది హృదయపూర్వకంగా చెప్పండి. అలా కాకుండా ఏదో మొక్కుబడిగా, వంకరగా చెబితే ఆమె ఇల్లు తీసి పందిరేసే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ‘నేను చెప్పిన దానివల్ల నువ్వు బాధపడితే నన్ను నిజంగా క్షమించు’ అని అనగానే ఆమె కోపం సగానికి తగ్గిపోతుంది. మీరు మాట్లాడే పద్ధతిని బట్టే అను ఆమె కోపం కూడా ఆధారపడి ఉంటుంది.
నా బుర్ర తినకు
ఎంతోమంది భర్తలు తమ భార్యల ముందు వేసే డైలాగ్ ఇది. ఈ డైలాగ్ వల్లే సగం గొడవలు పెరిగిపోతూ ఉంటాయి. మీరు కోపంగా ఈ డైలాగు చెబితే పరిస్థితి అదుపు తప్పుతుంది. ఆమెను చిరాకు తెప్పించే వ్యక్తిగా మీరు భావిస్తున్నారని ఆమె అనుకుంటుంది. దీని వల్ల ఆమె మరింత రాద్ధాంతం చేస్తుంది. అలా కాకుండా కాస్త ఓపికగా ఉండండి. ‘కోపం ఎందుకు నాతో మాట్లాడు’ అని ప్రేమగా చెప్పండి. ఆ నిమిషమే ఆమె కోపం చల్లారిపోతుంది. అలాకాకుండా ‘నా మెదడు తింటున్నావు, నా బుర్ర తింటున్నావ్’ వంటి డైలాగులు వేస్తే ఆమె కోపం తారా స్థాయికి చేరుకుంది.
ప్రతిదానికి ఎందుకు గొడవ
భార్యాభర్తల మధ్య ఏదో ఒక సమస్య రావడం సహజం. మీ భార్యతో కూడా మీకు ఏదైనా సమస్య వస్తే ఆ సమయంలో ‘ప్రతిదానికీ ఎందుకు గొడవ చేస్తావు’ అని డైలాగ్ మాత్రం వేయకండి. అది ఆమె భావాలను గౌరవించడం లేదని, ఆమెను చులకనగా చూస్తున్నారని మీ భార్య అర్థం చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఆ డైలాగు వేయకుండా ‘నీ అభిప్రాయం ఏంటో నాకు చెప్పు ప్రశాంతంగా మాట్లాడుకుందాం. నీకు నచ్చితేనే ఏదైనా చేద్దాం’ అంటూ మాట్లాడండి. అప్పుడు ఆమె ప్రశాంతంగా మారుతుంది. తన బాధను మీతో చెప్పుకుంటుంది. అలా కాకుండా ‘చిన్న చిన్న విషయాలకి గొడవ పెడతావు, ప్రతిదానికీ గొడవ పెడతావు’ వంటి డైలాగులు వేసారో మీరు ఇక ఆరోజు ప్రశాంతంగా ఉండలేరు. మీ భార్య భారీగా గొడవ చేసే అవకాశం ఉంటుంది.
Also Read: స్వచ్ఛమైన ‘ప్రేమ’ ఇక చరిత్రేనా.. నేటితరం ‘సింగిల్’గా మిగిలిపోవడానికి కారణాలు ఇవేనట!