Big Tv Live Original: ఈ రోజుల్లో యువత ఒంటరితనం వైపు మొగ్గు చూపుతున్నారు. దానికి కారణం స్వచ్ఛమైన ప్రేమ లభించకపోవడం. ఇంతకీ ఎందుకు ప్రేమ మారుతోంది? ప్రేమ మీద అభిప్రాయాలు ఎందుకు మారిపోతున్నాయి? ఒకరినొకరు అర్థం చేసుకోవడంలో ఎందుకు విఫలం అవుతున్నారు? బాబోయ్ ప్రేమలో ఉండటం కంటే ఒంటరిగా ఉండటమే బెస్ట్ అని ఎందుకు అనుకుంటున్నారు అంటే.. స్వచ్చమైన ప్రేమను పొందలేకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. సంస్కృతి, సమాజం, వ్యక్తిగత పరిస్థితులతో పాటు బోలెడు అంశాలు ప్రభావితం చేస్తున్నాయి. అందులో కొన్నింటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
⦿ సాంస్కృతిక, సామాజిక అంచనాలు
మన దేశంలో సాంప్రదాయ విలువలు సంబంధాలలో కీలక పాత్ర పోషిస్తాయి. చాలా కుటుంబాలు ఇప్పటికీ డేటింగ్ కంటే వివాహానికి ప్రాధాన్యత ఇస్తాయి. చాలా మంది అమ్మాయిలు పెద్దలు కుదిర్చిన వివాహాల ద్వారా తమ జీవిత భాగస్వాములను కలవాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో యువకులు ముందుగా చదువు, కెరీర్ మీద ఫోకస్ పెట్టాలనే ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే తమ ప్రేమ, ఆసక్తులను బయటకు చెప్పలేక ఇబ్బందులు పడుతున్నారు. ఫలితంగా, రిలేషన్ షిప్ కొనసాగించలేకపోతున్నారు.
⦿ తల్లిదండ్రుల భయం
భారతీయ తల్లిదండ్రులు తరచుగా తమ పిల్లల నిర్ణయాలపై, సంబంధాలపై ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తారు. చాలా మంది యువకులు తాము డేటింగ్ ప్రారంభిస్తే, తల్లిదండ్రులు అంగీకరించరని భయపడుతున్నారు. ఈ భయం తన తగిన అమ్మాయిని వెతకడం, వారితో తమ ప్రేమను చెప్పడం కష్టంగా భావిస్తున్నారు.
⦿ కెరీర్ మీద ఫోకస్ పెట్టాలని ఒత్తిడి
భారతీయ సమాజం మంచి చదవులు, మంచి కెరీర్ ఉన్న వారిని ఎక్కువగా గౌరవిస్తుంది. ఈ నేపథ్యంలోనే తమ కెరీర్ మీద ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు. ఈ కారణంగా చాలా మంది యువకులు డేటింగ్ మీద తక్కువ సమయాన్ని కేటాయిస్తున్నారు. వ్యక్తిగత, వృత్తిపరమైన విజయాన్ని సాధించాలనే ఒత్తిడి కొంతమందికి డేటింగ్ కి దూరంగా ఉంచుతుంది.
⦿ సామాజిక పరిమితులు
చిన్న పట్టణాలల్లో ఉండే వారికి నగరాల్లో మాదిరిగా సామాజిక అపరిమితులు ఉండవు. ఇతరులను కలవడానికి పెద్దగా అవకాశాలు ఉండకపోవచ్చు. పెద్ద నగరాల్లో యువకులు సామాజిక కార్యక్రమాలు, కేఫ్‌లు, ఆన్ లైన్ ప్లాట్ ఫారమ్ ల ద్వారా కలుసుకుంటారు. కానీ, చిన్న ప్రాంతాల్లో కలవడం అంత ఈజీ కాదు. ఈ కారణంగా డేంటింగ్ కు చాలా మంది దూరంగా ఉంటున్నారు.
⦿ ఆన్‌లైన్ డేటింగ్
ఇటీవలి కాలంలో ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఆన్‌లైన్ డేటింగ్ మరింతగా పెరిగిపోయింది. అయితే, చాలా మంది యువకులు ఇప్పటికీ డేటింగ్ యాప్‌లతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆన్ లైన్ డేటింగ్ అనేది కేవలం స్వల్ప సంబంధాలకే ఉపయోగపడుతున్నాయి. ఇక్కడ అవసరాలు మినహా స్వచ్ఛమైన ప్రేమ అనేది కనిపించడం లేదు.
⦿ నో చెప్తారేమోననే భయం
కొంతమంది యువకులు తమ ప్రేమ విషయాన్ని ఎదుటి వారికి చెప్పడంలో విఫలం అవుతారు. ఎక్కడ తమను రిజెక్ట్ చేస్తారోనని తమలో తాము భయపడతారు. ఈ కారణంగానూ డేటింగ్ కు దూరంగా ఉంటున్నారు.
⦿ అర్థం మారుతున్న ప్రేమ
ప్రస్తుతం దేశంలో ప్రేమ అనే మాటకు అర్థం మారుతున్నది. చాలా వరకు తాత్కాలిక అవసరాల కోసం ప్రేమ అనే ముసుగు వేసుకుంటున్నారు. ఇందుకు అబ్బాయిలు, అమ్మాయిలు మినహాయింపు ఏమీ కాదు. ఇద్దరూ అలాగే ప్రవర్తిస్తున్నారు. స్వచ్ఛమైన ప్రేమ అనేది కనిపించని పరిస్థితి నెలకొన్నది. కాలక్రమేణా సంబంధాల పట్ల వైఖరులు మారుతున్నాయి. యువత ఇతరులతో కనెక్ట్ అవడానికి ఎంత తక్కువ సమయం పడుతుందో.. దూరం అయ్యేందుకు కూడా అంతే తక్కువ సమయం పడుతుంది. ఈ నేపథ్యంలోనే చాలా మంది ప్రేమా, గీమా వద్దంటూ ఒంటరితనం వైపు మొగ్గుచూపుతున్నారు. అమ్మాయిలు కూడా లైఫ్ లో సెటిల్ అయిన వారిని ఎంచుకుని జీవితాంతం హ్యాపీగా ఉండాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అబ్బాయిలు ముందుగా జీవితంలో సెటిల్ అయ్యే విషయాల మీద ఫోకస్ పెడుతున్నారు.
Read Also: వార్ని.. పిసరంత మందు తాగినా ముప్పే? ఇలాగైతే.. పోతారు, మొత్తం పోతారు!