Earbuds: ఇయర్‌బడ్స్… ఈ రోజుల్లో యూత్ నుంచి పెద్దల వరకు అందరూ వాడే గాడ్జెట్. మ్యూజిక్ వినడం, పాడ్‌కాస్ట్‌లు ఆస్వాదించడం, ఫోన్ కాల్స్ మాట్లాడడం… ఇవి లేకుండా రోజు గడవడం అసాధ్యం అనిపిస్తుంది. కానీ, ఈ చిన్న గాడ్జెట్ మన చెవులకు తీవ్రమైన హాని చేస్తుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వినికిడి సమస్యల నుంచి చెవి ఇన్ఫెక్షన్ల వరకు, ఇయర్‌బడ్స్ వల్ల వచ్చే ప్రమాదాలు లెక్కలేనన్ని ఉన్నాయంటున్నారు. దీని వల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అవేంటో తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్‌ను పూర్తిగా చదవాల్సిందే..
ఇయర్‌బడ్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్
ఎక్కువ సౌండ్ పెట్టుకొని ఇయర్‌బడ్స్‌ను ఎక్కువ సేపు వాడితే, చెవిలోని సున్నితమైన కణాలు దెబ్బతింటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల వినికిడి శక్తి క్రమంగా తగ్గిపోతుందట. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) హెచ్చరిక ప్రకారం, యువతలో వినికిడి సమస్యలు పెరుగుతున్నాయి. 2023లో జరిగిన ఓ అధ్యయనం ఆందోళనకర విషయాన్ని వెల్లడించింది. రోజూ రెండు గంటల కంటే ఎక్కువ గట్టిగా ఇయర్‌బడ్స్ వాడే వారిలో 30% మంది వినికిడి సమస్యలు లేదా టిన్నిటస్ (చెవుల్లో గింగురుమనే శబ్దం)తో బాధపడుతున్నారు.
ఇయర్‌బడ్స్ చెవిలో తేమ, బ్యాక్టీరియాను చిక్కుకునేలా చేస్తాయి. శుభ్రం చేయకపోతే లేదా ఇతరులతో పంచుకుంటే చెవి ఇన్ఫెక్షన్లు తప్పవని డాక్టర్లు చెబుతున్నారు. అంతేకాదు, ఇయర్‌బడ్స్ చెమ్మ గుండును చెవి లోపలికి నెట్టేస్తాయి, దీనివల్ల అసౌకర్యం, వినికిడి తగ్గడం లేదా ఇన్ఫెక్షన్లు వస్తాయి. సరిగ్గా సరిపోని ఇయర్‌బడ్స్‌ను ఎక్కువ సేపు వాడితే చెవి నొప్పి కూడా సర్వసాధారణం. టిన్నిటస్ విషయంలోనూ ఇది తాత్కాలికంగా ఉండొచ్చు, లేదా శాశ్వత సమస్యగా మారొచ్చు.
చెవులను ఇలా కాపాడుకోండి
చెవుల ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అంత కష్టమేమీ కాదు. కొన్ని సులభమైన చిట్కాలు పాటిస్తే సరిపోతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముందుగా, 60/60 నియమంను గుర్తుంచుకోండి. శబ్దాన్ని 60% కంటే తక్కువగా ఉంచండి, ఒకేసారి 60 నిమిషాల కంటే ఎక్కువ వాడకండి. మధ్యలో విరామం తీసుకోవడం మర్చిపోవద్దు. నాయిస్-క్యాన్సిలింగ్ ఇయర్‌బడ్స్ వాడితే బయటి శబ్దం తగ్గుతుంది, కాబట్టి గట్టిగా వినాల్సిన అవసరం ఉండదు.
ఇయర్‌బడ్స్‌ను శుభ్రంగా ఉంచడం చాలా ముఖ్యం. ప్రతిసారీ వాడిన తర్వాత ఆల్కహాల్ వైప్ లేదా శుభ్రమైన గుడ్డతో తుడవండి. వేరే వాళ్లతో షేర్ చేయడం మానేయండి. మీ చెవికి సరిపోయే ఇయర్‌బడ్స్‌ను ఎంచుకోండి, అవి అసౌకర్యం కలిగించకూడదు. ఎక్కువ సేపు వినాల్సి వస్తే, ఓవర్-ఇయర్ హెడ్‌ఫోన్స్ ఉపయోగించడం మంచిది. ఇవి చెమ్మ గుండు సమస్యను తగ్గిస్తాయి.
తరచుగా ఇయర్‌బడ్స్ వాడుతున్న వారు ఎప్పటికప్పుడు వినికిడి పరీక్షలు చేయించుకోవడం మంచిది. చెవుల్లో గింగురుమనడం లేదా ఏదైనా అసౌకర్యం అనిపిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. చాలా ఫోన్‌లలో శబ్దాన్ని పరిమితం చేసే ఆప్షన్ ఉంటుంది, దాన్ని ఆన్ చేయడం మర్చిపోవద్దు.