యవ్వనంలో చర్మం మెరిసిపోవడానికి, బిగుతుగా ఉండడానికి కారణం కొల్లాజెన్. కానీ కాలుష్యం, ఇతర జీవనశైలి అలవాట్ల కారణంగా కొల్లాజెన్ చాలా వరకు తగ్గిపోతుంది. దీనివల్ల వయసు ముదిరినట్టు కనిపిస్తున్నారు. చర్మంపై ముడతలు, గీతలు వంటివి వచ్చేస్తున్నాయి. అలా రాకుండా ఉండాలంటే ఎలాంటి క్రీములు రాయాల్సిన అవసరం లేదు. కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచే ఆహారాలను తినండి చాలు.
కొల్లాజెన్ అంటే
కొల్లాజెన్ అనేది చర్మాన్ని మృదువుగా, బిగుతుగా ఉంచే ఒక ప్రోటీన్. ఎండ ఒత్తిడి, పోషకాహార లోపం, పెరుగుతున్న వయసు వల్ల కొల్లాజెన్ ఉత్పత్తి చాలా వరకు తగ్గిపోతుంది. కాబట్టి కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచే ఆహారాన్ని తినడం ద్వారా చర్మాన్ని మెరిపించుకోవచ్చు.
బోన్ సూప్
చికెన్ లేదా మటన్ ఎముకలను తెచ్చి తక్కువ మంట మీద పసుపు, కారం, ధనియాల పొడి, ఉప్పు, చిటికెడు మసాలా పొడి వేసి బాగా ఉడికించుకోవాలి. నీళ్లు, కొత్తిమీర తరుగు కూడా వేసి బోన్ సూప్ ను తయారు చేసుకోవాలి. ఎందుకంటే ఈ బోన్ సూప్ లోనే కొల్లాజెన్ అధికంగా ఉంటుంది. దీనిలో అమైనో ఆమ్లాలు, ఖనిజాలు కూడా అధికంగా ఉంటాయి. కాబట్టి బోన్ సూప్ తాగడం వల్ల చర్మం ముడతలు పడకుండా ఉంటుంది. బిగుతుగా కూడా కనిపిస్తుంది.
సోయా
సోయాతో చేసిన సోయా పాలు లేదా సోయాటోఫు అంటే సోయా పనీర్ అలాగే సోయాబీన్స్ లో కూడా కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయపడే జెనిస్టిన్ అనే మూలకం ఉంటుంది. ఇది చర్మాన్ని బిగుతుగా చేసి వృద్ధాప్య లక్షణాలు కనిపించకుండా చేస్తుంది. కాబట్టి అప్పుడప్పుడు మీరు సోయాతో చేసిన పదార్థాలు తినేందుకు ప్రయత్నించండి.
సిట్రస్ పండ్లు
సిట్రస్ పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. విటమిన్ సి వల్ల కొలాజిన్ ఏర్పడడం పెరుగుతుంది. కాబట్టి ఉసిరి, నారింజ, జామ, కివి పండ్లు, నిమ్మ వంటివి అధికంగా తినేందుకు ప్రయత్నించండి. విటమిన్ సి అనేది ఒక యాంటీ ఆక్సిడెంట్. ఇది చర్మ కణాలను ఫ్రీ రాడికల్స్ నుండి కాపాడుతుంది. కొల్లాజెన్ ఏర్పడే ప్రక్రియను కూడా వేగవంతం చేస్తుంది.
గుడ్డు
గుడ్డులోని తెల్ల సొనలో అమైనో ఆమ్లాలు, కొల్లాజెన్ పుష్కలంగా ఉంటాయి. ఇది చర్మాన్ని లోపల నుంచి పోషిస్తాయి. కాబట్టి వారానికి నాలుగు ఐదు సార్లు గుడ్లు తినడం మంచిది. గుడ్డును ఏ రూపంలో తిన్నా మీకు మేలే జరుగుతుంది.
నట్స్
నట్స్, సీడ్స్ వంటివి ఎన్నో మార్కెట్లో దొరుకుతున్నాయి. సన్ ఫ్లవర్ సీడ్స్, గుమ్మడికాయ గింజలు, బాదం పప్పులు, వాల్నట్స్ వంటి వాటిలో జింక్, ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, విటమిన్ ఈ అధికంగా ఉంటాయి. ఇవన్నీ కూడా కొలెజెన్ ను కాపాడతాయి. చర్మాన్ని రిపేరు చేయడానికి ఉపయోగపడతాయి. కొలాజన్ చర్మంలో విచ్ఛిన్నం కాకుండా అడ్డుకొని దాని ఉత్పత్తిని పెంచుతాయి. కాబట్టి అప్పుడప్పుడు మీ ఆహారంలో నట్స్, సీడ్స్ కూడా భాగం చేసుకోండి. వారంలో కనీసం నాలుగైదు సార్లు ఈ నట్స్, సీడ్స్ తినేందుకు ప్రయత్నించండి.