Job Contract Compensation| కొత్తగా ఒక కంపెనీలో ఉద్యోగానికి ఎంపికైన ఒక ఉద్యోగి తనకు ఆ కంపెనీ వల్ల భారీ నష్టం జరిగిందని చెప్పి కోర్టుకెక్కాడు. అతడి వాదన విన్న ఆ కోర్టు సదరు కంపెనీ ఉద్యోగికి లక్షల రూపాయలు పరిహారం చెల్లించాల్సిందేనని తీర్పు చెప్పింది. వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజంగా జరిగింది. ఈ ఘటన యనైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) దేశంలో జరిగింది.
వివరాల్లోకి వెళితే.. యుఎఇ దేశంలో దుబాయ్ పొరుగు రాజ్యమైన అబుదాబిలో ఓ కంపెనీ కొన్ని నెలల క్రితం ఒక వ్యక్తి తమ ఆఫీసులో కీలక పదవి కోసం ఎంపిక చేసింది. అయితే ఆ ఉద్యోగి ఉద్యోగంలో చేరకముందే కోర్టులో ఆ కంపెనీపై దావా వేశాడు. విచారణ తరువాత అతను ఉద్యోగంలో చేరకపోయినా, సుమారు 26 లక్షల రూపాయలు (AED 1,10,400) నష్టపరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది. ఈ విచిత్రమైన కేసు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. సదరు ఉద్యోగి.. ఉద్యోగానికి ఎంపికైన తరువాత కంపెనీ నుంచి ఆఫర్ లెటర్ పొందాడు. కానీ అతడిని ఉద్యోగంలోకి తీసుకోకుండా కంపెనీ వాయిదా వేస్తూ వచ్చింది. ఈ కాలంలో అతనికి జీతం చెల్లించలేదు. ఈ కారణంగా ఆ వ్యక్తి కోర్టును ఆశ్రయించాడు.
ఈ వ్యక్తి నవంబర్ 2024 నుంచి ఏప్రిల్ 2025 వరకు తనకు జీతం చెల్లించలేదని, జాబ్ కాంట్రాక్ట్ (ఉద్యోగ ఒప్పందం) ప్రకారం నెలకు 24,000 దిర్హామ్‌ల (సుమారు 5.5 లక్షల రూపాయలు) ప్యాకేజీ, అందులో 7,200 దిర్హామ్‌లు ప్రాథమిక జీతంగా ఉందని కోర్టులో వాదించాడు. అయితే, కంపెనీ అతని ఉద్యోగ ప్రారంభ తేదీని నీటిమీద రాతలా మార్చుతూ.. చివరికి అతడిని ఉద్యోగంలోకి తీసుకోలేదు. దీంతో, జీతం రాక ఆర్థికంగా నష్టపోయిన ఆ వ్యక్తి, కంపెనీపై కేసు వేశాడు.
కోర్టు ఈ కేసును విచారణ చేసి.. ఉద్యోగి సమర్పించిన ఒప్పందం, వేతన వివరాలు, ఇతర ఆధారాలను పరిశీలించింది. ఉద్యోగం ప్రారంభంలో జాప్యం కంపెనీ తప్పిదమేనని కోర్టు తేల్చింది. యుఎఇ దేశం లేబర్ చట్టాల ప్రకారం.. ఉద్యోగులకు సకాలంలో జీతం చెల్లించాలని, ఆ హక్కును ఎట్టి పరిస్థితుల్లోనూ నిరాకరించకూడదని కోర్టు స్పష్టం చేసింది. ఉద్యోగి రాకపోయినా, లీవ్‌లో ఉన్నాడని కంపెనీ వాదించినా, అలాంటి ఆరోపణలకు ఆధారాలు లేవని కోర్టు కొట్టివేసింది.
ఈ కేసులో ఉద్యోగి ఎనిమిది రోజులు సెలవు తీసుకున్నాడని అంగీకరించాడు. ఆ రోజుల జీతాన్ని తీసివేసి, మిగిలిన మొత్తాన్ని చెల్లించాలని కోర్టు ఆదేశించింది. చివరగా, కంపెనీ తప్పిదం వల్లే ఈ జాప్యం జరిగినందున.. ఉద్యోగికి 1,10,400 దిర్హామ్‌లు (సుమారు 25 లక్షల రూపాయలు) చెల్లించాలని కోర్టు తీర్పు ఇచ్చింది.
Also Read: పదో తరగతి పరీక్ష రాయకుండానే విద్యార్థి పాస్.. విద్యాశాఖ ఘనకార్యం
ఈ తీర్పుతొ ఉద్యోగుల హక్కులను రక్షించడంలో యుఎఇ లేబర్ చట్టాల బలంగా ఉన్నాయని తెలుస్తోంది. బలాన్ని చూపిస్తోంది. ఉద్యోగం చేయకపోయినా జీతం చెల్లించాలని కోర్టు తీర్పు ఇవడం అరుదైన సంఘటన. ఈ కేసు కంపెనీలకు ఒక హెచ్చరికగా మారింది. ఉద్యోగుల ఒప్పందాలను గౌరవించాలని కంపెనీలకు తెలిసి వచ్చేలా చేసింది. అబుదాబిలో ఈ తీర్పు ఇప్పుడు ఉద్యోగుల్లో కొత్త చర్చకు దారితీసింది.