Effects Of Stress: మారుతున్న జీవన శైలితో పాటు అనేక ఆరోగ్య కారణాల వల్ల ప్రస్తుతం చాలా మంది ఒత్తడిని ఎదుర్కుంటున్నారు. ఒత్తిడి మన జీవితంలో ఒక భాగంగా మారిపోయింది. కానీ అధిక ఒత్తిడి కూడా అనేక ఆరోగ్య సమస్యలకు కారణం అవుతుంది. ఎక్కువగా ఒత్తిడికి గురికావడం వల్ల మన భావోధ్వేగాలు ప్రభావితం అవుతాయి. ఇవి శరీరంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. మరి తీవ్రమైన ఒత్తిడి ఎలాంటి ఆరోగ్య సమస్యలను కలిగిస్తుందనే విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఒత్తిడి వల్ల కలిగే ఆరోగ్య సమస్యలు:
1. ఒత్తిడి మన జీర్ణ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. అంతే కాకుండా మనం ఒత్తిడికి గురైనప్పుడు శరీరంలో కార్టిసాల్ అనే హార్మోన్ల స్థాయి చాలా వరకు పెరుగుతుంది. ఫలితంగా జీర్ణ ప్రక్రియ కూడా నెమ్మదిస్తుంది. ఇది కడుపులో నొప్పి, ఆమ్లత్వంతో పాటు మలబద్ధకం వంటి సమస్యలను కలిగిస్తుంది.
2. ఒత్తిడి సమయంలో శరీరంలో కార్టిసాల్ స్థాయిలు వేగంగా పెరుగుతాయి. ఇది శరీరానికి శక్తిని అందించడంతో పాటు రక్తంలో కూడా చక్కెర స్థాయిని పెంచుతుంది. ఈ పరిస్థితి ఎక్కువ కాలం కొనసాగితే మాత్రం టైప్ – 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
3. ఒత్తిడి కారణంగా శరీరం కూడా వేడిగా అనిపిస్తుంది. ఇది రక్త పోటును పెంచుతుంది. ఇలాంటి సమయంలోనే శరీరంలో రక్త ప్రసరణ కూడా వేగవంతం అవుతుంది. ఇది హృదయ స్పందన రేటును పెంచుతుంది. అంతే కాకుండా అధిక రక్తపోటు, గుండె, రక్త నాళాలకు ప్రమాదంగా మారుతుంది. ఇది స్ట్రోక్ ప్రమాదానికి కారణం అవుతుంది.
4. ఒత్తిడి వల్ల మీరు దీర్ఘకాలిక తలనొప్పితో బాధపడే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అంతే కాకుండా ఇది పీరియడ్స్ పై కూడా ప్రభావాన్ని చూపుతుంది. ఒత్తిడి రోగ నిరోధక శక్తిని బలహీనంగా మార్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
ఒత్తిడితో ఉన్నప్పుడు ఇలాంటి పనులు చేయకండి:
ఒత్తిడితో ఉన్నప్పుడు చాలా మంది ఆల్కహాల్ తీసుకుంటారు. ఇది సమస్యను మరింత పెంచుతుంది. ఆల్కహాల్ తాత్కాలికంగా ఒత్తిడిని తగ్గించినప్పటికీ తర్వాత మిమ్మల్ని మత్తులో ఉంచుతుంది. మానసిక సమస్యలు ఉన్నప్పుడు ఆల్కహాల్ తీసుకోవడం చాలా వరకు తగ్గించాలి.
సోషల్ మీడియా వాడకం:
సోషల్ మీడియాను ఎక్కువగా వాడటం వల్ల కూడా మీరు ఆందోళన, ఒత్తిడికి గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది పరిమితంగా మాత్రమే సోషల్ మీడియా వాడాలి. అంతే కాకుడా స్క్రీన్ సమయం పెరగడం వల్ల కూడా నిద్రకు అంతరాయం కలుగుతుంది. ఇది మీ మానసిక పరిస్థితిపై ప్రభావం చూపుతుంది.
Also Read: నెల రోజులు చక్కెర తినకపోతే.. ఇన్ని లాభాలా !
ఏం చేయాలి ?
మంచి నిద్ర, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల మానసిక ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది. అంతే కాకుండా ఇలా చేయడం వల్ల ఆరోగ్య సమస్యలను కూడా కొంత వరకు తగ్గించుకోవచ్చు. యోగా, వాకింగ్ తో పాటు శారీరక వ్యాయామాలు మనల్ని సంతోషంగా ఉండేలా చేస్తాయి. అంతే కాకుండా ఇవి హార్మోన్లు సక్రమంగా విడుదల అయ్యేలా చేస్తాయి. దీంతో పాటు ప్రతి రోజు కనీసం 6- 8 గంటల నిద్ర చాలా ముఖ్యం. యోగా ధ్యానం, వ్యాయామం చేయడం వల్ల కూడా మీరు ఈ సమస్యల నుండి ఈజీగా బయటపడవచ్చు.