Eggplant Parmesan: గుత్తి వంకాయ కూర అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి? కానీ అదే వంకాయతో ఒకసారి విదేశీ రుచులను ప్రయత్నిస్తే ఎలా ఉంటుంది? ఇటలీ దేశపు ప్రసిద్ధ వంటకాలలో ఒకటైన ‘ఎగ్‌ప్లాంట్ పార్మిజియానా’ పేరు వినడానికి కాస్త కొత్తగా ఉన్నా.. దీని రుచి మాత్రం ఆహార ప్రియులకు చాలా బాగా నచ్చుతుంది. వేయించిన వంకాయ ముక్కలు, ఘుమఘుమలాడే టమాటో సాస్, కరిగిపోయే చీజ్ కలబోతగా తయారయ్యే ఈ వంటకం వీకెండ్స్‌లో కుటుంబ సభ్యులకు చేసి పెడితే లొట్టలేసుకుంటూ తింటారు. రెస్టారెంట్‌కు వెళ్లకుండానే ఇంట్లోనే ఎంతో రుచిగా, ఆరోగ్యకరంగా దీనిని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం.
వంకాయలు (పెద్దవి) – 2, టమోటాలు – 4, వెల్లుల్లి రెబ్బలు – 6, ఉల్లిపాయ – 1, మోజరెల్లా చీజ్ తురుము – 1 కప్పు, పారామిసాన్ చీజ్ తురుము – అర కప్పు, మైదా పిండి – అర కప్పు, గుడ్లు – 2, బ్రెడ్ క్రంబ్స్ – 1 కప్పు, ఆలివ్ ఆయిల్ – తగినంత, ఒరెగానో – 1 టీస్పూన్, చిల్లీ ఫ్లేక్స్ – 1 టీస్పూన్, మిరియాల పొడి – అర టీస్పూన్, ఉప్పు – రుచికి తగినంత, తాజా తులసి (బాసిల్) ఆకులు – కొన్ని.
Also Read: ఐస్‌క్రీమ్‌ను ఇలా కూడా తయారుచేయొచ్చా? ఈ జపనీస్ రెసిపీ తెలిస్తే వెంటనే ట్రై చేస్తారు!
వంకాయలను శుభ్రంగా కడిగి పొడవుగా లేదా గుండ్రంగా పలుచని చక్రాల్లా కోసుకోవాలి. ఈ ముక్కలపై కొద్దిగా ఉప్పు చల్లి పది నిమిషాలు పక్కన పెడితే వంకాయలో ఉన్న చేదు నీరు బయటకు వస్తుంది. ఆ తర్వాత ఒక పొడి గుడ్డతో ముక్కలను శుభ్రంగా తుడిచి పెట్టుకోవాలి.
ఇప్పుడు ఒక పాత్రలో మైదా, మరొక గిన్నెలో గిలకొట్టిన గుడ్ల మిశ్రమం, ఇంకొక ప్లేట్‌లో బ్రెడ్ క్రంబ్స్ సిద్ధం చేసుకోవాలి. వంకాయ ముక్కలను మొదట మైదాలో, తర్వాత గుడ్డు మిశ్రమంలో, చివరగా బ్రెడ్ క్రంబ్స్‌లో ముంచి ఆలివ్ ఆయిల్‌లో రెండు వైపులా దొరగా వేయించి పక్కన ఉంచుకోవాలి.
తర్వాత బాణలిలో కొద్దిగా నూనె వేసి తరిగిన వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. అందులో టమాటో ప్యూరీ, ఉప్పు, మిరియాల పొడి, ఒరెగానో, చిల్లీ ఫ్లేక్స్, తులసి ఆకులు వేసి సాస్ దగ్గరపడే వరకు ఉడికించుకోవాలి.
చివరగా ఒక బేకింగ్ డిష్ తీసుకుని అడుగున కొద్దిగా టమాటో సాస్ పరచాలి. దానిపై వేయించిన వంకాయ ముక్కలు అమర్చి, మోజరెల్లా, పారామిసాన్ చీజ్ చల్లాలి. ఇలా సాస్, వంకాయ, చీజ్ పొరలుగా ఒకదానిపై ఒకటి వేయాలి. దీనిని 180 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద చీజ్ కరిగి బంగారు రంగులోకి వచ్చే వరకు మైక్రోవేవ్ లేదా ఓవెన్‌లో 20 నిమిషాలు బేక్ చేసుకుంటే ఎంతో రుచికరమైన ఎగ్‌ప్లాంట్ పార్మిజియానా సిద్ధమైనట్లే. వేడివేడిగా సర్వ్ చేసుకుని ఈ అద్భుతమైన ఇటాలియన్ రుచిని ఆస్వాదించడమే ఇక.
Also Read: సింపుల్‌గా హైదరాబాదీ రాయల్ మటన్ మరగ్.. ఇంటికొచ్చిన అతిథులు ముగ్దులైపోవాల్సిందే!