3 AM Waking Up Reasons: రాత్రిపూట అందరూ హాయిగా నిద్రపోతుంటే మీకు మాత్రం సరిగ్గా తెల్లవారుజామున 3 గంటలకు మెలకువ వస్తోందా? మళ్లీ నిద్ర పట్టక ఇబ్బంది పడుతున్నారా? ఇలా తరచూ జరిగితే ఆందోళన కలగడం సహజం. సోషల్ మీడియాలో దీనికి ఆధ్యాత్మిక కారణాల నుంచి హార్మోన్ల మార్పుల వరకు ఎన్నో వివరణలు కనిపిస్తాయి. కానీ ఒక నిర్దిష్ట సమయంలో మెలకువ రావడమే ఏదో పెద్ద సమస్యకు సంకేతం అని అనుకోవాల్సిన అవసరం లేదు. నిద్ర మధ్యలో కొద్దిసేపు మేల్కొనడం చాలామందిలో సహజంగానే జరుగుతుంది. అయితే తిరిగి నిద్ర పట్టకపోతే దానికి కారణం ఏమిటో గమనించడం మంచిది.
పని ఒత్తిడి, కుటుంబ సమస్యలు, ఆర్థిక ఆందోళనలు లేదా వ్యక్తిగత ఇబ్బందులు మనసును ప్రభావితం చేస్తాయి. ఉదయం దగ్గరపడే సమయంలో శరీరంలో కార్టిసాల్ అనే హార్మోన్ స్థాయి సహజంగానే పెరుగుతుంది. ఇది మేల్కొనే ప్రక్రియలో భాగం. ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు రాత్రి నిద్రలో మెలకువ రావడం, మళ్లీ నిద్ర పట్టకపోవడం జరగొచ్చు. అయితే ప్రతి సందర్భంలోనూ కార్టిసాల్ కారణమని చెప్పలేం.
సాయంత్రం ఆలస్యంగా టీ, కాఫీ తాగడం, పడుకునే ముందు ఫోన్ లేదా టీవీ చూడటం, రాత్రి మద్యం తీసుకోవడం నిద్ర నాణ్యతను తగ్గించవచ్చు. రోజూ వేర్వేరు సమయాల్లో పడుకోవడం కూడా శరీర నిద్ర అలవాటును గందరగోళానికి గురిచేస్తుంది. కాబట్టి.. నిద్రకు ముందు ప్రశాంతమైన వాతావరణం కల్పించుకోవడం, ఒకే సమయానికి పడుకోవడం ఉపయోగపడుతుంది.
Also Read: రోజుకు ఎన్ని లవంగాలు తింటే సేఫ్? ఈ తప్పు చేస్తే రక్తం పలచబడి ప్రాణాలకే ప్రమాదం వాటిల్లొచ్చు!
ఎసిడిటీ, దీర్ఘకాలిక నొప్పి, నిద్రలో శ్వాసకు ఆటంకం, హార్మోన్ల మార్పులు వంటి సమస్యలు రాత్రి మెలకువకు కారణం కావచ్చు. ఆందోళన, డిప్రెషన్‌తో పాటు కొన్ని మందుల ప్రభావం కూడా నిద్రను దెబ్బతీయొచ్చు. మెలకువ వచ్చినప్పుడు ఊపిరి పీల్చడంలో ఇబ్బంది, శరీరం వేడిగా ఉండటం లేదా ఇతర అసౌకర్యాలు ఉన్నాయా గమనించండి.
మెలకువ వచ్చిన వెంటనే సమయం చూస్తూ కంగారు పడకుండా నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ ప్రశాంతంగా ఉండండి. ఫోన్ చూడటం, సమస్యల గురించి ఆలోచిస్తూ ఉండటం మానుకోండి. నిద్ర సమస్య కొన్ని వారాల పాటు కొనసాగినా.. పగటిపూట అలసటగా ఉన్నా లేదా పనులపై ప్రభావం చూపినా వైద్యుడిని సంప్రదించండి. ఆన్‌లైన్‌లో కనిపించే ఊహాగానాల ఆధారంగా మీకు మీరే కారణం నిర్ణయించుకోకండి. సరైన కారణం తెలుసుకుంటే తగిన పరిష్కారం దొరుకుతుంది.
పడకగదిలో వెలుతురు, శబ్దం, ఉష్ణోగ్రత కూడా నిద్రపై ప్రభావం చూపుతాయి. గది మరీ వేడిగా ఉన్నా, బయట శబ్దం ఎక్కువగా ఉన్నా మధ్యలో మెలకువ రావచ్చు. పగటిపూట కొద్దిసేపు నడవటం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం కూడా రాత్రి నిద్రకు తోడ్పడతాయి. అయితే పడుకునే సమయానికి దగ్గరగా గట్టి వ్యాయామం చేయకుండా ఉండటం మంచిది. పగటి పూట ఎక్కువ సమయం నిద్రపోతే రాత్రి నిద్ర తగ్గవచ్చు. అందుకే మీ దినచర్యను కూడా ఓసారి పరిశీలింకుని.. అవసరమైతే నిద్ర వివరాలు రాసుకోవడం మంచిది.
Also Read: చికెన్, గుడ్లు అక్కర్లేదు.. ఈ 5 హోమ్‌మేడ్ కాంబోలతో ఒక పూటకి 50g ప్రోటీన్ పొందొచ్చు!