Cloves Side Effects: లవంగాలు అనగానే మనకు ముందుగా గుర్తుకొచ్చేది వాటి ఘాటైన సువాసన, రుచి. వంటల రుచిని పెంచడంలోనే కాదు.. ఆయుర్వేదంలో కూడా లవంగాలకు ప్రత్యేక స్థానం ఉంది. వీటిలో ఉండే ‘యూజినాల్’ అనే సమ్మేళనంలో శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. జీర్ణక్రియను మెరుగుపరచడానికి, నోటి దుర్వాసనను పోగొట్టడానికి, చిన్న చిన్న నొప్పుల నుంచి ఉపశమనం పొందడానికి లవంగాలు ఎంతో మేలు చేస్తాయి. అయితే ఆరోగ్యానికి మంచిది కదా అని రోజూ ఎక్కువ మొత్తంలో తింటే లాభం కంటే నష్టమే ఎక్కువ. సోషల్ మీడియా టిప్స్ చూసి రోజుకు 10 నుంచి 12 లవంగాలు నమిలి మింగడం వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఎదురవుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
లవంగాలు చాలా ఘాటుగా ఉంటాయి. పరిమితికి మించి వీటిని తీసుకోవడం వల్ల కడుపులో తీవ్రమైన మంట, అసిడిటీ, వికారం వంటి సమస్యలు వస్తాయి. లవంగాల ఘాటుకు నోటిలో సన్నని పుండ్లు పడటం లేదా నాలుకపై మంట పుట్టడం జరుగుతుంది. క్రమం తప్పకుండా రోజుకు పదికి పైగా లవంగాలు తింటే జీర్ణవ్యవస్థ దెబ్బతినే ప్రమాదం ఉంది.
Also Read: అన్‌హెల్దీ అని తినడం మానేశారా? నిజానికి ఈ 5 ఫుడ్స్‌తో కలిగే లాభాలు అన్నీ ఇన్నీ కావు!
లవంగాల్లో ఉండే యూజినాల్ అనే పదార్థానికి రక్తాన్ని పలచబరిచే తత్వం ఉంటుంది. అందువల్ల పరిమితికి మించి లవంగాలను తీసుకుంటే శరీరంలో రక్తం పలచబడి, ఏదైనా గాయమైనప్పుడు రక్తం త్వరగా గడ్డకట్టదు. ముఖ్యంగా ఇప్పటికే రక్తం పలచబడే మందులు వాడేవారు, శస్త్రచికిత్సకు సిద్ధమవుతున్నవారు లవంగాలను ఎక్కువగా తింటే రక్తస్రావం అయ్యే ముప్పు పెరుగుతుంది.
ఎక్కువ కాలం పాటు రోజూ మోతాదుకు మించి లవంగాలు తింటే అది కాలేయంపై తీవ్ర ఒత్తిడిని పెంచుతుంది. సాధారణ వంటకాల్లో వాడే లవంగాల వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ ప్రతిరోజూ ఔషధంలా భావించి ఎక్కువ మొత్తంలో తీసుకోవడం వల్ల కాలేయ పనితీరు మందగించే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఏ పదార్థమైనా పరిమితిలో తీసుకున్నప్పుడే ఆరోగ్యానికి మంచిది. డైరెక్టుగా తిలానకున్నప్పుడు 1 – 2 లవంగాలను తీసుకోవచ్చు. అలాగే రోజువారీ వంటకాల్లో, టీలో లేదా ఇంట్లో చేసుకునే కషాయాల్లో కొద్దిగా వాడుకుంటే సరిపోతుంది. ఆరోగ్యానికి మంచిదని ఏదో ఒకే పదార్థాన్ని అతిగా తీసుకోవడం సరికాదు. సమతులాహారం పాటించడమే ఆరోగ్యానికి నిజమైన సూత్రం. కాబట్టి ఏదైనా కొత్త అలవాటును ప్రారంభించే ముందు వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.
Also Read: హోటల్ రూమ్‌లో అడుగు పెట్టగానే వాటర్ బాటిల్‌ను మంచం కిందకి దొర్లిస్తారు ఎందుకు?