Mutton Marag Recipe: మటన్‌తో ఎన్ని రకాల వంటకాలు చేసినా ఒక్కో దానికీ ఒక్కో ప్రత్యేకమైన రుచి ఉంటుంది. అలాంటి రుచికరమైన వంటకాల్లో మటన్ మరగ్ కూడా ఒకటి. మటన్ ముక్కలు మసాలాలతో కలిసి చక్కగా ఉడికి, వాటి నుంచి వచ్చే రసంతో ఈ కూర ఎంతో రుచిగా ఉంటుంది. ముఖ్యంగా వేడి వేడి అన్నంలోకి ఈ మటన్ మరగ్ వేసుకుని తింటే అమృతంలా ఉంటుంది. చపాతీ, రోటీ, పరోటాలోకి కూడా బాగుంటుంది. బయట హోటళ్లలో తిన్న ఇలాంటి రుచిని మన ఇంట్లోనూ సులభంగా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడీ మటన్ మరాగ్ తయారీ విధానం ఎలాగో తెలుసుకుందాం రండి..
మటన్ – అర కిలో, ఉల్లిపాయలు – 3, టమోటాలు – 2, పచ్చిమిర్చి – 4, అల్లం వెల్లుల్లి పేస్ట్ – 2 టేబుల్ స్పూన్లు, పెరుగు – అర కప్పు, కారం – 2 టీస్పూన్లు, ధనియాల పొడి – రెండు టీస్పూన్లు, పసుపు – అర టీస్పూన్, గరం మసాలా – 1 టీస్పూన్, జీలకర్ర – అర టీస్పూన్, దాల్చిన చెక్క – చిన్న ముక్క, లవంగాలు – నాలుగు, యాలకులు – మూడు, కొత్తిమీర – ఒక కట్ట, పుదీనా – కొద్దిగా, నూనె – 4 టేబుల్ స్పూన్లు, ఉప్పు – తగినంత, నీళ్లు – అవసరమైనన్ని.
Also Read: బయట కరకరలాడుతూ.. లోపల టేస్టీ స్టఫింగ్‌తో వెజిటబుల్ స్ప్రింగ్ రోల్స్.. ఇలా చేస్తే సూపర్!
ముందుగా మటన్ ముక్కలను శుభ్రంగా కడిగి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అందులో పెరుగు, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు, కొద్దిగా ఉప్పు వేసి బాగా కలపాలి. ఇలా కలిపిన మటన్‌ను కనీసం అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల మసాలాలు మటన్‌కు బాగా పడతాయి.
ఇప్పుడు కుక్కర్ పెట్టి అందులో నూనె పోయాలి. నూనె వేడయ్యాక జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు వేసి వేయించాలి. ఆ తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. ఇప్పుడు మిగిలిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు కలపాలి.
తర్వాత టమోటా ముక్కలు వేసి మెత్తగా అయ్యేవరకు ఉడికించాలి. ఇందులో ధనియాల పొడి, గరం మసాలా వేసి కలపాలి. ఇప్పుడు ముందుగా పక్కన పెట్టుకున్న మటన్ ముక్కలను వేసి మసాలా అంతా పట్టేలా బాగా కలపాలి. రెండు మూడు నిమిషాల పాటు వేయించిన తర్వాత తగినన్ని నీళ్లు పోసి కుక్కర్ మూత పెట్టాలి.
మీడియం మంటపై మటన్ మెత్తగా ఉడికే వరకు 5 – 7 విజిల్స్ వచ్చేలా ఉంచాలి. ప్రెషర్ పూర్తిగా తగ్గిన తర్వాత కుక్కర్ మూత తీసి చూడాలి. కూర మరీ పల్చగా ఉంటే మరికొంతసేపు మూత లేకుండా మరిగించాలి. చివరగా కొత్తిమీర, పుదీనా చల్లి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
అంతే.. ఎంతో రుచికరమైన మటన్ మరగ్ సిద్ధమైనట్టే. వేడి వేడి అన్నంలోకి ఈ కూర వేసుకుని తింటే ప్లేట్ మొత్తం ఖాళీ అవ్వాల్సిందే. ఇంట్లో మటన్ తెచ్చినప్పుడు ఈ రెసిపీని తప్పకుండా ప్రయత్నించండి.
Also Read: పాలు, గుడ్లు ఉంటే చాలు.. 10 నిమిషాల్లో యమ్మీ యమ్మీ క్యారమెల్ కస్టర్డ్ రెడీ!