AI Reduces Kid’s television addiction| పిల్లలు టీవీకి, మొబైల్ ఫోన్లకు ఎక్కువ సమయం కేటాయిస్తున్నారా? చదువుపై శ్రద్ధ పెట్టకుండా గంటల తరబడి టీవీ చూస్తున్నారా? అయితే చైనాకు చెందిన ఓ తండ్రి అనుసరించిన ఈ వినూత్న పద్ధతి ఆసక్తికరంగా ఉంటుంది. కొడుకును టీవీ చూడకుండా ఆపేందుకు ఆయన ఏకంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాయం తీసుకున్నారు. ఈ ప్రయోగంతో వల్ల పిల్లాడి చదువుకు కూడా లాభం చేకూరింది.
చైనాలోని దక్షిణ ప్రాంతమైన షెన్‌జెన్‌కు చెందిన ఓ వ్యక్తి టాక్సీ డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. ఆయన కుమారుడు జూనియర్ సెకండరీ స్కూల్‌లో చదువుతున్నాడు. అయితే బాలుడు చదువుపై దృష్టి పెట్టకుండా ఎక్కువ సమయం టీవీ చూస్తుండేవాడు. దీంతో ఆందోళన చెందిన తండ్రి అతడి టీవీ చూసే సమయాన్ని తగ్గించేందుకు ప్రయత్నించారు.
మొదట టీవీలోనే అందుబాటులో ఉన్న ప్రశ్నలు, సమాధానాల ఫీచర్‌ను ఉపయోగించారు. కానీ బాలుడు దాన్ని తప్పించుకునే మార్గాన్ని కనుగొన్నాడు. తర్వాత ఒక స్మార్ట్ ప్లగ్‌ను టీవీకి కనెక్ట్ చేశారు. నిర్ణీత సమయానికి టీవీ ఆఫ్ అయ్యేలా ఏర్పాటు చేశారు. అయితే బాలుడు ఆ ప్లగ్‌ను తీసేయడంతో ఆ ప్రయత్నం కూడా విఫలమైంది.
ఇక లాభం లేదనుకున్న తండ్రి అక్టోబర్‌లో ఒక AI యాప్‌ని ఆశ్రయించారు. దాని సాయంతో టీవీలో ప్రశ్నలకు సమాధానాలు చెప్పేలా ఓ ప్రోగ్రామ్‌ను రూపొందించాలని నిర్ణయించారు. AI యాప్ సూచనలతో ప్రోగ్రామ్‌ను తయారు చేశారు. అనంతరం అవసరమైన మార్పులు చేసి కుటుంబానికి చెందిన టీవీలో ఇన్‌స్టాల్ చేశారు.
ఈ కొత్త విధానంలో బాలుడు టీవీ చూస్తున్నప్పుడు ప్రతి 10 నిమిషాలకు ఒక ప్రశ్న స్క్రీన్‌పై కనిపిస్తుంది. చైనీస్, గణితం, ఇంగ్లిష్ సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు వస్తాయి. బాలుడి పాఠశాల చదువుకు అనుగుణంగా వాటిని రూపొందించారు.
ఆ ప్రశ్నకు సరైన సమాధానం చెబితేనే అతడు తిరిగి టీవీ చూడవచ్చు. ఒకవేళ తప్పుగా సమాధానం చెబితే మరో ప్రశ్నకు సమాధానం ఇవ్వాలి. సరైన జవాబు చెప్పేవరకు టివిలో వినోద కార్యక్రమాన్ని కొనసాగించే అవకాశం ఉండదు.
Also Read: కఠిన నిర్ణయాలు తీసుకోవడానికి భయపడతారు.. ఈ తేదీల్లో పుట్టినవారు మంచి అవకాశం వచ్చినా సంకోచిస్తారు
తన కొత్త ప్రయోగాన్ని కొడుకు వ్యతిరేకిస్తాడేమోనని తండ్రి మొదట భావించారు. అయితే బాలుడు ప్రశ్నలకు సమాధానాలు చెప్పడాన్ని ఆస్వాదించడం చూసి ఆయన ఆశ్చర్యపోయారు. దీంతో భవిష్యత్తులో ప్రశ్నలను మరింత కఠినంగా మార్చాలని నిర్ణయించుకున్నారు. షెన్‌జెన్ టీవీ కథనం ప్రకారం.. కొడుకును పూర్తిగా టీవీకి దూరం చేయడం తండ్రి ఉద్దేశం కాదు. వినోదంతో పాటు చదువు కూడా కొనసాగాలన్నదే ఆయన ఆలోచన.
Also Read: ఉద్యోగానికి దరఖాస్తు చేయనే లేదు.. విద్యార్థికి రూ.50 లక్షలు జీతం ఇస్తామని రెండు కంపెనీ ఆఫర్లు
ఈ కొత్త ప్రయోగాన్ని తండ్రి కేవలం చదువుకు సంబంధించిన ఏర్పాటుగా చూడటం లేదు. దీన్ని తండ్రీకొడుకుల మధ్య జరిగే ఓ ఆసక్తికరమైన ఆటగా భావిస్తున్నారు. తన కొడుకు ఈ వ్యవస్థను తప్పించేందుకు కొత్త మార్గాలు వెతికితే, వాటిని సరిచేసేందుకు తాను ప్రయత్నిస్తానని చెప్పారు.
అంతేకాదు, తన కొడుకు సొంతంగా సమస్యలకు పరిష్కారాలు కనుగొంటే సంతోషిస్తానని తెలిపారు. ఈ విధానం ద్వారా ఇద్దరికీ కొత్త విషయాలు నేర్చుకునే అవకాశం ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.
మొత్తానికి, పిల్లల స్క్రీన్ టైమ్‌ను తగ్గించేందుకు టెక్నాలజీని సృజనాత్మకంగా ఉపయోగించవచ్చని ఈ తండ్రి ప్రయోగం చూపిస్తోంది. టీవీని పూర్తిగా నిషేధించకుండా, దాన్నే చదువుకు ఉపయోగపడే సాధనంగా మార్చడం విశేషం.