No Resume Job Offer| కాలేజీ చదువు పూర్తికాకముందే ఏడాదికి రూ.50 లక్షల జీతంతో ఉద్యోగం వస్తే ఎలా ఉంటుంది? చాలామంది విద్యార్థులకు ఇది కలగానే ఉంటుంది. కానీ, ఓ విద్యార్థి మాత్రం తన టాలెంట్‌తో ఈ అవకాశాన్ని అందుకున్నాడు. రెజ్యూమ్ సిద్ధం చేయకుండానే, ఉద్యోగ దరఖాస్తులు పంపకుండానే రెండు భారీ ఉద్యోగ ఆఫర్లు సొంతం చేసుకున్నాడు. అతడు చేసిందల్లా ఒక్కటే ఏఐతో ఓ ప్రాజెక్టును రూపొందించి, స్టార్టప్ కంపెనీల వ్యవస్థాపకులను నేరుగా సంప్రదించడం. దీంతో అతడికి అదృష్టం కలిసొచ్చింది.
ప్రస్తుతం బిటెక్ మూడో సంవత్సరం చదువుతున్న ఈ విద్యార్థి తన అనుభవాన్ని రెడిట్‌లోని r/StartUpIndia వేదికపై షేర్ చేశాడు. దాదాపు 2 ఏళ్ల క్రితం ఓ ఫ్రెండ్‌తో కలిసి ఏఐ సాయంతో వీడియో ఎడిటర్ రూపొందించాడు. ఆ ప్రాజెక్టులో కొన్ని టెక్నికల్ సమస్యలు ఉన్నప్పటికీ, సుమారు 13 వేల మంది యూజర్స్ దాన్ని మెచ్చుకున్నారు. అయితే, ప్రాజెక్టును మరింత అభివృద్ధి చేయడం కష్టంగా మారడంతో ఇద్దరూ దాన్ని నిలిపివేశారు. అయినప్పటికీ, ఈ అనుభవం అతడికి మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. తన నైపుణ్యాలను రెజ్యూమ్‌లో రాయడం కంటే, నిజమైన ప్రాజెక్టుతో చూపించే అవకాశం లభించింది.
వీడియో ఎడిటర్‌ను ఎక్స్ (గతంలో ట్విట్టర్)లో విడుదల చేసిన కొన్ని రోజులకే ఓ స్టార్టప్ ఫౌండర్ దాన్ని గమనించారు. ఆయన కూడా ఇదే రంగంలో ఓ ప్రొడక్ట్‌ని రూపొందిస్తున్నారు. విద్యార్థి పనితీరు నచ్చడంతో నేరుగా సంప్రదించారు. ఏడాదికి సుమారు రూ.50 లక్షల ప్యాకేజీతో రిమోట్ (వర్క్ ఫ్రమ్ ) ఉద్యోగాన్ని ఆఫర్ చేశారు.
ఆ సమయంలో విద్యార్థి దగ్గర రెజ్యూమ్ కూడా సిద్ధంగా లేదు. అయినప్పటికీ, తన ప్రాజెక్టు అనుభవమే ఉద్యోగ అవకాశాన్ని తెచ్చిపెట్టింది.
మరో ఉద్యోగ అవకాశం కూడా అతడికి వచ్చింది. అయితే, ఆ ఉద్యోగానికి ఆఫీస్ వెళ్లి పనిచేయాల్సి ఉండటంతో కాలేజీ చదువుకు ఇబ్బందిగా భావించాడు. దీంతో తన నైపుణ్యాలకు సరిపోయే కంపెనీలను వెతకడం ప్రారంభించాడు. సుమారు 30 స్టార్టప్‌లను ఎంపిక చేసి, వాటి ఫౌండర్‌లకు నేరుగా ఈమెయిల్స్ పంపాడు. తన అనుభవం, నైపుణ్యాలు, కంపెనీకి ఎలా ఉపయోగపడతాయో వివరించాడు. ఈ ప్రయత్నానికి మంచి స్పందన వచ్చింది. మొత్తం 13 స్టార్టప్‌లు అతడికి సమాధానం ఇచ్చాయి. వారం రోజుల్లోనే వై కాంబినేటర్ సపోర్ట్ ఉన్న ఓ స్టార్టప్ నుంచి మరో రూ.50 లక్షల వార్షిక ప్యాకేజీ ఆఫర్ వచ్చింది.
వందలాది కంపెనీలకు ఒకే రకమైన దరఖాస్తులు పంపడం కంటే, తమకు సరిపోయే కంపెనీలు ఎంచుకోవాలని విద్యార్థులకు సూచించాడు. ముందుగా ఒక రంగాన్ని ఎంచుకుని, ఆ రంగంలోని కంపెనీల అవసరాలను తెలుసుకోవాలి. ఆ తర్వాత చిన్నదైనా ఉపయోగకరమైన ప్రాజెక్టును రూపొందించాలి. తమ పని చూపిస్తూ సంబంధిత స్టార్టప్‌లకు వ్యక్తిగతంగా ఈమెయిల్స్ పంపాలి. ప్రతి కంపెనీకి మన సివి, రెజ్యూమ్‌లు పంపండం కంటే కొన్ని కంపెనీలకు సరిగ్గా సరిపోయే నైపుణ్యాలు పెంచుకోవాలని అతడు అభిప్రాయపడ్డాడు.
ప్రస్తుతం ‘బ్యాక్‌డోర్’ పేరుతో ఓ ఏఐ ఏజెంట్‌ను అభివృద్ధి చేస్తున్నాడు. స్టార్టప్‌లకు వ్యక్తిగతంగా కోల్డ్ ఈమెయిల్స్ పంపేందుకు ఈ టూల్ సహాయపడుతుంది. అతడి ప్రయాణం ఓ ముఖ్యమైన విషయాన్ని చెబుతోంది. ప్రతి ప్రాజెక్టు విజయవంతమైన వ్యాపారంగా మారాల్సిన అవసరం లేదు. ఆ ప్రాజెక్టు ద్వారా నేర్చుకున్న నైపుణ్యాలు కూడా మంచి ఉద్యోగ అవకాశాలను తెచ్చిపెట్టగలవు.
Also Read: ఆఫీస్‌లో సహోద్యోగులతో స్నేహం మంచిదే.. కానీ ఈ విషయాలు మాత్రం వారికి చెప్పకూడదు