Lemon Soda: వేసవిలో వేడి నుంచి ఉపశమనం పొందడానికి చాలామంది నిమ్మసోడాను తాగుతారు. ఈ డ్రింక్ చాలా రుచికరంగా, తాజాగా అనిపిస్తుంది. అయితే, కొందరు దీన్ని తాగిన తర్వాత గ్యాస్ లేదా ఎసిడిటీ వంటి సమస్యలు వస్తాయని చెబుతుంటారు. నిమ్మసోడా వల్ల నిజంగా గ్యాస్, ఎసిడిటీ వస్తాయా, వస్తే వాటిని ఎలా తగ్గించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
నిమ్మసోడా ఎందుకు ఫేమస్?
వేసవిలో శరీరాన్ని చల్లబరిచేందుకు నిమ్మసోడా సులభమైన, ఆహ్లాదకరమైన ఎంపిక. నిమ్మకాయలోని విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. సోడాలోని గ్యాస్ వల్ల ఏర్పడే బుడగలు తాగేటప్పుడు సరదా అనుభూతిని ఇస్తాయి. అయితే, ఈ బుడగలు, నిమ్మకాయలోని యాసిడ్ గుణాలు కొన్నిసార్లు జీర్ణ సమస్యలకు కారణమవుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
గ్యాస్, ఎసిడిటీ ఎందుకు వస్తాయి?
నిమ్మసోడాలో కార్బోనేటెడ్ వాటర్ ఉంటుంది. ఇది కడుపులో గ్యాస్‌ను ఏర్పరుస్తుందని డాక్టర్లు చెబుతున్నారు. సోడాలోని బుడగలు కడుపులో చేరి గాలిని పెంచడం వల్ల తేన్పులు లేదా కడుపు ఉబ్బరంగా అనిపించవచ్చని అంటున్నారు. అలాగే, నిమ్మకాయలోని సిట్రిక్ యాసిడ్ కడుపులో యాసిడ్ లెవెల్స్‌ని పెంచి ఎసిడిటీకి దారితీస్తుందట. ముఖ్యంగా ఖాళీ కడుపుతో నిమ్మసోడా తాగితే ఈ సమస్యలు మరింత పెరుగుతాయని డాక్టర్లు చెబుతున్నారు. అధిక చక్కెర లేదా కృత్రిమ స్వీటెనర్లు కూడా జీర్ణక్రియను దెబ్బతీస్తాయని డాక్టర్లు వెల్లడిస్తున్నారు. అందుకే వీలైనంత వరకు దీన్ని తక్కువగా తీసుకోవడమే మంచిది.
ఎవరికి ఈ సమస్యలు ఎక్కువగా వస్తాయి?
ఇప్పటికే గ్యాస్ట్రిక్ లేదా ఆసిడ్ రిఫ్లక్స్ సమస్యలు ఉన్నవారు నిమ్మసోడాకు దూరంగా ఉండడమే మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా సున్నితమైన జీర్ణవ్యవస్థ ఉన్నవారు కూడా పరగడుపున సోడా తాగకూడదని అంటున్నారు.
అలాగే కార్బోనేటెడ్ డ్రింక్స్ తాగడం అలవాటు లేనివారు ఒకేసారి ఎక్కువ మొత్తంలో నిమ్మసోడా తాగకూడదు. దీని వల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
గ్యాస్, ఎసిడిటీని తగ్గించే చిట్కాలు
ఖాళీ కడుపుతో తాగవద్దని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. సోడా తాగే ముందు కొద్దిగా ఆహారం తీసుకుంటే ఎసిడిటీ తగ్గుతుందని అంటున్నారు. అలాగే చక్కెర తక్కువగా వాడడం మంచిది. అధిక చక్కెర లేదా కృత్రిమ స్వీటెనర్ల బదులు తేనె లేదా తక్కువ చక్కెర వాడాలి.
సోడాలో పుదీనా లేదా అల్లం కలుపుకొని తీసుకోవడం ఉత్తమం. పుదీనా ఆకులు లేదా అల్లం జీర్ణక్రియను మెరుగుపరుస్తాయట.
సోడా కారణంగా ఇప్పటికే గ్యాస్, ఎసిడితో ఇబ్బంది పడుతున్న వారు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ సమస్యలు తగ్గిపోతాయని నిపుణులు చెబుతున్నారు. జనం తర్వాత ఒక టీస్పూన్ జీలకర్ర పొడిని నీటితో తీసుకుంటే గ్యాస్, ఎసిడిటీ, అజీర్తి తగ్గుతాయట.
ఇంట్లో నిమ్మసోడా ఎలా తయారు చేయాలి?
ఇంట్లో నిమ్మసోడా తయారు చేయడం ఆరోగ్యకరమైన ఎంపిక. ఒక గ్లాస్ నీటిలో తాజా నిమ్మరసం, చిటికెడు ఉప్పు, ఒక టీస్పూన్ తేనె లేదా తక్కువ చక్కెర కలపండి. దీనికి కొద్దిగా కార్బోనేటెడ్ నీరు లేదా సోడా జోడించండి. ఈ విధంగా తయారు చేసిన సోడా రుచికరంగా ఉండడమే కాక, జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది.