గోంగూర పచ్చడి గురించి ఎంత చెప్పినా తక్కువే. తెలుగు ప్రజలు ఇష్టంగా తినే వాటిలో గోంగూర పచ్చడి ఒకటి. అలాగే పప్పు గోంగూర కూడా రుచిగా ఉంటుంది. ఒకసారి గోంగూర, ఎండుమిర్చి కలిపి వేపుడు చేసి చూడండి. ఇది మీ అందరికీ కచ్చితంగా నచ్చుతుంది. పైగా స్పైసీగా ఉంటుంది. కాబట్టి వేడి వేడి అన్నంలో కలుపుకుని తింటే అద్భుతంగా అనిపించడం ఖాయం.
గోంగూర ఎండు మిర్చి వేపుడుకి కావలసిన పదార్థాలు
గోంగూర – నాలుగు కట్టలు
గరం మసాలా – ఒక స్పూను
పసుపు – చిటికెడు
వెల్లుల్లి – ఆరు రెబ్బలు
ఉప్పు – రుచికి సరిపడా
నూనె – రెండు స్పూన్లు
కరివేపాకులు – గుప్పెడు
ఆవాలు – అర స్పూను
జీలకర్ర – అర స్పూను
ఎండుమిర్చి – పది
మినప్పప్పు – అర స్పూను
పచ్చిశనగపప్పు – అర స్పూను
కారం – అర స్పూను
గోంగూర ఎండు మిర్చి వేపుడు రెసిపీ
⦿ గోంగూర ఆకులను సన్నగా తరిగి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి.
⦿ ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.
⦿ ఆ నూనెలో ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, పచ్చిశనగపప్పు, కరివేపాకులు, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించుకోవాలి.
⦿ ఆ తర్వాత అందులో సన్నగా తరిగిన గోంగూర తరుగును వేసి బాగా కలుపుకోవాలి.
⦿ రుచికి సరిపడా ఉప్పును కూడా వేసి బాగా కలపాలి. పైన మూత పెట్టి మెత్తగా మగ్గనివ్వాలి.
⦿ బాగా మగ్గాక పసుపు, కారం కూడా వేసి బాగా కలుపుకోవాలి.
⦿ రెండు నిమిషాలు పాటు మూత పెట్టి ఉడకనివ్వాలి.
⦿ తర్వాత మూత తీసి గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి.
⦿ ఇది మొత్తం ఇగురులాగా దగ్గరగా అయ్యేవరకు స్టవ్ మీద ఉంచాలి.
⦿ అడుగంటుతున్నట్టు అనిపిస్తే పావు గ్లాసు నీటిని వేసి అది వేపుడు లాగా అయ్యే వరకు ఉంచాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి.
⦿ అంతే గోంగూర ఎండుమిర్చి వేపుడు రెడీ అయినట్టే.
⦿ ఇది చాలా రుచిగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో తింటే అద్భుతంగా ఉంటుంది. గోంగూర పచ్చడిని గుర్తు చేసేలా ఉంటుంది. ఒకసారి మీరు దీన్ని వండుకొని చూడండి మీకు కచ్చితంగా నచ్చుతుంది.
మనం కచ్చితంగా తినాల్సిన ఆహారాలలో గోంగూర కూర ఒకటి. గోంగూర అన్ని స్థాయిల వారికి అందుబాటులోనే ఉంటుంది. కాబట్టి వారానికి ఒకటి రెండు సార్లు అయినా తినాల్సిన అవసరం ఉంది. దీనిలో కాల్షియం, విటమిన్ సి, ఫోలిక్ యాసిడ్ అధికంగా ఉంటాయి. ఇవన్నీ కూడా మన శరీరానికి వచ్చే అవసరమైనవి. ముఖ్యంగా రాత్రిపూట చూపు సరిగా కనబడని వారు గోంగూరను తినాల్సిన అవసరం ఉంది. గోంగూరని తినడం వల్ల రేచీకటి వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. అలాగే శరీరంలో ఇన్ఫ్లమేషన్ వంటివి కూడా రావు. గోంగూరతో వండిన వంటకాలు అప్పుడప్పుడు తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. దీన్నే పుంటి కూర అని కూడా అంటారు. గోంగూరను తినడం వల్ల జలుబు, దగ్గు, జ్వరం వంటివి త్వరగా తగ్గిపోతాయి. దీనిలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. కాబట్టి రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. గోంగూర పచ్చడి చేసి ఇంట్లో పెట్టుకుంటే ప్రతిరోజు తినే అవకాశం ఉంటుంది. గోంగూర ఆకుకూరల్లో ప్రసిద్ధమైనది. కాబట్టి ప్రతివారం తినడం వల్ల పోషకాహార లోపం బారిన పడకుండా తప్పించుకోవచ్చు.
Also Read: తెలంగాణ స్టైల్లో బోటీ కూర చేశారంటే వదల్లేరు, కళాయి మొత్తం ఊడ్చేస్తారు