Gut Health: సాధారణంగా మనం ఏది తిన్నా అది అరగడానికి ఎంత టైం పడుతుంది అనే విషయంపై మనం పెద్దగా దృష్టి పెట్టం. ఏదో కడుపు నిండిందా లేదా అని మాత్రమే చూస్తాం. కానీ, మన పేగుల్లో ఆహారం ఎంత వేగంగా కదులుతుంది అనే దానిపైనే మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుందని తాజా పరిశోధనలు చెబుతున్నాయి. కొందరికి తిన్నది ఇట్టే అరిగిపోతే.. మరికొందరికి మాత్రం అది నత్తనడకన సాగుతుంది. ఈ వేగంలో తేడాలే మన కడుపులోని సూక్ష్మజీవుల తీరును మార్చేస్తాయి. ఇది ఎంతవరకు వెళ్తుందంటే.. మనకు భవిష్యత్తులో షుగర్ వస్తుందా లేదంటే పార్కిన్సన్స్ లాంటి నరాల సమస్యలు వస్తాయా అని చెప్పేంతలా ఈ వేగం ప్రభావం చూపుతుందట.
మన కడుపులో కోట్లాది సూక్ష్మజీవులు ఉంటాయని మనకు తెలుసు. ఇవి మనం తిన్న తిండిని అరిగించి శక్తిని ఇవ్వడంలో తోడ్పడతాయి. అయితే, మనం తిన్న ఆహారం పేగుల్లో ఎంత సేపు ఉంటుందనే దాన్ని బట్టే అక్కడ ఎలాంటి బ్యాక్టీరియా పెరగాలి అనేది డిసైడ్ అవుతుంది. ఒకవేళ జీర్ణ ప్రక్రియ చాలా స్లోగా ఉంటే.. అక్కడ ప్రోటీన్లను ఇష్టపడే బ్యాక్టీరియా తిష్టవేస్తుంది. అదే ఫాస్ట్‌గా ఉంటే కార్బోహైడ్రేట్లను ఇష్టపడే బ్యాక్టీరియా పెరుగుతుంది. ఈ రెండింటిలో ఏది అతిగా ఉన్నా అది మన ఆరోగ్యానికి అంత మంచిది కాదని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.
చాలామంది మలబద్ధకాన్ని ఒక చిన్న సమస్యగా చూస్తారు. కానీ, జీర్ణక్రియ మరీ నత్తనడకన సాగడం అనేది రాబోయే పెద్ద రోగాలకు ఒక హింట్ కావొచ్చు. కడుపులో వ్యర్థాలు ఎక్కువ సేపు ఉండిపోతే.. అక్కడ హానికరమైన కెమికల్స్ తయారయ్యే ఛాన్స్ ఉంటుంది. దీనివల్ల ఒంట్లో వాపులు రావడం, మెటబాలిజం దెబ్బతినడం వంటివి జరుగుతాయి. అసలు విచిత్రం ఏంటంటే.. మెదడుకు సంబంధించిన పార్కిన్సన్స్ లాంటి జబ్బులకు కూడా మన పేగుల వేగానికి ఏదో లింక్ ఉందని శాస్త్రవేత్తలు కనిపెట్టారు.
Also Read: ఏసీయే ఉండాలా ఏంటి.. కర్టెన్లు, ఇండోర్ ప్లాంట్స్‌తో ఇంటి ఉష్ణోగ్రతను తగ్గించుకోండిలా!
మన జీర్ణక్రియ ఎంత స్పీడుగా ఉందో తెలుసుకోవడానికి రకరకాల పద్ధతులు ఉన్నాయి. మనం విసర్జించే మలం ఆకారాన్ని బట్టి అది ఎంత టైం కడుపులో ఉందో చెప్పేయొచ్చు (దీనినే బ్రిస్టల్ స్టూల్ స్కేల్ అంటారు). మరికొన్ని టెస్టుల్లో స్పెషల్ క్యాప్సూల్స్ ఇచ్చి అవి ఎంత సేపట్లో బయటకు వస్తున్నాయో చూస్తారు. కడుపులో ఆహారం ఎక్కువ సేపు ఉంటే బ్యాక్టీరియా దాన్ని బాగా పులియబెట్టేస్తుంది. దీనివల్ల మన ఒంట్లో యాసిడ్ లెవల్స్ మారిపోయి, మన హెల్త్‌పై నేరుగా ప్రభావం చూపిస్తాయి.
మన ఫ్రెండూ లేదంటే ఆఫీస్ కొలీగూ ఏదో డైట్ ఫాలో అయ్యి బరువు తగ్గాడని మీరు కూడా అదే ఫాలో అయితే ఫలితం ఉండకపోవచ్చు. ఎందుకంటే మీ ఇద్దరి జీర్ణక్రియ వేగం వేరు వేరుగా ఉండొచ్చు. మీ పేగుల వేగాన్ని బట్టే మీరు వాడే మందులు గానీ, ప్రోబయోటిక్స్ గానీ మీపై పని చేస్తాయి. అందుకే భవిష్యత్తులో డాక్టర్లు కేవలం బ్లడ్ టెస్టులే కాకుండా, మీ పొట్ట ఎంత స్పీడుగా పని చేస్తోంది అనే దాన్ని బట్టి కూడా ట్రీట్‌మెంట్ ఇచ్చే రోజులు రాబోతున్నాయి.
ఈ పరిశోధన మనకు చెబుతున్నది ఒక్కటే.. ఏం తింటున్నాం అన్నది ఎంత ముఖ్యమో, అది మన ఒంట్లో ఎంత సేపు ఉంటోంది అనేది కూడా అంతే ముఖ్యం. మన పేగుల రిథమ్‌ను మనం సరిగ్గా అర్థం చేసుకోగలిగితే.. చాలా రోగాలను రాకుండానే ఆపేయొచ్చు. కాబట్టి.. జీర్ణక్రియలో ఏవైనా మార్పులు కనిపిస్తే అశ్రద్ధ చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించండి.
Also Read: వేసవిలో కూడా పెరటి తోట పచ్చగా ఉండాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!