 
					Telangana News: దేవుడి సన్నిధిలో ఉద్యోగం.. అది కూడా పరమపవిత్రమైన యాదగిరి గుట్టలో. అలాంటి చోటే చక్రం తిప్పాడు ఆ అధికారి. లంచాలు పిండుకోవడం మొదలు పెట్టాడు. చిన్నచిన్నగా మొదలుపెట్టి లక్షల్లో గుంజటం ప్రారంభించాడు. ఇంకేం అతి తక్కువ కాలంలోనే కోట్లాది రూపాయల అక్రమ సొమ్ము వెనకేశాడు. ఇదీ యాదగిరిగుట్ట ఆలయ ఇంఛార్జ్ ఎస్‌ఈ వెంకట రామారావు అవినీతి భాగోతం.
లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా ఏపీబీ అధికారులకు దొరికిన ఎస్ఈ
ఆలయంలోని పులిహోర యంత్రానికి సంబంధించి ఓ ప్రైవేటు కాంట్రాక్టర్ నుంచి లక్షా 90 వేల రూపాయల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా ఏసీబీ అధికారులకు చిక్కాడు ఎస్‌ఈ రామారావు. దేవస్థానం పరిధిలో తనకు రావాల్సిన 11 లక్షలా 50 వేల రూపాయల బిల్లులను సంబంధిత కాంట్రాక్టర్ అడగగా.. అందుకు 20 శాతం కమిషన్ ఇవ్వాలని ఎస్‌ఈ డిమాండ్ చేయడంతో రెండు లక్షలు ఇవ్వగలనని ఒప్పందం కుదుర్చుకున్నాడు. విషయాన్ని నల్గొండ రేంజ్ ఏసీబీ అధికారులకు చేరవేశాడు. అంతే వలపన్ని రెడ్ హ్యాండెడ్‌గా రామారావును పట్టుకున్నారు ఏసీబీ అధికారులు.
Also Read: అల్పపీడనం ఎఫెక్ట్!.. తెలంగాణలో మరో నాలుగు రోజులు భారీ వర్షాలు..
రామరావు ఇంట్లో విలువైన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్న ఏసీబీ
దీంతో.. రామారావుకు సంబంధించిన ఇళ్లు, ఆఫీసుల్లో సోదాలు చేశారు అధికారులు. ఎల్బీనగర్‌లోని రామారావు ఇంట్లో విలువైన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆయన్ను ఆలయానికి తీసుకెళ్లి ఇటీవలి కాలంలో ఆయన సంతకాలు చేసిన ఫైళ్ల వివరాలు, ఎవరెవరికి మేలు చేశారన్న దానిపై ఆరా తీశారు. ఈ క్రమంలోనే ఆయన వద్ద గుర్తించిన ఆస్తుల విలువ బహిరంగ మార్కెట్‌లో వంద కోట్ల వరకు ఉంటుందని ప్రచారం సాగుతోంది.