ప్రపంచవ్యాప్తంగా గుండె జబ్బుల బారినపడి మరణిస్తున్న వారి సంఖ్య పెరిగిపోతుంది. అకాల మరణాలకు ప్రధాన కారణాలలో కార్డియోవాస్కులర్ వ్యాధులు ప్రధానమైనవిగా మారాయి. కేవలం గుండె సంబంధిత సమస్యల వల్లే ప్రతి ఏటా 18 మిలియన్లకు పైగా ప్రజలు మరణిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు చిన్న వయసులోనే గుండె జబ్బులు రావడం సాధారణంగా మారిపోయింది.
గుండె బలహీనంగా మారినప్పుడు లేదా వైఫల్యం చెందడానికి ముందు కొన్ని రకాల సంకేతాలను చూపిస్తుంది. కానీ వీటిని ఆలస్యంగా గుర్తించేవారు, లేక వీటిపై అవగాహన లేని వారే ఎక్కువ మంది ఉన్నారు. గుండె సమస్యలు అనగానే ఊపిరాడకపోవడం, గుండె నొప్పి రావడం వంటి లక్షణాలే కనిపిస్తాయని ఎంతోమంది అనుకుంటారు. కానీ గుండె సమస్యలు రావడానికి ముందు శరీరంలోని ఇతర భాగాలలో కూడా కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. అమెరికన్ అకాడమీ ఆఫ్ డెర్మటాలజీ శాస్త్రవేత్తలు చెబుతున్న ప్రకారం గుండె జబ్బులు ముందస్తు హెచ్చరికలలో మూడు అసాధారణ లక్షణాలు కూడా ఉన్నాయి. అవి ముఖ్యంగా కాళ్లు వేళ్ళ పై కనిపిస్తాయి.
ఓస్లర్ నోడ్స్ ప్రమాదం
ఓస్లర్ నోడ్ అనే పరిస్థితి గుండె సమస్యలకు ముందు కనిపిస్తుంది. ఇవి కాలి వేళ్ళు లేదా చేతివేళ్లపై కనిపించవచ్చు. అంటే అర్థం కాలివేలు లేదా చేతివేళ్లపై గట్టిగా, మందంగా ఉండే బొడిపెలు. ఇవి సాధారణంగా కొంతమందికి అప్పుడప్పుడు వచ్చి పోతుంటాయి. కానీ గుండె సంబంధిత సమస్యలు వచ్చే ముందు మాత్రం చాలా మందంగా, నొప్పిగా ఉంటాయి. కొన్ని గంటల నుండి కొన్ని రోజుల వరకు ఇవి బాధపెట్టే అవకాశం ఉంది. ఒకసారి వాటంతట అవే పోతాయి. ఇలా ఓస్లర్ నోడ్స్ రావడం అనేది శరీరంలోని సమస్యలను సూచిస్తుంది. ఇది గుండె లోపలి పొర పై ఉన్న ఇన్ఫ్లమేషన్ తో సంబంధం కలిగి ఉంటుంది. వాటికి చికిత్స తీసుకోవాల్సిన అవసరం ఉంది. గుండె సంబంధిత సమస్య వల్ల ఇవి వచ్చినవి. అయితే వైద్యులు వెంటనే వీటిని గుర్తించి తగిలిన చికిత్స చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి నోడ్స్ వస్తే ఇంటి దగ్గరే ఉండిపోకుండా వైద్యులను సంప్రదించి ఉంచడం చాలా మంచిది.
పాదాల్లో వాపు కనిపించడం కూడా మంచిది కాదు. గుండెజబ్బుకు మరో తీవ్రమైన సంకేతంగా పాదాల్లోని వాపును చెప్పుకుంటారు. గుండె పని చేయకపోవడం వల్ల శరీరంలో రక్తం, ఇతర ద్రవాలు పేరుకుపోతాయి. దీనివల్ల పాదాలలో వాపు కనిపిస్తుంది. గుండె వ్యవస్థల్లో సమస్య ఉంటే ఇలా పాదాలు, చీలమండలు, కాళ్లలోని ఇతర భాగాలలో వాపు కనిపించే అవకాశం ఉంటుంది. కాబట్టి పాదాల్లో వాపు కనిపిస్తే మీరు తక్షణ వైద్య సహాయం తీసుకోవాల్సిన అవసరం ఉంది.
కాలి వేళ్ళు లేదా చేతివేళ్లు నీలిరంగులోకి మారడం కూడా మంచి పద్ధతి కాదు. రక్తంలో ఆక్సిజన్ తగ్గిపోతే ఇలా చేతివేళ్లు, కాలి వేళ్ళు నీలిరంగులోకి మారుతాయి. దీనిని సైనోసిస్ అని పిలుస్తారు. ఈ లక్షణం రక్తప్రసరణ వ్యవస్థలో తీవ్రమైన సమస్యలు ఉన్నాయని చెప్పే సంకేతం. దీనికి సకాలంలో చికిత్స చేయకపోతే అది చర్మం కింద ఉన్న కణజాలాల మరణానికి కారణం అవుతుంది. తద్వారా తీవ్రమైన ఆరోగ్య సమస్యలను తెచ్చిపెడుతుంది.
ఇతర గుండెపోటు లక్షణాలు
గుండె జబ్బులు లేదా గుండెపోటుకు సంబంధించిన అసాధారణ సంకేతాలలో తల తిరగడం, తీవ్రమైన అలసట కూడా ముఖ్యమైనవి. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ చెబుతున్న ప్రకారం ఈ తల తిరగడానికి లేదా విపరీతంగా అలసిపోవడానికి, చెమటలు పట్టడానికి కేవలం గుండె సమస్యలే కారణం కాకపోవచ్చు. ఇతర ఆరోగ్య సమస్యల వల్ల కూడా రావచ్చు. కానీ నిరంతరం తల తిరుగుతున్నట్టు అనిపించినా, శరీరానికి విపరీతంగా చెమటలు పడుతున్నా, అసాధారణంగా అలసటగా అనిపిస్తున్నా వైద్యులను కలిసి గుండె పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం. అవి గుండె సమస్య వల్ల రాకపోతే ప్రాణానికి ప్రమాదం ఏర్పడదు.