Indiramma Houses Scheme: పేదలకు గూడు అవసరం తీర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న పథకం ఇందిరమ్మ ఇళ్లు. రాష్ట్రవ్యాప్తంగా ఆయా ఇళ్ల నిర్మాణాలకు సంబంధించిన పనులు చురుగ్గా జరుగుతున్నాయి. నియోజకవర్గానికి 3,500 చొప్పున మొదటి విడతలో 4,16,500 ఇళ్లను మంజూరు చేసింది ప్రభుత్వం.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పథకం ఇందిరమ్మ ఇళ్లు. తొలి విడతగా 4,16,500 ఇళ్లు మంజూరు చేసింది ప్రభుత్వం. వాటి పనుల్లో 45 శాతం పురోగతి కనిపిస్తోంది. గృహనిర్మాణ శాఖ అధికారులు ఎప్పుటికప్పుడు లబ్ధిదారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. దీనివల్ల నిర్మాణం పనులు వేగంగా జరుగుతున్నాయి.
ప్రతీ నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇళ్లు కేటాయిస్తున్నారు అధికారులు. ఇందిరమ్మ ఇళ్లపై అన్ని జిల్లాల కలెక్టర్లు క్షేత్రస్థాయిలో సమీక్షలు చేస్తున్నారు. ఈనెలలో ఎక్కువ ఇళ్లు నిర్మాణం జరిగే విధంగా లబ్దిదారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. రానున్నది వర్షాకాలం కావడంతో వేగంగా నిర్మాణాలు జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు. లబ్ధిదారుల ఎంపిక విషయంలో విమర్శలకు తావివ్వకుండా ఈ ప్రక్రియ కొనసాగిస్తున్నారు.
ఓవైపు ఇందిరమ్మ కమిటీలు, మరోవైపు అధికారులు పక్కాగా అర్హులను గుర్తిస్తున్నారు. అనర్హులకు ఇల్లు కేటాయిస్తే అధికారులపై కఠినచర్యలు తప్పవని హెచ్చరించడంతో క్షేత్రస్థాయిలో లోపాలు లేకుండా బాధ్యతను తీసుకుని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు జిల్లాల కలెక్టర్లు.
ALSO READ: ఇండియాకు రాని ప్రభాకర్‌రావు, విచారణకు హాజరవుతారా?
గ్రామాల వారీగా వచ్చిన దరఖాస్తుల్లో తొలుత పేదలను గుర్తిస్తున్నారు. గ్రామ, మండల, జిల్లా స్థాయిలో లబ్ధిదారులను పరిశీలించి చివరకు ఆమోద ముద్ర వేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎంపీడీవోల స్థాయిలో 2,86,016 లబ్ధిదారుల ఇళ్లు ఆమోదం పొందాయి. కలెక్టర్ల స్థాయిలో 2,03,744 మందికి ఆమోదం లభించింది.
ప్రభుత్వం ఇవ్వాల్సిన నిధులను లబ్దిదారులకు అందజేయడంతో ఇళ్ల నిర్మాణం వేగంగా సాగుతోంది. మే 28 నాటికి లక్షా 89 వేల 997 మంది లబ్దిదారులకు నిర్మాణ పత్రాలను అందజేశారు. రాష్ట్రస్థాయిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో ముందు వరుసలో నిలిచింది రాజన్న సిరిసిల్ల జిల్లా.
మొత్తం 7,808 అర్హులకు గుర్తించిన అధికారులు వాటిలో 7,862 ఇళ్లు మంజూరు అయ్యాయి. అంటే దాదాపు 99.31 శాతం అన్నమాట. కామారెడ్డి జిల్లా 92 శాతంతో తర్వాత స్థానంలో నిలిచింది. ఇక రంగారెడ్డి జిల్లా 90 శాతం మూడో స్థానంలో ఉంది. మరోవైపు ఈ ఏడాది మాత్రమే కాకుండా రానున్న నాలుగేళ్లలో 20 లక్షల ఇందిరమ్మ ఇళ్లు కట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి పొంగులేటి తెలిపారు.