Fake Hotel Reviews: ఆన్‌లైన్‌లో హోటల్ రూమ్ బుక్ చేసుకునేటప్పుడు చాలా మంది ఆ హోటల్ కు సంబంధించిన రివ్యూలను పరిశీలిస్తుంటారు. అయితే రివ్యూలు బాగున్నాయి కదా అని నమ్మి గది బుక్ చేస్తే.. తీరా అక్కడికి వెళ్లాక చేదు అనుభవం ఎదురుకావడం చాలా మందికి జరిగే ఉంటుంది. కొన్ని హోటళ్లు ఫేక్ రివ్యూలతో కస్టమర్లను బురిడీ కొట్టిస్తున్న ఘటనలు ప్రస్తుతం పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఆన్‌లైన్‌లో హోటల్ బుక్ చేసుకునే ముందు అసలైన రివ్యూ ఏదో, ఫేక్ రివ్యూ ఏదో నిమిషాల్లో ఎలా గుర్తించాలో ఇప్పుడు చూద్దాం.
హోటల్ రివ్యూ చూసేటప్పుడు గమనించాల్సిన అతిపెద్ద అంశం ఇదే. రివ్యూ రాసిన కస్టమర్ అక్కడ దిగిన ఫోటోలు ఏవీ పెట్టకపోతే అనుమానించాల్సిందే. కేవలం మాటల్లో మాత్రమే పొగడ్తలు ఉండి ఒక్క ఫోటో కూడా లేకపోతే అది ఫేక్ రివ్యూ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అలాగే కొన్ని హోటళ్ల ఫోటోలు మరీ ఎక్కువగా కలర్‌ఫుల్‌గా ఎడిట్ చేసినట్లు అనిపిస్తే కూడా అప్రమత్తంగా ఉండాలి.
బుక్ చేయాలనుకుంటున్న హోటల్‌కు సంబంధించి ఒక్క రోజే పదుల సంఖ్యలో రివ్యూలు ఉంటే అది ఖచ్చితంగా ఫేక్ రివ్యూల మేనియానే. హోటల్ రేటింగ్ పెంచుకోవడానికి బాట్‌లు (Bots) లేదా ఏజెన్సీల ద్వారా ఒకే రోజు బల్క్‌గా రివ్యూలు రాయిస్తుంటారు. నిజమైన హోటళ్లకు వేర్వేరు తేదీలలో వేర్వేరు ప్రాంతాల నుంచి రివ్యూలు వస్తుంటాయని నిపుణులు చెబుతున్నారు.
రివ్యూల సెక్షన్‌లో ఒకే రకమైన పదాలు, వాక్యాలు మళ్లీ మళ్లీ కనిపిస్తే అవి ఫేక్ కామెంట్లని గుర్తించాలి. ఉదాహరణకు ‘చాలా మంచి హోటల్. అద్భుతమైన సర్వీస్’ అని దాదాపు అందరూ ఒకే తరహా టెంప్లేట్ లాంటి మెసేజ్ రాస్తే అది పక్కా ప్లాన్ ప్రకారం చేయించినట్లే. నిజమైన కస్టమర్లు తమకు ఎదురైన అనుభవాలను (ఆహారం, శుభ్రత, సిబ్బంది ప్రవర్తన మొదలైనవి) వివరిస్తూ రివ్యూలు రాస్తుంటారు.
కస్టమర్లతో హోటల్ వ్యవహరించే తీరును కనిపెట్టేందుకు నెగెటివ్ రివ్యూలకు వారు ఇచ్చే రిప్లైలు బాగా ఉపయోగపడతాయి. ఎవరైనా 1-స్టార్ రేటింగ్ ఇచ్చి సమస్యను చెబితే హోటల్ యాజమాన్యం పద్ధతిగా, ప్రొఫెషనల్‌గా సమాధానం చెప్పాలి. అలా కాకుండా కోపంగా, అగ్రెసివ్‌గా కస్టమర్‌పైనే విరుచుకుపడితే అటువంటి హోటళ్లకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.
రివ్యూలలో కనిపిస్తున్న ఫోటోలు నిజంగా ఆ హోటల్‌వేనా లేదా ఎక్కడి నుంచైనా దొంగిలించారా అని తెలుసుకోవడానికి గూగుల్ ఇమేజ్ సెర్చ్ ఉపయోగపడుతుంది. ఆ ఫోటోలను గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్‌లో పెట్టి చూస్తే అవి స్టాక్ ఫోటోలా లేదా వేరే సోషల్ మీడియా ఖాతాల నుంచి కాపీ చేసినవా అనేది క్షణాల్లో తేలిపోతుంది.
హోటళ్ల బుకింగ్ కు సంబంధించి కేవలం ఒక్క వెబ్‌సైట్‌పైనే ఆధారపడి నిర్ణయం తీసుకోవద్దని నిపుణులు సూచిస్తున్నారు. గూగుల్ రివ్యూస్‌లో హోటల్ రేటింగ్ 4.8 ఉండి ట్రిప్‌అడ్వైజర్ (TripAdvisor) లేదా మేక్‌మైట్రిప్‌లో రేటింగ్ 3.2 మాత్రమే ఉంటే అక్కడ ఏదో తేడా ఉన్నట్లేనని పేర్కొంటున్నారు. విభిన్న ప్లాట్‌ఫారమ్‌లలో రేటింగ్‌లు, కస్టమర్ల కామెంట్లను పోల్చి చూసుకున్నప్పుడే ఆ హోటల్ అసలు రంగు బయటపడుతుందని తెలియజేస్తున్నారు.
Also Read: విమాన ప్రయాణం వేస్ట్.. ఈ రైలు జర్నీనే బెస్ట్.. 5-స్టార్ హోటల్ ఫీలింగ్!