Paneer Chilli Recipe| బయట హోటల్‌కు వెళ్లినప్పుడు వేడివేడిగా, స్పైసీ పన్నీర్ చిల్లీ తినాలని అనిపిస్తుందా? అయితే ఇకపై దాని కోసం రెస్టారెంట్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే తక్కువ పదార్థాలతో ఎంతో రుచికరమైన పన్నీర్ చిల్లీ తయారుచేసుకోవచ్చు. వంట చేయడం కొత్తగా నేర్చుకునేవారు కూడా ఈ రెసిపీని సులభంగా ప్రయత్నించవచ్చు. క్రిస్పీ పన్నీర్ ముక్కలు, కరకరలాడే కూరగాయలు, స్పైసీ సాస్‌ల కలయికతో ఈ డిష్ రుచి అదిరిపోతుంది. మరి ఆలస్యం చేయకుండా హోటల్ స్టైల్ పన్నీర్ చిల్లీని ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం.
ఈ రుచికరమైన వంటకం తయారుచేయడానికి ఇంట్లోనే సులభంగా లభించే పదార్థాలు సరిపోతాయి.
పన్నీర్ – 250 గ్రాములు
ఉల్లిపాయ – 1
పచ్చిమిర్చి – 4
క్యాప్సికమ్ – 1
స్ప్రింగ్ ఆనియన్స్ – 2
అల్లం వెల్లుల్లి పేస్ట్ – 2 టేబుల్ స్పూన్లు
సోయా సాస్ – 1 టేబుల్ స్పూన్
టమాటో సాస్ – 1 టేబుల్ స్పూన్
గ్రీన్ చిల్లీ సాస్ – 1 టేబుల్ స్పూన్
మైదా – 50 గ్రాములు
కార్న్ ఫ్లోర్ – 2 టేబుల్ స్పూన్లు
పసుపు – అర టీస్పూన్
కారం పొడి – తగినంత
మిరియాల పొడి – అర టీస్పూన్
ఉప్పు – అర టీస్పూన్
నూనె, నీళ్లు – తగినంత
ముందుగా ఒక గిన్నెలో మైదా, కార్న్ ఫ్లోర్, కారం పొడి, పసుపు, ఉప్పు వేయాలి. కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ చిక్కటి మిశ్రమంలా కలుపుకోవాలి. ఇప్పుడు పన్నీర్ ముక్కలను అందులో వేసి బాగా కలపాలి. ప్రతి ముక్కకు పిండి పట్టేలా చూసుకుని పక్కన పెట్టుకోవాలి.
స్టవ్‌పై పాన్ పెట్టి నూనె వేడి చేయాలి. అందులో పిండి పట్టించిన పన్నీర్ ముక్కలను వేసి మీడియం మంటపై వేయించాలి. అవి బంగారు రంగులోకి మారి కొద్దిగా క్రిస్పీగా అయ్యాక బయటకు తీసి పక్కన పెట్టుకోవాలి.
అదే పాన్‌లో కొద్దిగా నూనె వేసి అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు వేయాలి. అవి కొద్దిగా వేగిన తర్వాత పచ్చిమిర్చి, క్యాప్సికమ్ ముక్కలు వేయాలి. వీటిని హై ఫ్లేమ్‌పై కొద్దిసేపు వేయించాలి. కూరగాయలు మరీ మెత్తగా కాకుండా కొద్దిగా క్రంచీగా ఉండేలా చూసుకోవాలి.
Also Read: చాణక్య నీతి.. దానధర్మాలు చేసే ముందు ఈ 7 విషయాలు గుర్తుంచుకోండి
ఇప్పుడు సోయా సాస్, టమాటో సాస్, గ్రీన్ చిల్లీ సాస్ వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, మిరియాల పొడి కూడా కలపాలి. వీటన్నింటినీ బాగా కలిపి కొన్ని నిమిషాలు ఉడికించాలి. ఇలా చేయడం వల్ల పన్నీర్ చిల్లీకి మంచి స్పైసీ, ట్యాంగీ రుచి వస్తుంది.
ఇప్పుడు కొద్దిగా నీళ్లు పోసి కలపాలి. పన్నీర్‌కు పట్టించగా మిగిలిన పిండి మిశ్రమాన్ని కూడా వేసి కలపాలి. గ్రేవీ కొద్దిగా చిక్కబడే వరకు ఉడికించాలి. తర్వాత వేయించిన పన్నీర్ ముక్కలను వేసి మెల్లగా కలపాలి. సాస్ పన్నీర్‌కు బాగా పట్టే వరకు కొన్ని నిమిషాలు ఉడికించాలి.
Also Read: రూ.5 చిప్స్ ప్యాకెట్ కొంటే మోసం.. లేస్ కంపెనీకి రూ.8,000 జరిమానా విధించిన కోర్టు
చివరిగా సన్నగా తరిగిన స్ప్రింగ్ ఆనియన్స్‌తో గార్నిష్ చేయండి. అంతే.. ఎంతో రుచికరమైన హోటల్ స్టైల్ పన్నీర్ చిల్లీ సిద్ధం. దీనిని వేడివేడిగా స్టార్టర్‌గా సర్వ్ చేయవచ్చు. ఫ్రైడ్ రైస్, నూడుల్స్‌తో కూడా కలిపి తినవచ్చు. మీకు ఎంత కారం కావాలో దానికి అనుగుణంగా పచ్చిమిర్చి, సాస్‌ల పరిమాణాన్ని మార్చుకోవచ్చు.