Oil Palm: తెలంగాణలో ఆయిల్‌పామ్ సాగు, ప్రాసెసింగ్ రంగాల అభివృద్ధిలో తెలంగాణ కోఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోవర్స్ ఫెడరేషన్ (టీజీ ఆయిల్ ఫెడ్) 2025-26 సంవత్సరంలో సరికొత్త చరిత్ర సృష్టించింది. రైతులకు మెరుగైన సేవలు అందించడం, ప్రాసెసింగ్ సామర్థ్యాన్ని పెంచడం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడం, పారిశ్రామిక మౌలిక సదుపాయాలను విస్తరించడం వంటి అంశాల్లో గణనీయమైన పురోగతి సాధించింది. గత ఏడాదితో పోలిస్తే గెలల ప్రాసెసింగ్‌లో ఏకంగా 44.60 శాతం వృద్ధిని నమోదు చేయడం ఈ విజయానికి నిదర్శనం.
2024-25 సంవత్సరంలో 3,27,803 మెట్రిక్ టన్నుల గెలలను ప్రాసెస్ చేసిన టీజీ ఆయిల్ ఫెడ్.. 2025-26లో ఏకంగా 4,73,997 మెట్రిక్ టన్నులను ప్రాసెస్ చేసింది. గత ఏడాదితో పోలిస్తే అదనంగా 1,46,194 మెట్రిక్ టన్నుల ప్రాసెసింగ్ చేపట్టి 44.60 శాతం వృద్ధిని సాధించింది. తక్కువ వయస్సు కలిగిన అప్పారావుపేట, నర్మెట్ట ఆయిల్‌పామ్ తోటల నుంచి వచ్చిన సుమారు 1.50 లక్షల మెట్రిక్ టన్నుల గెలెలను సైతం సమర్థవంతంగా ప్రాసెస్ చేస్తూ 19.62 శాతం ఆయిల్ ఎక్స్‌ట్రాక్షన్ రేషియో సాధించడం విశేషం.
కొత్తగా ఏర్పాటు చేసిన నర్మెట్ట ఆయిల్‌పామ్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీని పూర్తి సామర్థ్యంతో విజయవంతంగా నిర్వహించడం ద్వారా ప్రాసెసింగ్ రంగంలో మరో కీలక మైలురాయిని అధిగమించింది. అంతేకాకుండా ప్రభుత్వ రంగంలోనే తొలిసారిగా ఆయిల్‌పామ్ రిఫైనరీ ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. ఇది తెలంగాణ ఆయిల్‌పామ్ పరిశ్రమ అభివృద్ధిలో చారిత్రక ముందడుగుగా నిలవనుంది.
2025-26 సంవత్సరంలో ఒక నెలలో అత్యధికంగా 50,150 మెట్రిక్ టన్నుల గెలలను ప్రాసెస్ చేసింది. గత ఏడాది నమోదైన 39,840 మెట్రిక్ టన్నులతో పోలిస్తే 10,310 మెట్రిక్ టన్నుల అదనపు ప్రాసెసింగ్ సాధించింది. అలాగే రోజువారీ ప్రాసెసింగ్‌లోనూ గత ఏడాది 1,650 మెట్రిక్ టన్నుల రికార్డును అధిగమించి 1,850 మెట్రిక్ టన్నుల గెలలను ప్రాసెస్ చేసింది. అశ్వారావుపేట ప్రాసెసింగ్ యూనిట్ ఒక్కటే ఈ ఏడాది 1,01,495 మెట్రిక్ టన్నుల గెలలను ప్రాసెస్ చేయడం విశేషం. నట్ ఉత్పత్తి 22,788 మెట్రిక్ టన్నుల నుంచి 33,182 మెట్రిక్ టన్నులకు పెరిగింది. అదనంగా 10,394 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి నమోదైంది. పామ్ కెర్నల్ ఆయిల్ రికవరీ 17.17 శాతం నుంచి 17.64 శాతానికి మెరుగుపడగా, పీకేఓ ఉత్పత్తి 5,075 మెట్రిక్ టన్నుల నుంచి 5,853 మెట్రిక్ టన్నులకు చేరింది.
ఆయిల్‌పామ్ రైతుల ఆర్థిక ప్రయోజనాలకు ప్రాధాన్యతనిస్తూ టీజీఓఐఎల్‌ఫెడ్ 2025-26లో రైతులకు సుమారు రూ.1,100 కోట్లను గెలల కొనుగోలు చెల్లింపుల రూపంలో పంపిణీ చేసింది. ఏడాది పొడవునా మెట్రిక్ టన్నుకు సగటున రూ.23,100 ధరను రైతులకు అందించింది. అంతేకాకుండా ఎలాంటి క్రాప్ హాలిడే ప్రకటించకుండా నిరంతరాయంగా ప్రాసెసింగ్ కార్యకలాపాలను కొనసాగించింది. రైతులు పండించిన గెలలను వేగంగా అన్‌లోడ్ చేసే విధానాలను ప్రవేశపెట్టి, నిరీక్షణ సమయాన్ని తగ్గించింది. పారదర్శక కొనుగోలు విధానంతో పాటు కొత్త గెలల సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేసింది.
Also Read: గడ్డం, మీసం పెంచితే రేవంత్ రెడ్డి అయిపోతావా? కేటీఆర్‌పై వేముల వీరేశం సంచలన కామెంట్స్!
ఆయిల్‌పామ్ సాగు విస్తరణకు ప్రోత్సాహం అందిస్తూ నాణ్యమైన మొక్కల పంపిణీపై ప్రత్యేక దృష్టి సారించింది. నర్సరీల నిర్వహణలో నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ ఒక్క నెలలోనే సుమారు 3.50 లక్షల ఆయిల్‌పామ్ మొక్కలను పంపిణీ చేసింది. రైతులకు ట్రైకోడెర్మా, వామ్స్ వంటి జీవ ఎరువులను 50 శాతం సబ్సిడీపై అందించేందుకు ప్రణాళిక రూపొందించింది. అలాగే వ్యవసాయ యంత్ర పరికరాలను తక్కువ ధరలకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కస్టమ్ హైరింగ్ సెంటర్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టింది.
విజయ బ్రాండ్ ఎడిబుల్ ఆయిల్స్ ఉత్పత్తి, ప్యాకింగ్, పంపిణీని మరింత విస్తరించేందుకు పూర్తిస్థాయి ఆటోమేటెడ్ మెగా ఆయిల్ ప్యాకింగ్ స్టేషన్‌ను ఏర్పాటు చేసింది. ఈ కేంద్రం ద్వారా నాణ్యమైన విజయ వంట నూనెలను పోటీ ధరలకు రాష్ట్రవ్యాప్తంగా వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ప్రస్తుతం అప్పారావుపేటలో 90 టీపిహెచ్, అశ్వారావుపేటలో 30 టీపిహెచ్, నర్మెట్టలో 30 టీపిహెచ్ సామర్థ్యంతో మూడు ఆయిల్‌పామ్ ప్రాసెసింగ్ యూనిట్లను నిర్వహిస్తోంది. నర్మెట్ట యూనిట్‌ను భవిష్యత్తులో 120 టీపిహెచ్ సామర్థ్యానికి విస్తరించే అవకాశం ఉంది. పెరుగుతున్న గెలల ఉత్పత్తికి అనుగుణంగా అశ్వారావుపేటలో అదనంగా 60 టీపిహెచ్, బీచుపల్లిలో 30 టీపిహెచ్, మహబూబాబాద్‌లో 30 టీపిహెచ్ సామర్థ్యంతో మరో మూడు ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేయాలని ప్రణాళిక రూపొందించింది.
కల్లూరుగూడెంలో 15 టీపిహెచ్ సామర్థ్యంతో నిర్మించిన మరో ఆయిల్‌పామ్ ప్రాసెసింగ్ యూనిట్ నిర్మాణం పూర్తయి ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది. భవిష్యత్తులో దీనిని 60 టీపిహెచ్ సామర్థ్యానికి విస్తరించనున్నారు. ఈ యూనిట్ అందుబాటులోకి వస్తే రైతులకు ప్రాసెసింగ్ కేంద్రాలు మరింత చేరువ కావడంతో పాటు రవాణా సమయం, ఖర్చులు తగ్గనున్నాయి. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మల్టిపుల్ ఎఫెక్ట్ ఎవాపరేటర్ (MEE) ప్లాంట్లను జీరో లిక్విడ్ డిశ్చార్జ్ (ZLD) విధానంలో విజయవంతంగా నిర్వహిస్తోంది. దీనివల్ల వ్యర్థ జలాల సమర్థవంతమైన నిర్వహణతో పాటు పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతోంది. ప్రాసెసింగ్ ప్లాంట్లు, సేకరణ కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి పర్యవేక్షణను మరింత పటిష్టం చేసింది.
మొత్తంగా 2025-26 ఆయిల్ ఇయర్‌లో అదనంగా 1.46 లక్షల మెట్రిక్ టన్నుల గెలలను ప్రాసెస్ చేసి 44.60 శాతం వృద్ధిని సాధించడం, నర్మెట్ట ఫ్యాక్టరీని పూర్తి సామర్థ్యంతో నిర్వహించడం, ప్రభుత్వ రంగంలో తొలి ఆయిల్‌పామ్ రిఫైనరీ ఏర్పాటుకు చర్యలు చేపట్టడం టీజీఓఐఎల్‌ఫెడ్ సాధించిన కీలక విజయాలుగా నిలిచాయి. రైతుల ఆదాయాన్ని పెంచడం, ప్రాసెసింగ్ సామర్థ్యాన్ని విస్తరించడం, పర్యావరణహిత పారిశ్రామిక అభివృద్ధిని ప్రోత్సహించడం లక్ష్యంగా సంస్థ ముందుకు సాగుతోంది.
Also read: ఇక విదేశాల్లోనూ వందే భారత్ పరుగులు.. రైల్వేమంత్రి సంచలన ప్రకటన!