ప్రస్తుతం చాలా మంది ఉద్యోగులు రోజులో ఎక్కువ సమయం కంప్యూటర్ ముందు కూర్చునే పనులు చేస్తున్నారు. ఈ అలవాటు పనితీరును మెరుగుపరిచినా, కొన్ని ఆరోగ్య సమస్యలకు కారణమవుతోంది. ముఖ్యంగా పైల్స్ (హెమరాయిడ్స్) సమస్య యువ ఉద్యోగుల్లో కూడా పెరుగుతోందని వైద్యులు చెబుతున్నారు. పుణె నగరంలోని అపోలో స్పెక్ట్రా హాస్పిల్‌లో జెనెరల్ సర్జన్ డాక్టర్ కిరణ్ కుమార్ జాధవ్ ప్రకారం.. పైల్స్ అనేది మలద్వారం చుట్టూ ఉన్న రక్తనాళాలు వాపు రావడం వల్ల ఏర్పడే సమస్య. దీని వల్ల అసౌకర్యం, నొప్పి, ఇతర ఇబ్బందులకు దారితీస్తుంది.
రోజుకు 8 నుంచి 10 గంటల వరకు కుర్చీలో కూర్చోవడం వల్ల మలద్వారం చుట్టూ ఉన్న రక్తనాళాలపై ఒత్తిడి పెరుగుతుంది. ఈ ఒత్తిడి పైల్స్ వచ్చే అవకాశాన్ని పెంచుతుంది. దీనికి తోడు తక్కువ నీరు తాగడం, పీచుపదార్థాలు తక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం, మలబద్ధకం, వ్యాయామం లేకపోవడం వంటి కారణాలు సమస్యను మరింత తీవ్రతరం చేస్తాయి. రక్తప్రసరణ కూడా సరిగా జరగకపోవడం వల్ల ఈ సమస్య వేగంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది.
ఇటీవలి కాలంలో 30 నుంచి 45 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న ఉద్యోగుల్లో పైల్స్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయని వైద్యులు చెబుతున్నారు.
చాలా మంది ప్రారంభ లక్షణాలను పట్టించుకోరు. దీంతో సమస్య మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంటుంది. ప్రారంభ దశలోనే గుర్తిస్తే చికిత్స సులభంగా ఉంటుంది.
పైల్స్ ప్రారంభ లక్షణాల్లో దురద ఒకటి. ఈ ప్రాంతంలో నిరంతర చికాకు కూడా కనిపించవచ్చు.
మలబద్ధకం సమస్య ఉన్నవారిలో మల విసర్జన సమయంలో నొప్పి లేదా అసౌకర్యం ఎక్కువగా కనిపిస్తుంది.
మల విసర్జన సమయంలో లేదా తర్వాత ఎర్రటి రక్తం కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి.
కొంతమందికి వాపు కనిపించవచ్చు. మరికొందరికి మలం పూర్తిగా బయటకు విసర్జన జరగలేదనే భావన కలుగుతుంది.
రోజూ పండ్లు, కూరగాయలు, సలాడ్లు, ధాన్యాలను ఆహారంలో చేర్చాలి. ఇవి పీచుపదార్థాలు అందించి మలబద్ధకాన్ని తగ్గిస్తాయి. రోజంతా తగినంత నీరు తాగడం చాలా ముఖ్యం. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ప్రతి గంటకు ఒకసారి లేచి కొద్దిసేపు నడవడం మంచిది. ఇది రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. రోజూ వ్యాయామం చేయడం కూడా ఎంతో ఉపయోగకరం. అలాగే మల విసర్జన అవసరం వచ్చినప్పుడు ఆలస్యం చేయకూడదు.
Also Read: ఉదయం అలారం మోగుతున్నా ఆఫ్ చేసి పడుకుంటున్నారా? అలారం లేకుండానే లేవడానికి సింపుల్ టిప్స్
చాలామంది ఈ సమస్య గురించి చెప్పడానికి సంకోచిస్తారు. కానీ చికిత్స ఆలస్యం చేస్తే నొప్పి, రక్తస్రావం, రక్తహీనత వంటి సమస్యలు రావచ్చు.
ప్రస్తుతం ఆధునిక వైద్య విధానాలతో తక్కువ నొప్పితో, త్వరగా కోలుకునే చికిత్సలు అందుబాటులో ఉన్నాయి.
ఎక్కువసేపు కూర్చునే ఉద్యోగుల్లో పైల్స్ సమస్య వేగంగా పెరుగుతోంది. సరైన ఆహారం, తగినంత నీరు, క్రమం తప్పని వ్యాయామం, ముందస్తు వైద్య సలహా ద్వారా ఈ సమస్యను నివారించవచ్చు. ఆరోగ్యకరమైన జీవనశైలి మీ జీర్ణవ్యవస్థను, పూర్తి ఆరోగ్యాన్ని కాపాడుతుంది.