Silver Anklets Cleaning: వెండి పట్టీలు నల్లబడటం అనేది ఒక సాధారణ విషయం. కాళ్ళపై ఎక్కువ రోజులు ఉంటే నల్లగా మారడం ప్రారంభమవుతుంది. కాళ్లపై పడ్డ దుమ్ము, ధూళి, ఆక్సీకరణ పేరుకుపోవడం వల్ల దాని పట్టీల రంగు మసకబారుతుంది. అంతే కాకుండా వెండి గాలి, నీరు, ఇతర రసాయనాల ప్రభావానికి గురైనప్పుడు పట్టీలు నల్లగా మారతాయి. అయితే ఇలాంటి సమయంలోనే రంగు మారిన పట్టీలను కొన్ని సింపుల్ చిట్కాలను ఉపయోగించి పాలిష్ చేయవచ్చు. మరి ఇంట్లోనే కొన్ని రకాల టిప్స్ పాటించి వెండి పట్టీలు మెరిసేలా చేయవచ్చు. మరి ఎలాంటి టిప్స్ పట్టీలను క్షణాల్లోనే తెల్లగా , మెరిసేలా చేస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.
వెండి పట్టీలను తెల్లగా మెరిపించే చిట్కాలు:
రాతి ఉప్పు, నిమ్మరసం:
మీ వెండి పట్టీలను మెరిపించడానికి, రాతి ఉప్పు, నిమ్మరసం యొక్క మిశ్రమాన్ని ఉపయోగించండి. ఇందుకోసం ఒక పాత్రలో కాస్త రాతి ఉప్పు వేసి దానికి తగినంత నిమ్మరసం కలపండి. ఈ మిశ్రమాన్ని బ్రష్ సహాయంతో పట్టీలపై రుద్దండి. కాసేపటి తర్వాత శుభ్రమైన నీటితో కడిగి, ఆరబెట్టండి. ఇలా చేయడం వల్ల పట్టీలు కొత్త వాటిలాగా మెరిసిపోతాయి.
బేకింగ్ సోడా, నీరు:
వెండి కాళ్ళ పట్టీలను మెరిసేలా చేయడానికి బేకింగ్ సోడాను ఉపయోగించడం ఒక ప్రభావవంతమైన మార్గం. బేకింగ్ సోడా , నీటిని పేస్ట్ లా చేసి, దానిని పట్టీల మీద అప్లై చేసి, సున్నితంగా రుద్దండి. కొన్ని నిమిషాల తర్వాత నీటితో కడిగి బాగా ఆరబెట్టండి. ఇలా చేయడం ద్వారా పట్టీలు తెల్లగా మెరిసిపోతాయి. అంతే కాకుండా కొత్త వాటిలాగా కనిపిస్తాయి.
టూత్ పేస్ట్ :
వెండి కాళ్ళ పట్టీలను మెరిపించడానికి టూత్ పేస్ట్ కూడా ఉపయోగపడుతుంది. ముందుగా రంగు మారిన పట్టీలపై టూత్ పేస్ట్ ను బ్రష్ సహాయంతో రుద్దండి. 5 నిమిషాల తర్వాత కడిగేయండి. ఇలా చేయడం వల్ల పట్టీలపై ఉన్న నలుపు తొలగిపోతుంది. అంతే కాకుండా కొత్త వాటిలా మెరుస్తాయి. తరువాత చల్లటి నీటితో శుభ్రం చేసుకుని ఆరబెట్టండి.
సిల్వర్ పాలిషింగ్ క్రీమ్:
వెండి పట్టీలను మెరిసేలా చేయడానికి మీరు మార్కెట్లో లభించే సిల్వర్ పాలిషింగ్ క్రీమ్‌ను కూడా ఉపయోగించవచ్చు. క్రీమ్‌ను పట్టీలపై బ్రష్ సహాయంతో రుద్దండి. 5- 10 నిమిషాల తర్వాత మరోసరి బ్రష్ తో రుద్దండి. ఇలా చేయడం వల్ల పేరుకుపోయిన మురికి శుభ్రం అవుతుంది. అంతే కాకుండా పట్టీలు కొత్త వాటిలా మెరుస్తాయ్.
Also Read: ఇలా క్లీన్ చేస్తే.. టైల్స్‌పై ఉన్న మొండి మరకలు కూడా మాయం
శనగపిండి , పసుపు:
శనగపిండి, పసుపు మిశ్రమం వెండి పట్టీలను మెరిసేలా చేయడానికి ఒక సహజ నివారణ. ఈ మిశ్రమాన్ని రంగు మారిన పట్టీలపై రాసి కొంత సమయం అలాగే ఉంచి, ఆపై నీటితో కడిగి శుభ్రం చేయాలి. ఇది పట్టీలను మెరిసేలా చేస్తుంది. అంతే కాకుండా మురికిని కూడా తొలగిస్తుంది. ఈ చిన్న చిన్న చిట్కాలు పాటించడం ద్వారా పట్టీలను కొత్త వాటిలాగా తక్కువ టైంలోనే మెరిపించవచ్చు. వీటి వల్ల ఎలాంటి ఖర్చు కూడా చేయాల్సిన అవసరం ఉండదు.