Car Key Not Detected: ఈ రోజుల్లో చాలా కార్లలో కీలెస్ ఎంట్రీ, పుష్ బటన్ స్టార్ట్ ఫీచర్లు ఉన్నాయి. అయితే, కొన్నిసార్లు కారులోకి వెళ్లి స్టార్ట్ బటన్ నొక్కగానే డాష్‌బోర్డ్‌పై ‘Key Not Detected’ అనే వార్నింగ్ కనిపిస్తుంది. చేతిలో కీ ఉన్నప్పటికీ కారు స్టార్ట్ కాకపోవడంతో డ్రైవర్లు ఇబ్బందిపడుతుంటారు. సాధారణంగా కీ ఫాబ్ బ్యాటరీ డల్ కావడం, సిగ్నల్ సమస్యతో పాటు కారు బ్యాటరీ ప్రాబ్లం కూడా దీనికి కారణం కావచ్చు. అయితే, కొన్ని ఈజీ పద్దతుల్లో కారును స్టార్ట్ చేసే అవకాశం ఉంది. ఎలాగంటే..
కీ బ్యాటరీ పూర్తిగా అయిపోయినా కొన్ని కార్లలో ఎమర్జెన్సీ స్టార్ట్ సదుపాయం ఉంటుంది. ముందుగా ఆటోమేటిక్ కారును పార్కింగ్ మోడ్ లో ఉంచి, బ్రేక్ పెడల్ నొక్కాలి. ఆ తర్వాత కీ ఫాబ్‌తోనే స్టార్ట్ బటన్‌ను నొక్కి, కొన్ని సెకన్ల పాటు దగ్గరగా ఉంచాలి. కారులోని బ్యాకప్ రీడర్ ఫాబ్‌లో ఉండే సెక్యూరిటీ చిప్‌ను గుర్తించి ఇంజిన్ స్టార్ట్ చేయడానికి సాయపడుతుంది. అయితే, ఈ విధానం కారు మోడల్‌ను బట్టి మారవచ్చు. అందుకే ఓనర్స్ మాన్యువల్ లో సూచనలు చూడాలి.
స్టార్ట్ బటన్ దగ్గర కీని ఉంచినా పనిచేయకపోతే కారులో ప్రత్యేకమైన బ్యాకప్ రీడర్ ఉంటుంది. ఇది సెంటర్ కన్సోల్, కప్ హోల్డర్ కింద, ఆర్మ్‌రెస్ట్ లోపల లేదంటే స్టీరింగ్ కాలమ్ దగ్గర ఉండే అవకాశం ఉంది. కొన్ని కార్లలో స్టార్ట్ బటన్ పక్కనే ఈ ఫీచర్ ఉంటుంది. అయితే, ప్రతి కారులో ఒకే విధంగా ఉండదు.
⦿ ఫాబ్ బ్యాటరీ వీక్ కావడం: కీ రిమోట్‌లోని CR2032, CR2025 లాంటి కాయిన్ బ్యాటరీ పనిచేయకపోతే సిగ్నల్ తగ్గుతుంది. సరైన బ్యాటరీతో మార్చాలి.
⦿ సిగ్నల్ సమస్య: మొబైల్ ఫోన్లు, USB ఛార్జర్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల వల్ల కొన్నిసార్లు సిగ్నల్ సమస్య రావచ్చు. కీని వాటికి దూరంగా ఉంచి ప్రయత్నించాలి.
⦿ కారు బ్యాటరీ సమస్య: కారు 12V బ్యాటరీ బలహీనంగా ఉన్నా కీలెస్ సిస్టమ్ సరిగ్గా పనిచేయకపోవచ్చు.
⦿ కీ ఫాబ్ దెబ్బతినడం: కిందపడటం, నీటిలో తడవడం వల్ల ఫాబ్ లోపలి సర్క్యూట్ దెబ్బతినవచ్చు. స్పేర్ కీతో ప్రయత్నించాలి.
⦿ కీలెస్ సిస్టమ్ లో ప్రాబ్లం: రెండు కీలు పనిచేయకపోతే కారు రిసీవర్, యాంటెన్నాలో సమస్య ఉండవచ్చు. సర్వీస్ సెంటర్ లో చెక్ చేయించాలి.
కీ రిమోట్ సిగ్నల్ రేంజ్ తగ్గినప్పుడు బ్యాటరీ మార్చాలి. స్పేర్ కీని అందుబాటులో ఉంచుకోవాలి. ఫాబ్‌ను నీటికి, దెబ్బలకు దూరంగా ఉంచాలి. ఎమర్జెన్సీ స్టార్ట్ చేసే విధానం ముందుగానే తెలుసుకోవాలి. ఈ పద్ధతులేవీ పనిచేయకపోతే రోడ్‌సైడ్ అసిస్టెన్స్ లేదంటే సర్వీస్ సెంటర్ కు వెళ్లడం మంచిది. అంతేకానీ, ఇమ్మొబిలైజర్‌ను బైపాస్ చేయడం, కారు వైరింగ్‌తో ప్రయోగాలు చేయడం చాలా ప్రమాదకరం.
Read Also: పొగమంచులో డ్రైవింగ్ చేస్తున్నారా? ఈ పొరపాట్లు చేస్తే ప్రాణాలకే ప్రమాదం!