Yaganti Temple: పురాణాలు చెప్పే అద్భుతాలు.. చరిత్ర చాటే వైభవాలు.. సైన్స్‌కు సైతం ఆసక్తికరమైన ప్రశ్నలు సంధించే రహస్యాలు..ఒకవైపు ఎత్తైన ఎర్రమల కొండలు.. మరోవైపు ప్రకృతి ఒడిలో కొలువుదీరిన పరమశివుడి దివ్య సన్నిధి..అక్కడ కాకులు వాలవని భక్తుల విశ్వాసం.. ఇక్కడి బసవన్న విగ్రహం అంతకంతకూ పెరుగుతోందనే ప్రచారం.. ఇలా ఎన్నో ప్రత్యేకతలకు నిలయంగా మారింది యాగంటి క్షేత్రం.అగస్త్య మహాముని తపస్సు నుంచి ఉమామహేశ్వరుల ఆవిర్భావం వరకు.. కాకులు రాకపోవడం వెనుక ఉన్న స్థలపురాణం నుంచి బసవన్న మిస్టరీ వరకు.. అడుగడుగునా ఆసక్తిని రేకెత్తించే ఈ అద్భుత క్షేత్రం గురించి తెలుసుకునేందుకు భక్తులు తరలివస్తున్నారు.మరి యాగంటి క్షేత్రం వెనుక ఉన్న అసలు కథేంటి..ఆధ్యాత్మికతకు, ప్రకృతి అందాలకు ప్రతీకగా నిలుస్తున్న ఈ ఆలయ ప్రత్యేకతలేంటి.. లెట్స్ వాచ్ ది స్టోరీ.
ఎత్తన ఎర్రమల కొండలు.. పచ్చని ప్రకృతి అందాలు.. కొండల నడుమ ప్రశాంతంగా కొలువుదీరినశివసన్నిధి అడుగుపెట్టగానే ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించే దివ్య క్షేత్రం యాగంటి. నంద్యాల జిల్లా బనగానపల్లె సమీపంలోని శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవస్థానం వందల ఏళ్ల చరిత్రకు సజీవ సాక్ష్యం. ఇక్కడి ఆలయ నిర్మాణం, శిల్పకళ, ప్రకృతి సౌందర్యం భక్తులను మాత్రమే కాదు.. చరిత్ర పరిశోధకులను సైతం ఆకట్టుకుంటున్నాయి.
ఈ క్షేత్రం ఆవిర్భావం వెనుక ఆసక్తికరమైన స్థలపురాణం ఉంది.పూర్వం అగస్త్య మహాముని ఇక్కడ శ్రీమహావిష్ణువు ఆలయాన్ని నిర్మించాలని సంకల్పించారట. అయితే ప్రతిష్ఠ సమయంలో విగ్రహం బొటనవేలు విరిగిపోవడంతో ఆయన తీవ్ర నిరాశకు గురయ్యారని స్థలపురాణం చెబుతోంది. దీంతో పరమేశ్వరుడిని ప్రసన్నం చేసుకునేందుకు అగస్త్యుడు ఘోర తపస్సు చేశారట. ఆయన తపస్సుకు మెచ్చిన శివపార్వతులు ఒకే శిలపై ఉమామహేశ్వరులుగా దర్శనమిచ్చారని భక్తుల విశ్వాసం.ఈ కారణంగానే ఇక్కడి స్వామివారిని ఉమామహేశ్వర స్వామిగా కొలుస్తారు.
Also Read: పొగమంచులో డ్రైవింగ్ చేస్తున్నారా? ఈ పొరపాట్లు చేస్తే ప్రాణాలకే ప్రమాదం!
యాగంటి ఆలయ వైభవంలో విజయనగర సామ్రాజ్య శిల్పకళకు ప్రత్యేక స్థానం ఉంది.15వ శతాబ్దంలో విజయనగర సంగమ వంశ పాలకులు హరిహర, బుక్కరాయల కాలంలో ఈ ఆలయ నిర్మాణం అభివృద్ధి చెందినట్లు చారిత్రక కథనాలు పేర్కొంటున్నాయి.రాతి స్తంభాలపై అద్భుతమైన శిల్పాలు.. సంప్రదాయ నిర్మాణ శైలి.. విశాలమైన ఆలయ ప్రాంగణం.. ప్రతి నిర్మాణంలోనూ ఆనాటి శిల్పుల ప్రతిభ కనిపిస్తుంది. శతాబ్దాలు గడిచినా చెక్కుచెదరని ఈ నిర్మాణాలు యాగంటి చారిత్రక వైభవాన్ని చాటుతున్నాయి.
యాగంటి గురించి ప్రస్తావన వస్తే ముందుగా గుర్తొచ్చే అంశం.. కాకులు వాలని క్షేత్రం సాధారణంగా దేవాలయాల వద్ద ప్రసాదాల కోసం కాకులు గుంపులుగా కనిపిస్తుంటాయి. కానీ యాగంటి ఆలయంలో మాత్రం కాకులు కనిపించవనే నమ్మకం భక్తుల్లో బలంగా ఉంది. దీని వెనుక కూడా ఓ ఆసక్తికరమైన పురాణగాథ ప్రచారంలో ఉంది. అగస్త్య మహాముని ఈ ప్రాంతంలో తపస్సు చేస్తున్న సమయంలో కాకులు ఆయన తపస్సుకు ఆటంకం కలిగించాయట. దీంతో ఆగ్రహించిన మహర్షి ఈ క్షేత్ర పరిధిలోకి కాకులు ప్రవేశించకూడదని శపించారని స్థలపురాణం చెబుతోంది.ఆ మహర్షి శాపం కారణంగానే నేటికీ కాకులు ఈ క్షేత్రానికి రావని భక్తులు విశ్వసిస్తారు. అయితే కాకులు రాకపోవడానికి సంబంధించి శాస్త్రీయంగా నిర్ధారితమైన కారణం ఉందని చెప్పడానికి ఆధారాలు లేవు. ఇదే యాగంటి ప్రత్యేకతపై ఆసక్తిని మరింత పెంచుతోంది.
యాగంటి క్షేత్రంలో మరో ఆసక్తికరమైన ప్రత్యేకత.. భారీ బసవన్న విగ్రహం ఆలయ మండపంలో కొలువుదీరిన బసవన్న విగ్రహం కాలక్రమేణా పెరుగుతోందనే నమ్మకం భక్తుల్లో ఉంది.ఈ విగ్రహం పెరుగుతున్న కొద్దీ ప్రదక్షిణలకు ఉన్న స్థలం తగ్గిపోతోందని స్థానికంగా ప్రచారం జరుగుతోంది. కలియుగాంతంలో బసవన్న లేచి రంకె వేస్తాడని పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానంలో పేర్కొన్నట్లు భక్తులు విశ్వసిస్తారు.ఒకవైపు భక్తుల నమ్మకం.. మరోవైపు విగ్రహ పరిమాణంలో మార్పులపై ఆసక్తి.. వెరసి యాగంటి బసవన్న నేటికీ ఓ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాడు.
Also Read: కాకినాడ జిల్లాలో ఘోరం.. 10వ తరగతి విద్యార్థులపై.. కుల వివక్షతో ప్రిన్సిపాల్, పీటీ టీచర్ దాడి!
యాగంటి ప్రత్యేకతలు కాకులు, బసవన్నతోనే ఆగిపోవు.ఇక్కడి ప్రకృతి ఒడిలో ఉన్న పుష్కరిణి కూడా భక్తులను విశేషంగా ఆకర్షిస్తుంది. కొండల నుంచి వచ్చే నీటితో నిండే ఈ పుష్కరిణిలో స్నానం చేయడం పవిత్రమని భక్తులు భావిస్తారు.కొండల మధ్య సహజసిద్ధంగా ఏర్పడిన ఈ నీటి వనరు.. ఆలయ పరిసరాల అందాలను మరింత పెంచుతోంది. ప్రకృతి, ఆధ్యాత్మికత, పురాతన శిల్పకళ కలగలిసిన యాగంటి క్షేత్రం ప్రతి ఒక్కరికీ ఓ ప్రత్యేక అనుభూతిని అందిస్తోంది.
ఇన్ని విశేషాలు.. మరెన్నో ఆధ్యాత్మిక రహస్యాలతో ప్రసిద్ధి చెందిన యాగంటి క్షేత్రానికి నిత్యం భక్తుల రాకపోకలు కొనసాగుతూనే ఉంటాయి. ప్రత్యేక పర్వదినాలు, పండుగల సమయంలో భక్తుల సంఖ్య మరింత పెరుగుతుంది. స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటూ.. తమ కోరికలు నెరవేరాలని ప్రార్థిస్తుంటారు. శతాబ్దాల చరిత్రను తనలో దాచుకున్న ఈ క్షేత్రం.. తరతరాలుగా భక్తి విశ్వాసాలకు ప్రతీకగా నిలుస్తోంది.
కాకులు వాలని క్షేత్రంగా పేరొందిన యాగంటి.. బసవన్న పెరుగుదలపై కొనసాగుతున్న ఆసక్తికరమైన చర్చలు.. అగస్త్య మహాముని తపస్సుతో ముడిపడిన స్థలపురాణం.. ఇలా ఎన్నో విశేషాలు ఈ దివ్యక్షేత్రాన్ని ప్రత్యేకంగానిలుపుతున్నాయి. వీటిలో కొన్ని భక్తుల విశ్వాసాలు.. మరికొన్ని చారిత్రక అంశాలు.. ఇంకొన్ని శాస్త్రీయ పరిశోధనకు ఆసక్తి కలిగించే విషయాలు.ఏది ఏమైనా.. యాగంటి కేవలం ఓ దేవాలయం మాత్రమే కాదు.. చరిత్ర, ప్రకృతి, ఆధ్యాత్మికత కలిసిన అద్భుతమైన పర్యాటక, పుణ్యక్షేత్రం.
Also read: హరీష్ రావుకు కోలుకోలేని దెబ్బ.. కవిత సంచలన వ్యూహం!