Kalakand Recipe: కలాకండ్ పేరు వినగానే నోట్లో నీళ్లు ఊరుతాయి కదా. మెత్తగా, క్రీమీగా ఉండే ఈ స్వీట్‌లో అక్కడక్కడా తగిలే డ్రై ఫ్రూట్స్ ముక్కలు మరింత రుచిని ఇస్తాయి. అయితే ప్రతిసారీ స్వీట్ షాప్‌కు వెళ్లి కొనాల్సిన అవసరం లేదు. మన వంటింట్లోనే ఉండే పాలు, పనీర్‌తో చాలా సులభంగా కలాకండ్ తయారు చేసుకోవచ్చు. దీనికోసం పెద్దగా కష్టపడాల్సిన పని కూడా లేదు. కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే.. షాప్‌లో దొరికే కలాకండ్‌లాగే మంచి రుచితో ఇంట్లోనే చేసుకోవచ్చు. మరి ఈ కలాకండ్ తయారీ విధానం ఎలాగో ఇప్పుడు చూసేద్దామా..
పాలు – 500 మి.లీ.
తురిమిన పనీర్ – 400 గ్రాములు
కండెన్స్‌డ్ మిల్క్ – 200 మి.లీ.
నెయ్యి – 1 టీస్పూన్
జీడిపప్పు ముక్కలు – 10 నుంచి 12
బాదం ముక్కలు – 8 నుంచి 10
పిస్తా ముక్కలు – 6 నుంచి 8
యాలకుల పొడి – 1 టీస్పూన్
కుంకుమపువ్వు – కొద్దిగా
ఉప్పు – చిటికెడు
ప్లేట్‌కు రాయడానికి నెయ్యి – అర టీస్పూన్
Also Read: పిల్లలు, పెద్దలు ఎంతో ఇష్టంగా తినే పుట్టగొడుగుల పాస్తా.. తయారీ విధానం మీ కోసం!
ఒక మందపాటి గిన్నెను స్టవ్‌పై పెట్టి పాలు పోయాలి. అందులో తురిమిన పనీర్ వేసి బాగా కలపాలి. మీడియం మంటపై ఉంచి, అడుగున అంటకుండా తరచూ కలుపుతూ ఉడికించాలి. పాలు తగ్గి మిశ్రమం చిక్కగా, కాస్త గింజలుగా మారే వరకు ఈ ప్రక్రియ కొనసాగించాలి.
ఇప్పుడు ఒక టీస్పూన్ నెయ్యి వేసి కలపాలి. జీడిపప్పు, బాదం, పిస్తా ముక్కలు వేసి మరో రెండు నిమిషాలు ఉడికించాలి. తర్వాత కండెన్స్‌డ్ మిల్క్, యాలకుల పొడి, కుంకుమపువ్వు వేసి అన్నీ బాగా కలిసేలా తిప్పాలి. మిశ్రమం మళ్లీ చిక్కబడే వరకు తక్కువ నుంచి మీడియం మంటపై ఉడికించాలి. చివర్లో చిటికెడు ఉప్పు వేసి కలిపి స్టవ్ ఆపేయాలి. మిశ్రమం గిన్నె అంచులను వదులుతున్నప్పుడు దించితే సరిపోతుంది.
ఒక ప్లేట్‌కు అర టీస్పూన్ నెయ్యి రాసి, వేడిగా ఉన్న మిశ్రమాన్ని అందులో వేయాలి. స్పూన్‌తో సమానంగా పరచి కొద్దిసేపు చల్లారనివ్వాలి. తర్వాత ఫ్రిజ్‌లో 30 నుంచి 40 నిమిషాలు ఉంచాలి. బాగా సెట్ అయిన తర్వాత బయటకు తీసి చతురస్రాలుగా కోయాలి. పైన కొద్దిగా పిస్తా లేదా కుంకుమపువ్వు చల్లితే చూడటానికి బాగుంటుంది.
మంచి కలాకండ్ కోసం తాజా పనీర్ వాడాలి. ఎక్కువ మంటపై ఉడికించకూడదు. అలా చేస్తే మిశ్రమం అడుగుపట్టి గట్టిగా మారుతుంది. మిగిలిన ముక్కలను గాలి చొరబడని డబ్బాలో పెట్టి ఫ్రిజ్‌లో ఉంచి రెండు నుంచి మూడు రోజుల్లో తినేయాలి. మిశ్రమం మరీ గట్టిగా అనిపిస్తే కొద్దిగా పాలు కలపవచ్చు; అయితే నీరుగా ఉంటే ఇంకొంచెం ఉడికించి, పూర్తిగా చల్లారాకే ముక్కలుగా కట్ చేసుకోవాలి.
Also Read: విరిగిపోయిన పాలతో ఇలా అంగూరీ రసమలై చేయండి.. బేకరీ స్టైల్ టేస్ట్ గ్యారెంటీ!