Home Exercises: బయట కాలుష్యం ఎక్కువగా ఉన్నప్పుడు ఉదయం వాకింగ్, జాగింగ్ కోసం బయటకు వెళ్లడం మంచిది కాకపోవచ్చు. అలాగని రోజంతా కదలకుండా ఉండాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే కొద్దిసేపు వ్యాయామం చేస్తూ శరీరాన్ని చురుగ్గా ఉంచుకోవచ్చు. మీకు వీలైన సమయాన్ని ఎంచుకుని, శక్తికి తగ్గట్టు ఈ ఐదు వ్యాయామాలు ప్రయత్నించండి. దీంతో శరీరం చురుగ్గా ఉండటంతో పాటు ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంటుంది.
బయట వాకింగ్‌కు వెళ్లలేని రోజుల్లో ఇంట్లోనే నడవటం మంచి అలవాటు. హాలులో లేదా గదుల మధ్య ఖాళీగా ఉన్న చోట నెమ్మదిగా నడవటం మొదలుపెట్టండి. కాసేపటి తర్వాత మీకు ఇబ్బంది లేకపోతే వేగాన్ని కొద్దిగా పెంచండి. ఇలా చేయడం వల్ల శరీరం చురుగ్గా ఉంటుంది. కొంత శక్తి కూడా ఖర్చవుతుంది. అయితే నడుస్తున్నప్పుడు ఆయాసం, తల తిరగడం లేదా అసౌకర్యం అనిపిస్తే వెంటనే వేగం తగ్గించి విశ్రాంతి తీసుకోండి.
వ్యాయామం చేయాలంటే బద్ధకంగా అనిపిస్తోందా? అయితే మీకు నచ్చిన పాటలు పెట్టుకుని కాసేపు డ్యాన్స్ చేయండి. చేతులు, కాళ్లు కదుపుతూ 15 నుంచి 20 నిమిషాల పాటు మీకు నచ్చినట్లు స్టెప్పులు వేయండి. దీనివల్ల శరీరంలోని వివిధ భాగాలకు కదలిక లభిస్తుంది. కేలరీలు ఖర్చవ్వడంతో పాటు మనసు కూడా ఉల్లాసంగా మారుతుంది. మొదట్లో కష్టమైన స్టెప్పులు వేయకుండా, మీకు సౌకర్యంగా అనిపించే కదలికలతో మొదలుపెట్టండి.
Also Read: గూగుల్ క్రోమ్ యూజర్లకు అలర్ట్.. ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేయకపోతే మీ పాస్వర్డ్స్, పర్సనల్ డేటా గోవిందా!
ఇంట్లో మెట్లు ఉంటే వాటిని కూడా వ్యాయామానికి ఉపయోగించుకోవచ్చు. నెమ్మదిగా మెట్లు ఎక్కి దిగడం వల్ల కాళ్లు, పిరుదుల కండరాలకు మంచి పని లభిస్తుంది. అలాగే గుండె వేగం కూడా పెరుగుతుంది. మీ శక్తిని బట్టి కొన్ని రౌండ్లు చేయండి. అయితే మోకాళ్ల నొప్పి, కీళ్ల సమస్యలు లేదా నడిచేటప్పుడు బ్యాలెన్స్ ఇబ్బంది ఉంటే ఈ వ్యాయామానికి దూరంగా ఉండటం మంచిది. మెట్లు ఎక్కేటప్పుడు తప్పనిసరిగా హ్యాండ్రైల్ పట్టుకోండి.
ఇంట్లో ఎక్కువసేపు కూర్చుని పనిచేసేవారికి కండరాలు బిగుసుకోవడం, ఒళ్లు పట్టేసినట్లు అనిపించడం సాధారణం. ఇలాంటి సమయంలో భుజాలను నెమ్మదిగా తిప్పడం, మణికట్టును కదపడం, చీలమండలను తిప్పడం వంటి చిన్న చిన్న వ్యాయామాలు చేయండి. వేళ్లను తెరవడం, మూయడం కూడా అలవాటు చేసుకోండి. ఇలా చేయడం వల్ల శరీరం తేలికగా అనిపిస్తుంది. కీళ్ల కదలిక కూడా మెరుగ్గా ఉంటుంది.
భోజనం చేసిన తర్వాత కొద్దిసేపు వజ్రాసనంలో కూర్చోవడం కూడా మంచి అలవాటు. దీనికోసం మోకాళ్లపై కూర్చుని, పాదాలపై నెమ్మదిగా వెనక్కి ఆనాలి. వెన్నును నిటారుగా ఉంచి కొన్ని నిమిషాలు సౌకర్యంగా కూర్చోండి. అయితే మోకాళ్లు, చీలమండల్లో నొప్పి ఉంటే బలవంతంగా ప్రయత్నించకండి. గుర్తుంచుకోండి.. వజ్రాసనం నడకకు లేదా ఇతర శారీరక వ్యాయామాలకు ప్రత్యామ్నాయం కాదు.