Weight Loss Paneer vs Soya Chunks| బరువు తగ్గాలని అనుకున్నప్పుడు చాలామంది మొదటగా అన్నం(రైస్) , రొట్టెలు, స్వీట్లు తగ్గించడంపై దృష్టి పెడతారు. కానీ ఆహారంలో తగినంత ప్రోటీన్ తీసుకోవడం కూడా అంతే ముఖ్యం. ఎందుకంటే ప్రోటీన్ ఎక్కువసేపు కడుపు నిండిన భావన కలిగించడంతో పాటు బరువు తగ్గే సమయంలో కండరాల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ముఖ్యంగా శాఖాహారులు ప్రోటీన్ కోసం పనీర్, సోయా చంక్స్‌ను ఎక్కువగా తీసుకుంటారు. అయితే ఈ రెండింటిలో ఏది తింటే బరువు తగ్గడానికి ఎక్కువ ప్రయోజనం ఉంటుంది? దేని వల్ల శరీరానికి ఎక్కువ ప్రోటీన్ అందుతుంది? ఇప్పుడు తెలుసుకుందాం.
పనీర్‌లో ప్రోటీన్, కాల్షియం, విటమిన్ బి12 వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి కండరాల ఆరోగ్యానికి, ఎముకల బలానికి ఉపయోగపడతాయి. అందుకే వెయిట్ లాస్ డైట్‌లో కూడా పనీర్ చేర్చుకోవచ్చు. అయితే సాధారణ పనీర్‌లో కొవ్వు శాతం కూడా ఎక్కువగా ఉంటుంది. ‘జర్నల్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ’లో ప్రచురితమైన రిపోర్ట్ ప్రకారం.. పనీర్‌లో సుమారు 16 నుంచి18 శాతం ప్రోటీన్, 22 నుంచి 25 శాతం కొవ్వు ఉంటుంది. అందువల్ల బరువు తగ్గాలనుకునేవారు పనీర్ మితంగా తీసుకోవాలి. కూరగాయలతో కలిపి తక్కువ నూనెతో వండుకోవడం మంచిది. బటర్, క్రీమ్ ఎక్కువగా ఉపయోగించే పనీర్ వంటకాలకు దూరంగా ఉండాలి.
Also Read: చాణక్య నీతి.. భర్తలు చేసే ఈ 5 తప్పులు వల్లే వైవాహిక జీవితం నాశనం
శాఖాహారులకు సోయా చంక్స్ మంచి ప్రోటీన్ ఆహారం. వీటిని ఫ్యాట్ తొలగించిన సోయా పిండితో తయారు చేస్తారు. అందువల్ల వీటిలో ప్రోటీన్ ఎక్కువగా, కొవ్వు తక్కువగా ఉంటుంది. పొడి రూపంలో ఉన్న సోయా చంక్స్‌లో 50 శాతానికి పైగా ప్రోటీన్ ఉండవచ్చు. వీటిలో ఫైబర్ కూడా ఉంటుంది. ఇది జీర్ణక్రియకు సహాయపడటంతో పాటు ఎక్కువసేపు ఆకలి వేయకుండా చూస్తుంది. సోయా ప్రోటీన్‌పై జరిగిన పరిశోధనల్లో కూడా బరువు నియంత్రణకు ఇది ఇతర ప్రోటీన్ వనరుల మాదిరిగానే ఉపయోగపడుతుందని తేలింది. అయితే సోయా చంక్స్ తినడం వల్ల మాత్రమే బరువు తగ్గరు. మొత్తం ఆహారంలో తీసుకునే క్యాలరీలు, శారీరక శ్రమ కూడా ముఖ్యమే. వీటిని కూరగాయలతో తక్కువ నూనెలో వండుకోవడం మంచిది.
Also Read: పిల్లలతో కలిసి భోజనం చేయడం వల్ల ఇన్ని ప్రయోజనాలా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాలి
ప్రోటీన్ ఎక్కువగా, కొవ్వు తక్కువగా ఉండే ఆహారం కావాలనుకుంటే సోయా చంక్స్ మంచి ఎంపిక. అయితే కాల్షియం, విటమిన్ బి12 పొందాలనుకునేవారికి పనీర్ కూడా ప్రయోజనకరమే. కాబట్టి పనీర్ పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు. రెండింటినీ తగిన మోతాదులో ఆహారంలో చేర్చుకోవచ్చు. సరైన ఆహార నియమాలు, వ్యాయామం, క్యాలరీల కంట్రోల్ పాటిస్తే ఆరోగ్యకరంగా బరువు తగ్గవచ్చు.