Change phone number in Aadhaar at home: ప్రస్తుతం ఆధార్ కార్డు అవసరం లేని పని అంటూ ఏదీ లేదనే చెప్పొచ్చు. కొత్త బ్యాంకు అకౌంట్ కావాలన్నా, ప్రభుత్వ పథకాల లబ్ధి పొందాలన్నా, సిమ్ కార్డు తీసుకోవాలన్నా, చివరికి పాన్ కార్డ్-ఐటీఆర్ వెరిఫికేషన్ కోసం కూడా ఆధార్‌తో మొబైల్ నంబర్ లింక్ అవడం చాలా ముఖ్యం. అయితే, చాలా మంది తమ పాత ఫోన్ నంబర్ పోవడంతో లేదా నంబర్ మార్చాలనుకున్నప్పుడు ఆధార్ సెంటర్ల చుట్టూ తిరుగుతుంటారు. ఈ సమస్యకు చెక్ పెట్టడానికి ఇండియన్ పోస్టల్ డిపార్ట్‌మెంట్, ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ సంయుక్తంగా ఒక అద్భుతమైన సేవను అందిస్తున్నాయి.
యూఐడీఏఐ నిబంధనల ప్రకారం మొబైల్ నంబర్ మార్చాలంటే బయోమెట్రిక్..(వేలిముద్ర లేదా ఫేస్ అథెంటికేషన్) వెరిఫికేషన్ తప్పనిసరి. అందుకే.. పూర్తిగా ఆన్ లైన్‌లో ఇంట్లో కూర్చుని మొబైల్ నంబర్ మార్చడం కుదరదు. కానీ, మీరు ఎక్కడికీ వెళ్లకుండానే మీ ఇంటికి పోస్ట్ మ్యాన్‌ను రప్పించుకునే వెసులు బాటును IPPB కల్పిస్తోంది. మీ ప్రాంతానికి చెందిన పోస్ట్ మ్యాన్ లేదా గ్రామీణ డాక్ సేవక్ ప్రత్యేక బయో మెట్రిక్ డివైజ్‌తో నేరుగా మీ ఇంటికి వచ్చి మీ ఆధార్‌లో మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేసి వెళతారు.
ఇంటి నుంచే ఈ సేవను పొందడానికి మీరు ఈ కింది స్టెప్స్ ఫాలో కావాలి.
1. ముందుగా మీ మొబైల్ లేదా ల్యాప్‌టాప్‌లో ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ అధికారిక డోర్‌స్టెప్ బ్యాంకింగ్ వెబ్‌సైట్ ఓపెన్ చేయండి.
2.అందులో ‘Non-IPPB Customer’ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకుని, సర్వీస్ లిస్టులో ‘Aadhaar – Mobile Update’ అనే ఆప్షన్‌పై టిక్ చేయండి.
3. తర్వాత మీ పేరు, పూర్తి ఇంటి చిరు నామా, పిన్ కోడ్, ఈమెయిల్ ఐడీ , మీరు కొత్తగా లింక్ చేయాలనుకుంటున్న మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయండి.
4. అన్ని వివరాలను చెక్ చేసుకున్న తర్వాత సబ్మిట్ బటన్ క్లిక్ చేయండి. మీకు ఒక సర్వీస్ రిక్వెస్ట్ నంబర్ వస్తుంది.
మీ రిక్వెస్ట్ స్థానిక పోస్ట్ ఆఫీసుకు చేరుకుంటుంది. ఒకటి రెండు రోజుల్లో మీ స్థానిక పోస్ట్ మ్యాన్ మీ ఇంటికి వచ్చి, బయోమెట్రిక్ డివైజ్ ద్వారా మీ వేలిముద్రను స్కాన్ చేసి మొబైల్ నంబర్ అప్‌డేట్ ప్రక్రియను పూర్తి చేస్తారు.
Also Read: క్రేజీ ఫీచర్లతో మార్కెట్‌ను షేక్ చేస్తున్న Huawei MatePad 11.5..ధర ఎంతంటే
ఈ డోర్‌స్టెప్ సర్వీస్ కోసం పోస్ట్ మ్యాన్‌కు అధికారికంగా కేవలం రూ.75 (జీఎస్టీతో కలిపి) మాత్రమే సర్వీస్ ఛార్జ్ చెల్లించాల్సి ఉంటుంది. నంబర్ అప్‌డేట్ అయిన తర్వాత మీకు ఒక అక్నాలెడ్జ్‌మెంట్ స్లిప్ వస్తుంది. దీనిపై ఉండే యూఆర్‌ఎన్ నంబర్ ద్వారా మీ అప్‌డేట్ స్టేటస్‌ను ఎప్పుడైనా ఆన్‌లైన్‌లో ట్రాక్ చేసుకోవచ్చు. ఇలా మీ ఆధార్ నంబర్‌ను ఈజీగా అప్‌డేట్ చేసుకోండి.