Hyderabad Metro Pillars: హైదరాబాద్ నగరంలో మెట్రో రైల్ పిల్లర్ల సమీపంలో జరుగుతున్న అక్రమ తవ్వకాలు, అనుమతి లేని నిర్మాణాలపై హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (HMRL) అధికారులు కొరడా ఝుళిపించారు. ముఖ్యంగా సికింద్రాబాద్‌లోని ఇస్కాన్ ఆలయ సమీపంలో మెట్రో పిల్లర్లు (C1192, C1193) వద్ద అనుమతులు లేకుండా లోతైన తవ్వకాలు జరపడం, అలాగే నగరంలోని పలు చోట్ల పిల్లర్లకు ఆనుకుని అక్రమ నిర్మాణాలు నిర్మించడంపై ‘బిగ్ టీవీ’ ప్రసారం చేసిన వరుస కథనాలకు మెట్రో ఉన్నతాధికారులు స్పందించారు. ఈ వ్యవహారంపై క్షేత్రస్థాయిలో పూర్తి స్థాయి వివరాలను సేకరించేందుకు 15 రోజుల డెడ్‌లైన్ విధిస్తూ కీలక ఆదేశాలు జారీ చేశారు.
ప్రాజెక్ట్ భద్రతకే మొదటి ప్రాధాన్యం
మెట్రో పిల్లర్లకు అతి సమీపంలో భారీ గుంతలు తవ్వడం, ఎలాంటి ముందస్తు అనుమతులు లేకుండా బహుళ అంతస్తుల భవనాలు నిర్మించడం వంటి ఘటనలపై హెచ్ఎంఆర్ఎల్ తీవ్రంగా స్పందించింది. మెట్రో నిర్మాణాల పటిష్టతకు ఇవి పెను ప్రమాదంగా మారే అవకాశం ఉండటంతో, సంబంధిత అధికారులను అప్రమత్తం చేసింది. నిబంధనలను అతిక్రమించి చేపట్టిన ప్రతి నిర్మాణంపై సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్ విభాగాలను ఆదేశించింది.
నిఘా నీడలో కీలక మెట్రో కారిడార్లు
ప్రస్తుతం నగరంలోని ప్రధాన మెట్రో రూట్లన్నీ అధికారుల నిఘా నీడలోకి వెళ్లాయి. ముఖ్యంగా ఎల్బీ నగర్ – మియాపూర్, నాగోల్ – రాయదుర్గం, జేబీఎస్ – ఎంజీబీఎస్ కారిడార్ల వెంట ఉన్న ప్రాంతాల్లో అధికారులు ప్రత్యేక తనిఖీలు చేపట్టనున్నారు. మెట్రో రైట్ ఆఫ్ వే పరిధిలో జరిగిన ఆక్రమణలు, తవ్వకాల వివరాలను ఈ 15 రోజుల్లోగా గుర్తించి జాబితా రూపొందించనున్నారు.
BIG TV Effect: HMRL Reacts On Metro Pillars Excavations | అక్రమ నిర్మాణాలపై..15 రోజుల డెడ్‌లైన్!
Hyderabad Metro Rail Limited (HMRL) focuses on identifying illegal constructions in Hyderabad. A 15-day deadline has been set to collect details of unauthorized buildings and… pic.twitter.com/2S7gogkUSs
— BIG TV Breaking News (@bigtvtelugu) November 14, 2026
అక్రమ కట్టడాలకు కూల్చివేత తప్పదా?
గడువు ముగిసిన వెంటనే క్షేత్రస్థాయి నివేదిక ఆధారంగా హెచ్ఎంఆర్ఎల్ తన తదుపరి కార్యాచరణను అమలు చేయనుంది. అనుమతులు లేకుండా నిర్మించిన కట్టడాలకు ముందుగా నోటీసులు జారీ చేసి, ఆ తర్వాత జీహెచ్ఎంసీ, పోలీసుల సహకారంతో కూల్చివేతలు చేపట్టే అవకాశం ఉంది. మెట్రో ప్రయాణికుల భద్రత విషయంలో ఎలాంటి రాజీ పడే ప్రసక్తే లేదని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
Also Read: అధికారం కంటే ప్రజలే ముఖ్యం.. అదే రాహుల్ గాంధీ ఆశయం: మంత్రి శ్రీధర్ బాబు