China New Virus: చైనాలో విజృంభిస్తున్న హెచ్‌ఎంపీవీ వైరస్ ఇండియాలోకి ఎంటర్ అయింది. కర్ణాటకలో రెండు హెచ్‌ఎంపీవీ (HMPV) వైరస్ కేసులను గుర్తించారు. HMPV కేసులు గుర్తించినట్లు ఐసీఎంఆర్ ప్రకటిచింది. బెంగళూరులో, మూడు, 8 నెలల వయసున్న ఇద్దరు చిన్నారులకు ఈ వైరస్ సోకినట్లు నిర్ధారించింది. రక్త పరీక్షల ద్వారా వైరస్ సోకినట్లు ప్రకటించారు.
ఇండియాలో రెండు కేసులు నమోదవడంతో అందరి గుండెల్లో దడ మొదలైంది. చైనాలో HMPV వైరస్ కేసులు పెరుగుతుండటంపై భారత్ అలర్ట్ అయ్యింది. ఎలాంటి ఆందోళన అవసరం లేదని కేంద్ర వైద్యారోగ్యశాఖ ఓ ప్రకటన విడుదల చేసిన కొద్ది గంటల్లోనే భారత్‌లో తొలి కేసు నమోదైంది. దేశంలో రెండు కేసులు నమోదు కావడంతో వైద్య, ఆరోగ్య సిబ్బంది, అధికారులు అప్రమత్తం అయ్యారు.
ప్రాణాంతకమైన కరోనా వ్యాపించిన ఐదేళ్ల తర్వాత, మరో కొత్తరకం వైరస్ కేసులు చైనాలో నమోదవుతున్నాయి. ఈ న్యూ వైరస్ 14 ఏళ్ల లోపున్న చిన్నారులపై ఎక్కువగా ప్రభావం చూపుతోంది. హ్యుమన్ మెటానిమోవైరస్ అనే కొత్త వైరస్‌కు చెందిన ఇన్‌ఫెక్షన్ కేసులు ఎక్కువగా ఉత్తర చైనాలో నమోదవుతున్నట్టు కథనాలు వస్తున్నాయి. ఈ వైరస్ సోకిన వ్యక్తులలో జలుబు, కోవిడ్-19 వంటి లక్షణాలు కనిపిస్తున్నాయని.. ఇది వేగంగా వ్యాప్తి చెందుతోందని తెలుస్తోంది.
అయితే.. చైనా సరిహద్దు దేశాలన్ని దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టామని.. ప్రస్తుతానికి ఈ వైరస్ గురించి భయపడాల్సిన పనిలేదని భారత ఆరోగ్య సేవల డైరెక్టర్ జనరల్ తెలిపారు. భారత కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ శనివారం జాయింట్ మానిటరింగ్ గ్రూప్ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో విస్తృత స్థాయిలో చర్చలు జరిపిన తర్వాత.. కొన్ని విషయాలకు చైనా అధికారులు అంగీకరించినట్లు తెలుస్తోంది. ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోల్లో.. చాలామంది రోగులు హాస్పిటల్ వద్ద అవస్థలు పడుతున్నట్లు కనిపించారు. ఫ్లూ వంటి లక్షణాలు ఈ రోగుల్లో కనిపిస్తున్నట్లు పేర్కొన్నారు.
కరోనా తర్వాత.. చైనాలో ప్రజలకు మరోసారి కొత్త వైరస్ ముప్పు పొంచి ఉందనే ఆందోళనలు పెరిగాయి. 2019లో ప్రపంచాన్ని వణికించిన కోవిడ్ వైరస్ కూడా చైనాలోని వూహాన్‌లో పుట్టిందని నమ్ముతున్నారు. చైనా ప్రభుత్వ వార్తా వెబ్‌సైట్ గ్లోబల్ టైమ్స్ పేర్కొన్న వివరాల ప్రకారం.. ఉత్తర చైనాతో పాటు బీజింగ్, నైరుతి నగరం చాంగ్‌కింగ్, దక్షిణ చైనాలోని గ్వాంగ్‌డాంగ్ నగరంలో హెచ్‌ఎంపీవీ కేసులు నమోదవుతున్నట్లు సమాచారం.
2024 డిసెంబర్ 27న రాయిటర్స్‌లో ప్రచురితమైన కథనం ప్రకారం, శీతాకాలంలో శ్వాశకోసం సంబంధించిన వ్యాధులు కేసులు ఎక్కువ అవుతున్న తరుణంలో.. ఒక పైలట్ నిఘా వ్యవస్థను ప్రారంభించినట్లు చైనా ఆరోగ్య సంస్థలు పేర్కొన్నట్లు తెలిపింది.
హెచ్‌ఎంపీవీ వైరస్ లక్షణాలు
జలుబు, దగ్గు, ఊపిరితిత్తులు శ్వాశతీసుకోవడంలో ఇబ్బందిగా ఉంటుంది. కొన్ని సార్లు న్యూమోనియా, ఆస్తమా వంటి శ్వాశకోస సంబంధిత సమస్యల దారితీసే అవకాశం ఉంది.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
-కనీసం 20 సెకన్ల పాటు చేతులను శుభ్రంగా సబ్బుతో కడుక్కోవాలి.
-రద్దీగా ఉండే ప్రాంతంలో తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలి.
-తుమ్మిన, దగ్గినా నోటికి, ముక్కుకి రూమాల లేదా టవల్‌ను అడ్డం పెట్టుకోవాలి.
-వీలైనంత వరకు చలి ప్రదేశాల్లో తిరగవద్దు
-ఇంటి పరిశరాలు, ఇంట్లో పరిశుభ్రత పాటించాలి.
-ఛాతిలో నొప్పి మొదలైన లక్షణాలు కనిపిస్తే.. వైద్యపరీక్షలు చేయించాలి.
-తగినంత పోషకాహారం, మంచి నీరు, కంటి నిండా నిద్ర తప్పనిసరి.
-వ్యాధి లక్షణాలు కనిపిస్తున్న వ్యక్తులతో కరచాలనం చేయకూడదు.