PM Modi: ఎన్డీయే సర్కార్ రైల్వే ఆధునికీకరణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తుందన్నారు ప్రధాని నరేంద్రమోదీ. ఈ విషయంలో ఒక్కో అడుగు ముందుకు వేస్తూ దేశంలో రైల్వేలను కొత్త పుంతలు తొక్కిస్తున్నామన్నారు. కనెక్టివిటీకి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు.
సోమవారం ఉదయం చర్లపల్లి రైల్వే టెర్నినల్‌ను ఢిల్లీ నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు ప్రధాని నరేంద్రమోదీ. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. మెట్రో నెట్ వర్క్ పరిధి 1000 కిలోమీటర్లకు పైగా విస్తరించిందన్నారు. జమ్ముకాశ్మీర్, ఒడిషా, తెలంగాణలో కొత్త కనెక్టవిటీకి ఏర్పాటు చేశామన్నారు. రైల్వేరంగంలో మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. 430 కోట్ల రూపాయలతో చర్లపల్లి రైల్వే టెర్నినల్‌ను అభివృద్ధి చేసినట్టు చెప్పుకొచ్చారు.
భారతదేశ అభివృద్ధికి రైల్వే చాలా కీలకమన్నారు సీఎం రేవంత్‌రెడ్డి. తెలంగాణ లాంటి రాష్ట్రాల అభివృద్ధి కూడా దీనిపై ఆధారపడిందన్నారు. హైదరాబాద్‌లోని చర్లపల్లిలో కొత్త టెర్మినల్, స్టేషన్‌ను పూర్తి చేసినందుకు కేంద్రానికి కృతజ్ఞతలు చెప్పారు. హైదరాబాద్ నుంచి బందర్ పోర్ట్ వరకు గ్రీన్ ఫీల్డ్ హైవే, డైరెక్ట్ రైల్వే నిర్మాణానికి కేంద్రం సహకరించాలని కోరారు.
తెలంగాణలో 370 కిలోమీటర్ల మేర రీజనల్ రింగ్ రోడ్‌ను నిర్మిస్తున్నామని, అలాగే రీజనల్ రింగ్ రైలు నిర్మాణానికి కేంద్రం పూర్తిగా సహకరించాలన్నారు. హైదరాబాద్ మెట్రో రైలు ఫేజ్-2కు ప్రతిపాదనలు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి పంపిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చచేశారు.
ALSO READ: వచ్చారు, వెళ్లారు.. విచారణ ఎదుర్కోలేక డ్రామా?
వికారాబాద్ నుంచి కృష్ణా రైలు మార్గాన్ని, కల్వకుర్తి నుంచి మాచర్ల మధ్య కొత్త రైల్వే లైన్లు, డోర్నకల్ నుంచి రెండు లైన్లు ఏర్పాటు చేయాలన్నారు. ఒక ట్రిలియన్ డాలర్ జీడీపీ ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను తీర్చిదిద్దాలని తాము సంకల్పం చేశామని, దేశం 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలన్న లక్ష్యానికి ఇది ఉపయోగపడుతుందన్నారు.
మరోవైపు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని విధాలా అండగా ఉంటామన్నారు. MMTS అభివృద్ధి కి BRS ప్రభుత్వం స్పందించలేదన్నారు. యాదాద్రి వరకు MMTS అభివృద్ధి చేస్తామంటే ఆనాడు ప్రభుత్వం సైలెంట్ అయ్యిందన్నారు.
భూ సేకరణ విషయంలో ప్రభుత్వం సహకరిస్తే MMTS ను యాదాద్రి వరకు తీసుకువస్తామన్నారు. అలాగే కోమరివెళ్లి రైల్వే స్టేషన్ ఏర్పాటు చేస్తామని, ఏడాదిలో అద్భుతమైన రైల్వే స్టేషన్ నిర్మిస్తామన్నారు. చర్లపల్లి టెర్మినల్ కోసం అప్రోచ్ రోడ్స్ ప్రదానమని, అప్పటి సీఎం కేసీఆర్‌కు 10 ఉత్తరాలు రాసినా ఎలాంటి స్పందన లేదన్నారు.