BigTV English

Husband Affair: నా భర్త.. నాతో కాకుండా వేరొకరితో ఉంటున్నాడు – అడిగితే.. అలాంటి లాజిక్కు సమాధానం చెబుతున్నాడు

Husband Affair: నా భర్త.. నాతో కాకుండా వేరొకరితో ఉంటున్నాడు – అడిగితే.. అలాంటి లాజిక్కు సమాధానం చెబుతున్నాడు

పెళ్లయిన ప్రతి మహిళకు ఏదో ఒక సమస్య ఉంటుంది. కొంతమంది ఆర్థిక సమస్యలు ఉంటే, మరి కొందరికి సంతాన సమస్యలు ఉంటాయి. ఇక్కడ ఉన్న మహిళకు మాత్రం సవతి సమస్య వచ్చి పడింది.


ప్రశ్న: మా ఇద్దరం ఐదేళ్లు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నాం. నా భర్త నన్ను బాగా చూసుకునేవారు. ప్రేమించినప్పుడు కూడా నా కోసం తన తల్లిదండ్రులను ఎదిరించారు. నేను కూడా నా తల్లిదండ్రులను ఎదిరించి అతడిని పెళ్లి చేసుకున్నాను. నా భర్త మంచితనం చూసి నా తల్లిదండ్రులు కూడా కరిగిపోయారు. మా అత్త మామ కూడా నన్ను చేరదీశారు. ఇప్పుడు మాకు ఇద్దరు పిల్లలు. ఇద్దరు పిల్లలు పుట్టే వరకు మా కాపురం సజావుగానే సాగింది. ఆయనా అన్నింట్లో నాకే మొదటి స్థానం ఇచ్చేవారు. నేను ఏ వంట చేసినా పొగిడేవారు. ప్రతి వారం మమ్మల్ని బయటకు తీసుకెళ్లేవారు.

అలాంటిది ఈమధ్య అతని ప్రవర్తన చాలా మారిపోయింది. ఎందుకలా మారిపోయారో తెలుసుకునేందుకు కొన్ని రోజులు అతనిపై నిఘాపెట్టా. అప్పుడే తెలిసింది అతని ఆఫీసులో ఉండే అమ్మాయితో మా వారు మళ్లీ ప్రేమలో పడ్డారు. ఆమెతో కలిసి సాయంత్రం పూట బయటకు తిరుగుతున్నారు. వీకెండ్స్ లో కూడా నన్ను పిల్లల్ని ఇంట్లో వదిలేసి ఆమెతోనే బయటకు వెళ్తున్నారు. ఈ విషయం తెలిశాక ఒకరోజు గట్టిగా నిలదీశాను.


నేను ఎంతో ఆవేదనతో బాధతో అడిగిన ప్రశ్నకు ఆయన చాలా కూల్ గా సమాధానం ఇచ్చారు. ‘ఎందుకు బాధపడతావు. ఆమెను నేను పెళ్లి చేసుకోలేదు కదా, కేవలం సంబంధం మాత్రమే పెట్టుకున్నాను. నీ స్థానం నీదే. ఆమె స్థానం ఆమెదే’ అని చెప్తున్నారు. అది నేను భరించలేకపోతున్నాను. నాకన్నా ఆమెకే ఇప్పుడు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారు. పిల్లల్ని కూడా పెద్దగా పట్టించుకోవడం లేదు. ఆమె మైకంలోనే పడి తిరుగుతున్నారు. అంతేకాదు ఈమధ్య నేను ఏ పని చేసినా తప్పుపడుతున్నారు. నలుగురు ముందు నన్ను ఏదో ఒకటి అనేందుకు చూస్తున్నారు. ఇంతకుముందు నేను వండిన వంటలు ఎంతో నచ్చేవి. కానీ ఇప్పుడు అవే నచ్చకుండా పోయాయి. ఆఫీస్‌కి లంచ్ బాక్స్ పెడతానన్నా వద్దంటున్నారు. ఆమెతో పాటు బయట తినేందుకు, ఆమె ఈయన కోసం తెచ్చిన ఆహారాన్ని తినేందుకు ఇష్టపడుతున్నారు.

నేను ఆ మహిళతో కూడా మాట్లాడాను. పెళ్లయిన వ్యక్తితో ఇలా సంబంధం పెట్టుకోవడం మంచిది కాదని చెప్పాను. దానికి ఆమె కూడా నీ దగ్గర దొరకని సంతోషం నాతో దొరుకుతుంది అని అంటుంది. ఏం చేసుకుంటావో చేసుకో అని చాలా పరుషంగా మాట్లాడుతోంది. నాకు ఏం చేయాలో తెలియడం లేదు. మా అత్తమామలు, మా అమ్మ నాన్నలు అందరూ ముసలివారైపోయారు. ఇప్పుడు విషయం తెలిస్తే ఆరోగ్యం ఏమవుతుందోనన్న భయం నాకుంది. అలా అని నా భర్తను వేరే మహిళకు వదిలేయలేను. ఏం చేయాలో చెప్పండి?

జవాబు: మీకు వచ్చిన కష్టాన్ని మానసికంగా తట్టుకోవడం చాలా కష్టం. అంతవరకు ప్రేమగా ఉన్న వ్యక్తి ఒక్కసారిగా మరొక స్త్రీ రాకతో మారిపోతే ఆ ఒత్తిడిని భరించలేము. అయితే మీరు ఈ విషయంలో చాలా నెమ్మదిగా ఉన్నారు. ఇలా ఉంటే మీ జీవితం చక్కబడదు. ముందు మీరు ఇంట్లో వారికి నెమ్మదిగా ఈ విషయాన్ని బయట పెట్టాల్సిన అవసరం ఉంది. మీరు బయట పెట్టరనే ధైర్యం కూడా మీ వారికి ఉండవచ్చు. మీ ఆయనతో కానీ, ఆయనతో సంబంధం పెట్టుకున్న మహిళతో గాని వ్యవహరించే తీరు కాస్త పరుషంగానే ఉండాలి.

ముందు మీ ఇంట్లోని పెద్దవారికి ఈ విషయాన్ని తెలియజేయండి. పరువు కోసమో, పిల్లల కోసమో ప్రతిదీ భరిస్తూ పోతూ ఉంటే ఆయన ఇంకా మరిన్ని సంబంధాలు పెట్టుకునే అవకాశం ఉంటుంది. ఈ అమ్మాయితో సంబంధం తెగిపోయాక మరొక మహిళతో సంబంధం పెట్టుకోరని మీరు చెప్పగలరా? కాబట్టి వీరికి చట్టబద్ధంగా మీరు సమాధానం చెప్పాల్సిందే. చట్టబద్ధంగా అడుగులు వేసే ముందు ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ ను ఆశ్రయించండి. ఆ అమ్మాయిని, మీ భర్తను కూడా పిలిపించి వారు మాట్లాడతారు. అడల్ట్రీ అనేది మన దేశంలో పెద్ద సమస్యగా మారిపోయింది. అలాంటి వ్యక్తితో మీరు కలిసి ఉండటం వల్ల జీవితాంతం క్షోభ తప్ప ఇంకేమీ మిగలదు. పిల్లలను కూడా కాదని కొన్ని రోజుల పరిచయంలోనే ఒక అమ్మాయికి అంతగా దాసోహం అయిపోతే… ఆ వ్యక్తి మీ జీవితాంతం వెంట ఉండే అవకాశం తక్కువే. కాబట్టి మీరు మీ పిల్లల కోసం దృఢంగా మారాలి. మీరు ఉద్యోగం కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది. అంతేకాదు అడల్ట్రీ కింద కేసు పెడితే ఆ ఇద్దరికీ గట్టిగానే కోర్టు బుద్ధి చెబుతుంది.

Also Read:  రెబెక్కా సిండ్రోమ్… భార్యాభర్తల మధ్య సంబంధాన్ని నాశనం చేసే ఒక సమస్య ఇది

హిందూ అడాప్షన్స్ అండ్ మెయింటెనెన్స్ ఆక్ట్ ప్రకారం మీకు మీ పిల్లల పోషణకు ఖర్చులు కూడా అతను ఇవ్వాల్సి వస్తుంది. అలాగే గృహహింస చట్టం కింద కూడా మీరు కేసు వేయొచ్చు. మీరు విడాకులు తీసుకోకుండానే అతనికి బుద్ధి చెప్పవచ్చు. కానీ అలాంటి వ్యక్తితో జీవితాంతం కలిసి ఉండేందుకు మీరు సిద్ధపడితే మాత్రం మీ జీవితం చీకటిమయంగా మారిపోతుంది. భార్యకు, తల్లిదండ్రులకు, తనకు పుట్టిన ఇద్దరు పిల్లలకు విలువ ఇవ్వకుండా వేరే స్త్రీ సాంగత్యాన్ని కోరుకునే పురుషుడిని జీవితాంతం నమ్మేందుకు వీలు లేదు. మీరు మీ పిల్లల కస్టడీతో పాటు వారి భవిష్యత్తు బాధ్యతను కూడా తీసుకోవాలి. అందుకోసం మీరు ముందుగా మీ అమ్మానాన్నల మద్దతును కోరండి. అలాగే మీ అత్త మామలకు కూడా విషయాన్ని తెలియజేయండి. ముందు ఇంట్లోనే ఈ విషయం గురించి చర్చించండి. ఆ తర్వాతే ధైర్యంగా ముందుకు వెళ్ళండి. మీలాంటి ఆడవాళ్లు ఇంట్లోనే ఉండి ఇలా మగవాడి బాధలను భరిస్తూ ఉంటే వారు ఇంకా రెచ్చిపోతూనే ఉంటారు. హిందూ చట్టం ఇచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకొని అలాంటివారికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది.

Related News

Cinnamon water: ఖాళీ కడుపుతో దాల్చిన చెక్క నీరు తాగితే.. మతిపోయే లాభాలు !

Junk Food: పిజ్జా, బర్గర్‌లు తెగ తినేస్తున్నారా ? జాగ్రత్త !

Health Tips: ఒమేగా- 3 ఫ్యాటీ యాసిడ్స్‌తో చర్మం, జుట్టుకు బోలెడు లాభాలు !

Broccoli Benefits: బ్రోకలీ తింటున్నారా ? అయితే ఈ విషయాలు తెలుసుకోండి

Weight Loss: ఈ యోగాసనాలతో.. 10 రోజుల్లోనే వెయిట్ లాస్

Sugar: చక్కెర తినడం 30 రోజులు ఆపేస్తే.. ఏం జరుగుతుందో తెలుసా ?

Big Stories

×