ఒక వ్యక్తి జీవితంలో ఎంతో మంది స్నేహితులు, బంధువులు ఉంటారు. అందరూ మంచివారే అనుకోవడానికి లేదు. ఎంతోమంది మనసులో ద్వేషాన్ని నింపుకొని బయటకు చిరునవ్వుతో కనిపిస్తారు. అలాంటి వ్యక్తుల గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. మీ చుట్టూ ఉన్న వ్యక్తులు అంతా మీతో అనుబంధం కలిగి ఉండవచ్చు. కానీ లోపల మనసు పొరల్లో మీపై ద్వేషం ఉండొచ్చు. అలాంటి ఫేక్ ఫ్రెండ్స్ లేదా ఫేక్ రిలేటివ్స్‌ను మీరు గుర్తించడం చాలా ముఖ్యం. ఎందుకంటే అలాంటి వ్యక్తులు అవకాశం వచ్చినప్పుడు మీకు ద్రోహం చేసే అవకాశం ఉంది. మీ మంచిని ఎప్పుడూ కోరుకునే వ్యక్తులు కారు కాబట్టి మిమ్మల్ని ద్వేషించే వ్యక్తులను గుర్తించాలి. దాని కోసం కొన్ని లక్షణాలు పై అవగాహన పెంచుకోవాలి. మిమ్మల్ని ద్వేషించే వ్యక్తులు కొన్ని రకాల లక్షణాలను కచ్చితంగా కలిగి ఉంటారు.
మీ స్నేహితుల్లో, బంధువులు మీతో పాటే కలిసి జీవించేవారు ఎక్కువ మందే ఉంటారు. నిత్యం మీతో పాటు పనిచేసే మీ సహోద్యోగి కావచ్చు లేదా మీ స్నేహితుడు కావచ్చు… వారు మీ విజయం పట్ల అసంతృప్తిగా కనిపిస్తే అలాంటి వ్యక్తులను నమ్మకండి. అతడు లోపల మిమ్మల్ని ద్వేషిస్తాడని అర్థం. మీ ముందు నవ్వుతున్నా… మీ పురోగతి గురించి అతనికి చెప్పినప్పుడు మాత్రం అతనిలో సంతోషం కనబడదు. పైగా మీకు దూరంగా ఉండేందుకు వారు ప్రయత్నిస్తారు. మీ పురోగతిని చేసి అసూయ ఫీల్ అవుతున్న వ్యక్తి కచ్చితంగా మీకు భవిష్యత్తులో శత్రువే అవుతాడు. అతనితో మీకు ఎప్పుడైనా ముప్పు పొంచే ఉంటుంది. కాబట్టి అలాంటి వ్యక్తులను నమ్మడం మానేయండి.
మీరు ఏదైనా సాధిస్తే భరించలేని వ్యక్తులు మిమ్మల్ని ఎప్పుడూ అవమానపరచడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. మీరు చేసే చిన్న పనిని కూడా విమర్శిస్తారు. మిమ్మల్ని బాధ పెట్టే ఏ అవకాశాన్ని వదులుకోరు. మీరు సాధించిన విజయాల గురించి చెప్పినప్పుడు… అది ఏమాత్రం పెద్ద విషయం కాదని, మిమ్మల్ని అవమానించడానికి, మీ విజయాన్ని తక్కువ చేయడానికి చూస్తారు. ఇలాంటి అలవాట్లు మీ స్నేహితులు లేదా బంధువుల్లో కనిపిస్తే వారిని అనుమానించాల్సిందే. అలాంటి వ్యక్తులకు పూర్తిగా దూరంగా జరగడం చాలా ముఖ్యం. అలా పూర్తిగా పక్కన పెట్టలేని పరిస్థితి వస్తే పరిమితంగా మాట్లాడడానికి ప్రాధాన్యత ఇవ్వాలి. అతిగా స్నేహం చేయకూడదు.
బయటకు నవ్వుతూ కనిపిస్తున్నా లోపల ద్వేషాన్ని నింపుకున్న వ్యక్తికి మీరు ఎలాంటి సాయం చేసినా అది గొప్పగా కనిపించదు. మీరు చేసిన పెద్ద సాయాన్ని, చిన్న సాయాన్ని కూడా మెచ్చుకోకుండా చులకనగా చూస్తూ నా వ్యక్తిని నమ్మకండి. మీరు చేసిన ఉపకారాన్ని కూడా మరిచిపోయి మిమ్మల్ని విమర్శిస్తూ ఉంటే… వారితో జాగ్రత్తగా ఉండాలని అర్థం. వారు మీకు మంచి స్నేహితులు ఎప్పటికీ కాలేరని తెలుసుకోండి. మీరు చేసిన సాయాన్ని కూడా తక్కువ చేసి చూస్తూ ఇతర వ్యక్తుల దగ్గర మిమ్మల్ని విమర్శిస్తూ ఉంటే ఆ వ్యక్తి మనసు పొరల్లో మీపై విపరీతమైన ద్వేషాన్ని కలిగి ఉన్నాడని అర్థం చేసుకోండి. అలాంటి వ్యక్తులకి దూరంగా ఉంటే మీరు ప్రశాంతంగా జీవిస్తారు. లేకుంటే సమస్యలు కొని తెచ్చుకున్న వారవుతారు. స్నేహితులు ఉండడం చాలా ముఖ్యం. కానీ ఇలాంటి మేక వన్నె పులులు వంటి స్నేహితులు ఉంటే మీరు సమస్యల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది.