గర్భధారణ సమయం చాలా సున్నితమైనది. తల్లి ఎంత ఆరోగ్యంగా ఉంటే పుట్టే బిడ్డ కూడా అంతే ఆరోగ్యంగా జన్మిస్తాడు. అయితే గర్భధారణ సమయంలో కొంతమంది స్త్రీలు గుండె జబ్బులు బారిన పడుతూ ఉంటారు. లేదా కొలెస్ట్రాల్ పెరగడం, గుండె కొట్టుకునే రేటు తగ్గడం వంటివి జరుగుతూ ఉంటాయి. ఇలాంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు పుట్టబోయే బిడ్డకు కూడా గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉందా? అనే సందేహం ఎక్కువ మందిలో ఉంటుంది.
హార్మోన్ల సమస్యలు
గర్భధారణ సమయంలో మహిళలు అనేక హార్మోన్ల సమస్యలను ఎదుర్కుంటారు. ఇది పొట్టలో ఉన్న శిశువులపై కూడా ప్రభావం చూపిస్తుంది. అయితే గర్భధారణ సమయంలో హార్మోన్ల సమస్యలు ఏర్పడినా కూడా తల్లి ఎటువంటి మందులు వాడకూడదని వైద్యులు చెబుతారు. ముఖ్యంగా గర్భధారణ సమయంలో స్త్రీకి డయాబెటిస్, థైరాయిడ్ వంటి వ్యాధులు ఉంటే అది పిల్లలపై ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుంది. కాబట్టి గుండె సమస్యలు బారిన పడిన గర్భిణీకి పుట్టే పిల్లలకు కూడా గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుంది.
బిడ్డ బరువు తక్కువగా…
ప్రజలు చెబుతున్న ప్రకారం గర్భిణీ స్త్రీకి గుండె సంబంధిత సమస్యలు ఉంటే ఆమె బిడ్డ బరువు తక్కువగా ఉండవచ్చు. బరువు తగ్గడం వల్ల పిల్లల పెరుగుదల అభివృద్ధి ప్రభావితం అవుతాయి. అలాగే బిడ్డ పుట్టిన తర్వాత ఇన్ఫెక్షన్ బారిన పడే అవకాశం అధికంగా ఉంటుంది. వారు కాలుష్య కారకాలను తట్టుకోలేరు.
గుండె జబ్బుతో బాధపడుతున్న గర్భిణీ స్త్రీకి ఆక్సిజన్ శరీరానికి తగినంత అందకపోవడం వంటివి జరగవచ్చు. దీనివల్ల పిల్లల మెదడు అభివృద్ధి సరిగా జరగదు. అలాంటి వారికి మానసిక సమస్యలు ఉన్న బిడ్డ పుట్టే అవకాశం ఉంటుంది. అలాగే గర్భిణీ స్త్రీలకు ఇచ్చే గుండె జబ్బుల మందులు బిడ్డపై కూడా ప్రభావం చూపిస్తాయి.
ముందస్తు ప్రసవం
గర్భిణీకి గుండె సమస్య ఉంటే ప్రసవం ముందుగానే జరిగిపోవచ్చు. అలాగే పిండానికి సరిపడా పోషకాలు కూడా అందకపోవచ్చు. తల్లికి గుండె జబ్బులు ఉంటే బిడ్డకు కూడా పుట్టుకతోనే గుండె లోపాలు వచ్చే ప్రమాదం పెరిగిపోతుంది.
అలాగే గర్భధారణ సమయంలో ప్రీఎక్లాంప్సియా, మధుమేహం, ముందస్తు జననం వంటి సమస్యలు వస్తే.. ఆ తల్లికి భవిష్యత్తులో గుండె జబ్బులు వచ్చే ప్రమాదం పెరిగిపోతుంది.
ప్రపంచవ్యాప్తంగా గుండె జబ్బులతో ఇబ్బంది పడుతున్న గర్భిణీలలో ప్రతి వంద మందిలో నలుగురికి ప్రాణాంతక సమస్యలు వస్తున్నాయి.
కాబట్టి గర్భిణీలకు గుండె సమస్యలు ఏవైనా వస్తే పుట్టబోయే బిడ్డపై కచ్చితంగా ప్రభావం పడుతుంది.
కాబట్టి గర్భధరించిన స్త్రీకి గుండె సంబంధిత సమస్య ఉంటే కచ్చితంగా బిడ్డ ఆరోగ్యం కూడా నీరసించిపోతుంది. కాబట్టి గుండె జబ్బులున్న మహిళలు జాగ్రత్తగా ఉండాలి.