ఆధునిక కాలంలో కళ్ళపై ఒత్తిడి ఎక్కువగా పడుతుంది. ఫోన్లు, టీవీలు వల్ల కళ్ళు దెబ్బతింటున్నాయి. అలాగే కాలుష్యం వల్ల కూడా కళ్ళపై అధిక ప్రభావం పడుతుంది. ఇవన్నీ కూడా కళ్లద్దాలకు కారణం అవుతున్నాయి. కొంతమందికి చూపు సరిగా కనబడక కళ్లద్దాలు పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తోంది. అయితే కంటి చూపుని మెరుగుపరిచే ఆహారాలను ప్రతిరోజు తినడం ద్వారా ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు. మన చుట్టూ ఉండే ఐదు రకాల ఎర్రటి ఆహారాలు మీకు కళ్లద్దాల బాధను తప్పిస్తాయి. వీటిని మీరు ప్రతిరోజు తినేందుకు ప్రయత్నించండి. ఇవి కచ్చితంగా అద్భుతంగా పనిచేస్తాయి.
టమోటోలు
ఈ టమోటోలలో లైకోపీన్ అధికంగా ఉంటుంది. ఇది శక్తివంతమైన యాంటీ యాక్సిడెంట్ లైకోపీన్ కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది. కంటి శుక్లాలు, వయసు సంబంధిత మ్యాక్యులర్ డిజెనరేషన్ వంటి సమస్యలు రాకుండా ఇది అడ్డుకుంటుంది. టమోటాలలో విటమిన్ సి కూడా అధికంగా ఉంటుంది. కాబట్టి టమోటోలు తినడం వల్ల కంటి వాపు తగ్గుతుంది. అంటే శరీరంలో ఇన్ఫ్లమేషన్ కూడా తగ్గుతుంది. దీనివల్ల దృష్టిని కాపాడుకోవచ్చు.
ఎరుపు కాప్సికం
ఎరుపు రంగులో ఉండే క్యాప్సికం ను బెల్ పెప్పర్ అని అంటారు. వీటిలో విటమిన్ సి, లూటీన్, జియాక్సంతిన్ అధికంగా ఉంటాయి. విటమిన్ సి అనేది కంటి రోగ నిరోధక శక్తిని బలంగా మారుస్తుంది. ఇక లూటీన్, జియాక్సంతిన్ వంటివి కంటి కణాలను కాపాడతాయి. హానికరమైన అతినీలలోహిత కిరణాల నుండి రక్షించడంలో ఈ రెండు ముందుంటాయి. కాబట్టి తరచూ ఎరుపు రంగు క్యాప్సికం తినేందుకు ప్రయత్నించండి. ఇది వయసు సంబంధిత కంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి.
స్ట్రాబెర్రీలు
స్ట్రాబెరీలు ఎంతోమందికి ఫేవరెట్ ఫ్రూట్. కానీ ఇవి చాలా తక్కువగా లభిస్తాయి. స్ట్రాబెర్రీలలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. కంటి ఆరోగ్యానికి స్ట్రాబెర్రీ ఎంతో మేలు చేస్తుంది. కంటి కణాలను దెబ్బ తినకుండా కాపాడడంలో విటమిన్ సి ముందుంటుంది. తద్వారా దృష్టిని కూడా కాపాడుతుంది. స్ట్రాబెర్రీలలో యాంటీ ఆక్సిడెంట్లు నిండుగా ఉంటాయి. ఇవి కంటి ఇన్ఫ్లమేషన్ ను తగ్గించి దృష్టిని మెరుగు పరుస్తాయి.
ఎర్ర ద్రాక్ష పళ్ళు
ద్రాక్షలో చాలా రకాలు ఉన్నాయి. అందులో ముఖ్యమైనవి ఎరుపు రంగులో ఉండే ద్రాక్షలు. ఈ ఎర్ర ద్రాక్షలో రెస్వెరాట్రాల్ అని పిలిచే యాంటీ ఆక్సిడెంట్ అధికంగా ఉంటుంది. ఇది కంటి ఆరోగ్యాన్ని కాపాడడానికి సహాయపడుతుంది. కణాలను ఫ్రీ రాడికల్స్ నుండి రక్షిస్తుంది. దృష్టిని మెరుగుపరుస్తుంది. ఎర్ర ద్రాక్షను క్రమం తప్పకుండా తీసుకుంటే కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీకు కళ్లద్దాలు పెట్టుకునే అవసరం కూడా చాలా వరకు తగ్గుతుంది.
ఆపిల్
ఆపిల్ పండ్లు ప్రతి చోటా విరివిగా దొరుకుతాయి. ఆపిల్స్ లో విటమిన్ ఏ, విటమిన్ సి తో పాటు వివిధ యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ముందుంటాయి. రెటీనాను కాపాడడంలో విటమిన్ ఏ ముఖ్యమైనది. విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు కంటి వాపును తగ్గించడంలో దృష్టిని మెరుగుపరచడంలో సహాయపడతాయి. కాబట్టి రోజుకు ఒక యాపిల్ తినడం వల్ల మీకు అన్ని విధాలా మేలు జరుగుతుంది. కేవలం కంటి ఆరోగ్యానికే కాదు, మొత్తం శరీర ఆరోగ్యానికి కూడా ఆపిల్ సహాయపడుతుంది. కాబట్టి ప్రతిరోజూ ఒక ఆపిల్ తినేందుకు ప్రయత్నించండి.