Women’s Commission serious: కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురిక్యాల ప్రభుత్వ పాఠశాలలో వెలుగులోకి వచ్చిన షాకింగ్ ఘటనపై సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. బాలికల వాష్‌రూమ్‌లో అటెండర్ యాకూబ్ పాషా గోప్యంగా కెమెరా అమర్చి వీడియోలు చిత్రీకరించినట్లు బాలికలు గుర్తించడంతో విషయం వెలుగు చూసింది. తాజాగా ఈ ఘటనపై తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ తీవ్రంగా స్పందించింది. కమిషన్ చైర్‌పర్సన్ నేరెళ్ల శారద ఈ సంఘటనను తీవ్రంగా ఖండించారు.
విద్యాసంస్థల్లో చదువుకునే బాలికల భద్రత, గౌరవం పట్ల నిర్లక్ష్యాన్ని ఏ రూపంలోనూ సహించబోమని చైర్‌పర్సన్ తీవ్రంగా హెచ్చరించారు. ఈ విషయంపై తక్షణమే స్పందించిన చైర్‌పర్సన్, జిల్లా కలెక్టర్, జిల్లా పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి, నిందితుడిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
Read Also: ప్రభుత్వ పాఠశాలలో షాకింగ్ ఘటన…. బాలికల వాష్ రూంలో కెమెరా!
విద్యాసంస్థలు విద్యార్థినులకు స్వేచ్ఛాయుత, సురక్షితమైన వాతావరణం కల్పించాలని, వారిపై ఎలాంటి వేధింపులు, అనుచిత ప్రవర్తనను ఏమాత్రం సహించబోమని స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జిల్లా యంత్రాంగం అన్ని పాఠశాలలు, కాలేజీలు, హాస్టళ్లలో ఆకస్మిక తనిఖీలు చేపట్టి భద్రతా చర్యలను మరింత బలోపేతం చేయాలని ఆదేశించారు. ఈ కేసు పురోగతిని మహిళా కమిషన్ నిరంతరం పర్యవేక్షిస్తుందని, బాధిత విద్యార్థినులకు, వారి కుటుంబాలకు అన్ని విధాల సహకారం అందిస్తామని చైర్‌పర్సన్ శారద హామీ ఇచ్చారు.