గ్రామాల్లో మద్య నిషేధం విధించడం తరచుగా వింటూనే ఉంటాం. ఒకవేళ ఆ నిర్ణయాన్ని ఎవరైనా ఉల్లంఘిస్తే పంచాయతీ పెద్దలు జరిమానా విధిస్తారు. అయితే, తాజాగా ఉత్తరాఖండ్ లోని ఓ గ్రామం తీసుకున్న రెండు నిర్ణయాలు దేశ వ్యాప్తంగా ఆసక్తి కలిగిస్తున్నాయి. ఇంతకీ ఆ నిర్ణయాలు ఏంటి? ఎందుకు ఆసక్తి కలిగిస్తున్నాయి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
డెహ్రాడూన్ జిల్లా చక్రతా ప్రాంతంలోని గిరిజన గ్రామమైన కందార్ పంచాయతీ ప్రజలు రెండు కీలక నిర్ణయం తీసుకున్నారు. మహిళలు వివాహంతో పాటు ఇతర సామాజిక కార్యక్రమాలకు మూడు కంటే ఎక్కువ బంగారు ఆభరణాలు ధరించకూడదంటూ తీర్మానాన్ని తీసుకొచ్చారు. దీన్ని అందరూ సామూహికంగా ఆమోదించారు. బంగారం ధరలు పెరగడం, సంపదను ప్రదర్శించడానికి సామాజిక ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ తీర్మానం ప్రకారం.. మహిళలు మంగళసూత్రం( పెళ్లి అయిన వారు), ముక్కు పుడక, చెవి దిద్దులు మాత్రమే ధరించాలి. వీటికి మించి బంగారు నగలు వేసుకుంటే రూ. 50,000 జరిమానా విధిస్తారు. ఆ గ్రామానికి చెందిన 80 ఏళ్ల ఉమాదేవి ఈ నిర్ణయాన్ని స్వాతించింది. “మా గ్రామంలో చాలా మంది పేదవాళ్లు ఉన్నారు. సాధారణ జీవితాలను గడుపుతున్నారు. పంచాయతీ సరైన నిర్ణయం తీసుకుందని నేను నమ్ముతున్నాను” అని చెప్పుకొచ్చింది.
ఆ గ్రామంలో గత 15-20 సంవత్సరాలలో కొంత మంది ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన తర్వాత, వారి కుటుంబాల ఆర్థిక స్థితి మెరుగుపడింది. అప్పటి నుంచి భారీ బంగారు ఆభరణాలు ధరించే ధోరణి పెరిగింది. ఆ కుటుంబాలకు చెందిన మహిళలు తరచుగా 180-200 గ్రాముల బరువున్న డిజైనర్ బంగారు సెట్లను ధరిస్తున్నారు. ప్రస్తుత ధరల ప్రకారం.. ఆ నగల ధర రూ. 22 నుంచి రూ. 25 లక్షల వరకు ఉంటుంది. పేదల ప్రజలు తమ దగ్గర బంగారు ఆభరణాలు లేక సామాజికంగా బాధపడుతున్నారు. ఇకపై గ్రామంలో అలాంటి ఇబ్బందులు ఉండకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నారు పంచాయతీ పెద్దలు.
అటు విదేశీ మద్యం విషయంలోనూ పంచాయతీ పెద్దలు కీలక నిర్ణయం తీసుకున్నారు. గ్రామ పరిధిలో ఫారిన్ మద్యాన్ని నిషేధించారు. ఒకవేళ ఎవరైనా నింబంధనలను ఉల్లంఘించి తీసుకొస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ నిర్ణయాన్ని ఆ గ్రామానికి చెందిన మహిళ తుల్సా దేవి సమర్థించారు. బంగారు ఆభరణాలే కాదు, విదేశీ మద్యం నిర్ణయం సమర్థనీయం. “మేము స్థానికంగా పానీయాలను తక్కువ పరిమాణంలో తయారు చేసేవాళ్ళం. కానీ, ఇప్పుడు విదేశీ మద్యం మా ఇళ్లలోకి అడుగు పెట్టింది. ఈ మద్యం కారణంగా కుటుంబాల మీద ఎంతో భారం పడుతుంది. దీన్ని ఆపేందుకు పంచాయతీ పెద్దలు చక్కటి నిర్ణయం తీసుకున్నారు” అని ఆమె చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ నిర్ణయాలు ఉత్తరాఖండ్ తో పాటు దేశ వ్యాప్తంగా ఆసక్తి కలిగిస్తున్నాయి. ఇలాంటి తీర్మానాలు దేశ వ్యాప్తంగా చేయాల్సిన అవసరం ఉందనే చర్చకు కారణం అయ్యింది.
Read Also: దుబాయ్ లోనే కాదు.. బంగారం ఈ దేశాల్లోనూ వెరీ చీప్!