తెలుగువారి భోజనంలో గారెలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. పండగలు వస్తే చాలు… ఇంట్లో గారెలు ఉండాల్సిందే. అలాగే టిఫిన్ సెంటర్లలో కూడా ఇడ్లీతో పాటు కచ్చితంగా పక్కన గారె కూడా ఉంటుంది. ఎందుకంటే గారెలకు అభిమానులు ఎక్కువ. గారెలు వండాలంటే నాలుగు గంటల ముందే మినప్పప్పును నానబెట్టి రుబ్బి రెడీ చేసుకోవాలని అనుకుంటారు. నిజానికి ప్రతిసారి మినప్పప్పు తోనే గారెలు చేయాల్సిన అవసరం లేదు. క్రిస్పీగా, క్రంచీగా ఉండే రవ్వ గారెలను చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇవి అప్పటికప్పుడే ఇన్సెంట్ గా రెడీ అయిపోతాయి. రవ్వ గారెలు ఎలా చేయాలో రెసిపీ ఇక్కడ ఇచ్చాము.
ఇన్స్టెంట్ గారెల రెసిపీకి కావలసిన పదార్థాలు
ఉప్మా రవ్వ – రెండు కప్పులు
అల్లం తురుము – ఒక స్పూను
కరివేపాకులు – గుప్పెడు
కొత్తిమీర తరుగు – ఒక స్పూను
పచ్చిమిర్చి తరుగు – ఒక స్పూను
ఉప్పు – రుచికి సరిపడా
నీరు – తగినంత
బేకింగ్ సోడా – చిటికెడు
ఇన్స్టెంట్ గారెల రెసిపి
1. స్టవ్ మీద కళాయి పెట్టి నీటిని వేయండి. ఆ నీటిని మరిగించండి.
2. మరిగించిన తర్వాత అందులో సన్నగా తరిగిన అల్లము, కరివేపాకులు, కొత్తిమీర తరుగు, పచ్చిమిర్చి తరుగు, ఉప్పు వేసి బాగా కలపండి.
3. ఆ తర్వాత ఉప్మా రవ్వను కూడా వేసి బాగా కలపండి. అది చిక్కగా దగ్గరగా అయ్యేవరకు ఉంచండి.
4. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దాన్ని గోరువెచ్చగా అయ్యేవరకు ఉంచండి.
5. అందులో రెండు స్పూన్ల నూనె వేసి మీ అరచేతితో దాన్ని బాగా పిసకండి. అది పిండిలాగా అవుతుంది.
6. అప్పుడు మీ అరచేతికి కాస్త నెయ్యి రాసుకొని చిన్న ముద్ద తీసుకొని దాన్ని చేతులతోనే గారెల్లాగా ఒత్తుకోండి.
7. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి డీప్ ఫ్రై చేయడానికి సరిపడా నూనె వేయండి.
8. ఆ నూనెలో ఈ ఒత్తుకున్న గారెలను వేసి గోధుమ రంగు వచ్చేవరకు బాగా వేయించుకోండి.
9. తర్వాత వాటిని తీసే టిష్యూ పేపర్ మీద వేయండి. అదనపు టిష్యూ పేపర్లో పీల్చుకుంటాయి. గారెలు రెడీ అయిపోయినట్టే.
పుదీనా చట్నీతో ఈ వడలను పిల్లలకు ఇవ్వండి. వారు చాలా ఇష్టంగా తింటారు. ఇవి క్రంచిగా క్రిస్పీగా ఉంటాయి. మీకు కావాలనుకుంటే చిటికెడు బేకింగ్ సోడా వేసుకుంటే ఇంకా క్రిస్పీగా వస్తాయి. ఒకసారి నేను చెప్పిన పద్ధతిలో ఈ క్రంచి గారెలు చేసి చూడండి. ఎవరైనా ఇంటికి అతిధులు వచ్చినప్పుడు ఇలా అప్పటికప్పుడు గారెలు చేసి పెడితే టేస్టీగా ఉంటాయి. ఈ గారెలను చికెన్ గ్రేవీతో తిన్నా కూడా రుచిగానే ఉంటాయి. ఒకసారి ట్రై చేసి చూడండి.