భార్యాభర్తల మధ్య ప్రేమ అనేది విలువైన అనుబంధం. ఇందులో తగాదాలు, వాదనలు ఉంటూనే ఉంటాయి. ఆ చిన్న చిన్న గొడవలు, ప్రేమలు సంసారంలో సహజమే. అయితే కొంతమంది భర్తలు చాలా సులువుగా భార్యలతో పదే పదే అబద్ధాలు చెప్పేస్తూ ఉంటారు. నిజానికి ఈ విషయాన్ని వారు చాలా తేలికగా తీసుకుంటారు. అయితే భార్యల విషయంలో మాత్రం అబద్ధాలు చెప్పడం అనేది తీవ్రంగా భావించాలి. ప్రతి విషయాన్ని అబద్ధంగా మార్చే భర్త దేని గురించైనా మీ దగ్గర దాచే అవకాశం ఉంది. అబద్ధాలు చెప్పడం అనే అంశాన్ని భార్య తేలికగా తీసుకోకూడదు. భర్తకు ఉన్న ఆ అలవాటును మానిపించాలి. లేకపోతే భవిష్యత్తులో ఎన్నో సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
పిల్లలు అవే నేర్చుకుంటారు
అబద్ధాలు చెబుతున్న భర్త నుంచి పిల్లలు కూడా అవే నేర్చుకుంటారు. చుట్టుపక్కల వారికి కూడా మీ మీద నమ్మకం పోతుంది. మీకు విలువ ఇవ్వడం తగ్గిస్తారు. అబద్దాలు చెప్పే భర్తతో ఉండే భార్యకు కూడా సమాజంలో విలువ ఉండదు. వారి పిల్లలను కూడా చిన్న చూపు చూస్తారు. కాబట్టి మీ భర్తకు అబద్దాలు చెప్పే అలవాటును మానిపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
అబద్ధం అనేది చిన్న పదమే కావచ్చు కానీ భార్యాభర్తల మధ్య నమ్మకాన్ని అది విచ్చిన్నం చేస్తుంది. అనుబంధంలో చీలికలను తీసుకొస్తుంది. కాబట్టి మీ మీ భర్తకు అబద్దాలు చెప్పే అలవాటును మీరే మానిపించాలి.
అబద్దాలను నిలదీయండి
ముందుగా మీ భర్త అబద్ధాలు చెబుతున్న సంగతిని మీరు గ్రహించినట్టు అతనికి అర్థం అవ్వాలి. ఈ విషయాన్ని మీరు బహిరంగంగా మాట్లాడాలి. అబద్ధం చెప్పడం ఎంత ప్రమాదకరమో అతనికి వివరించాలి. ప్రజల ముందు ఎంత చులకనగా అవుతారో కూడా మీ భర్తకు వివరించి చెప్పండి. అతను ఒకసారి చెప్పినప్పుడు వినకపోవచ్చు, కానీ ప్రతిరోజు అలా చెబుతూనే ఉండండి. అబద్ధం చెప్పినప్పుడల్లా అది అబద్ధం అని మీరే గట్టిగా అతనికి నొక్కి చెప్పండి. అబద్ధాలు చెప్పడం వల్ల తాను ఇకపై ఏదీ నమ్మనని వివరించండి. అబద్దాలు చెప్పడం మానుకోమని చెప్పండి.
కారణం తెలుసుకోండి
మీ భర్త అబద్ధాలు చెప్పడానికి కారణాన్ని అన్వేషించండి. మీ భర్త భావాలను మీరు అర్థం చేసుకుంటే అతను అబద్ధాలు చెప్పే అవకాశం తగ్గవచ్చు. కాబట్టి మీరు ముందు అతడిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అసలు మీతో ఎందుకు అబద్ధాలు చెబుతున్నాడో తెలుసుకోండి. మీ భర్తతోనే కూర్చొని మాట్లాడండి. మీకు తెలిసిన నిజాలను చెప్పండి. అతనిపై కోపం తెచ్చుకొని అరవకుండా ప్రశాంతంగా మాట్లాడడానికి ప్రయత్నించండి. నిజమనేది బంధంలో ఎంత అవసరమో వివరించండి.