AP Govt: ఏపీలో పేదలకు ఇంటి స్థలాలు ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిన విషయం అందరికీ తెలిసిందే. ఇప్పటికీ సొంతిల్లు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి ఇంటి స్థలం మంజూరు దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అందుకై ఉత్తర్వులు విడుదల చేసింది. రాష్ట్రంలో అందరికీ ఇల్లు కార్యక్రమం కింద గ్రామీణ ప్రాంతాలలో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు కేటాయింపుకు నిబంధనలు తెలియజేస్తూ ఆదేశాలు జారీ చేసింది.
పట్టణాల్లో ప్రభుత్వ స్ధలం అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో 2 సెంట్ల చొప్పున ఇంట్లోని మహిళ పేరుతో కేటాయిస్తారు. పట్టణాల్లో ప్రభుత్వ భూములు లభించని చోట ఏపీ టిడ్కో, యూఎల్బీ, ఇతర ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా నిర్మించి ఇస్తారు. ఇంటి స్ధలం, లేదా ఇల్లు పొందిన వారికి పూర్తి హక్కులు కేటాయించిన నాటి నుంచి 10 ఏళ్ల తరువాత లభిస్తాయి. అర్హత కలిగిన వ్యక్తికి జీవితంలో ఒక్కసారి మాత్రమే హౌస్ సైట్ పొందేందుకు అర్హుడుగా ప్రకటించిన ప్రభుత్వం, పట్టా ఇచ్చిన రెండేళ్లలోగా ఇంటిని లబ్దిదారు నిర్మించుకోవాలని సూచించింది. ప్లాటును ఆధార్, రేషన్ కార్డులకు లింక్ చేయడం ద్వారా డూప్లికేషన్ లేకుండా చూడాలి.
అర్హతలు..
తెల్లరేషన్ కార్డు కలిగి ఉండాలి. ఏపీలో ఎక్కడా సొంత ఇల్లు, స్థలం కలిగి ఉండకూడదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వల నుండి ఎలాంటి ఇంటి స్ధలం పొంది ఉండకూడదు. కేంద్ర, రాష్ట్ర పభుత్వాల హౌసింగ్ స్కీంలలో దేనిలోనూ లబ్ది పొంది ఉండకూడదు. అయిదు ఎకరాలు మించి వ్యవసాయ భూమి మెట్ట, రెండున్నర ఎకరాలు జరీబు లేదా మెట్ట, జరీబు కలిపి 5 ఎకరాలకు మించకుండా భూమి ఉన్న వారు అర్హులుగా పరిగణించబడుతారు.
ఉచితంగా ఇంటి స్థలం పొందేందుకు కొన్ని ధృవీకరణ పత్రాలను తప్పనిసరిగా అందజేయాలి. అందుకై ఆధార్ కార్డు జిరాక్సులు, అందులో భార్య, భర్తల సంతకాలు, రేషన్ కార్డు జిరాక్స్, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్, జాబ్ కార్డు జిరాక్స్, పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలు 2, కుల దృవీకరణ పత్రం, ఆదాయ దృవీకరం పత్రం, ఆధార్ కి అనుసంధానం గల మొబైల్ నెంబర్ కలిగి ఉండాలి. ఈ దరఖాస్తులు సమర్పించిన యెడల అధికారులు అర్హత పరిశీలించి, ఎంపిక నిర్వహిస్తారు.