Eating fast: ఈ రోజుల్లో చాలామంది ఉరుకులు పరుగుల జీవితంలో తినడానికి కూడా సమయం కేటాయించలేక, అల్పాహారం లేదా భోజనం త్వరగా ముగించేస్తున్నారు. అయితే, ఇలా తినడం వల్ల జీర్ణక్రియపై ప్రతికూల ప్రభావం పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
యాసిడ్ రిఫ్లక్స్
తొందరగా తినేటప్పుడు ఆహారాన్ని సరిగ్గా నమలకుండా మింగేస్తాం. నమలడం జీర్ణక్రియలో మొదటి దశ, ఇక్కడ లాలాజలం ఆహారాన్ని చిన్న ముక్కలుగా విడగొడుతుంది. లాలాజలంలోని ఎంజైమ్‌లు పిండి పదార్థాలను జీర్ణం చేయడం ప్రారంభిస్తాయి. సరిగా నమలకపోతే, పెద్ద ఆహార ముక్కలు కడుపులోకి వెళ్తాయి, దీనివల్ల కడుపు ఎక్కువగా పనిచేయాల్సి వస్తుంది. ఇది అజీర్ణం, కడుపు ఉబ్బరం, అసౌకర్యానికి దారితీస్తుంది. ఎక్కువ కాలం ఇలా చేస్తే, యాసిడ్ రిఫ్లక్స్ లేదా గ్యాస్ట్రైటిస్ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.
విటమిన్ లోపం
వేగంగా తినడం వల్ల శరీర సహజ జీర్ణ లయ కూడా దెబ్బతింటుంది. మెదడు, కడుపు కలిసి జీర్ణ రసాలను ఉత్పత్తి చేయడానికి సిగ్నల్స్ పంపుతాయి. ఆహారం నోటిలోకి వెళ్లకముందే, దాని వాసన లేదా రూపం చూసి ఈ ప్రక్రియ మొదలవుతుందని నిపుణులు చెబుతున్నారు. వేగంగా తినడం వల్ల ఈ సిగ్నల్స్ సరిగా పనిచేయవు, జీర్ణ ఎంజైమ్‌లు తక్కువగా ఉత్పత్తి అవుతాయి. దీనివల్ల పోషకాలు సరిగా అందవు, దీంతో శరీరంలో విటమిన్ లోపాలు ఏర్పడవచ్చట.
అధిక బరువు
త్వరగా తినడం వల్ల అవసరానికి మించి తినేస్తాం. కడుపు నిండిన సంకేతం మెదడుకు చేరడానికి 20 నిమిషాల సమయం పడుతుంది. వేగంగా తినేటప్పుడు ఈ సమయంలోనే ఎక్కువ ఆహారం తినేస్తాం, దీనివల్ల బరువు పెరగడం, కడుపులో ఒత్తిడి, గుండెల్లో మంట వంటి సమస్యలు వస్తాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
లో బీపీ
ఒత్తిడిలో తినడం కూడా జీర్ణక్రియను దెబ్బతీస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఒత్తిడిలో ఉన్నప్పుడు శరీరం “పోరాట లేదా పారిపో” స్థితిలోకి వెళ్తుంది, దీనివల్ల జీర్ణ అవయవాలకు రక్త ప్రవాహం తగ్గుతుంది. ఇది కడుపు తిమ్మిరి, ఉబ్బరం లేదా ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ (IBS) లక్షణాలకు దారితీస్తుందట.
ఈ సమస్యలను నివారించడానికి నిపుణులు నిదానంగా, శ్రద్ధగా తినమని సూచిస్తున్నారు. ఆహారాన్ని బాగా నమిలి, ప్రతి రుచిని ఆస్వాదిస్తూ, ప్రశాంత వాతావరణంలో తినడం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. భోజనానికి కనీసం 20-30 నిమిషాలు కేటాయించడం, ఫోన్ లేదా టీవీ నుండి దూరంగా ఉండడం, చిన్న చిన్న భోజనాలు తరచూ తినడం మంచిది.